
కరోనా సమయంలో అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపినందుకు నేను చాలా మంది దీవెనలు నేను అందుకున్నాను. ఓ తల్లి… రవి నా కొడుకు అని దీవించారు! ఇప్పుడు మా అమ్మ లేరు కానీ అలాంటి దీవెనలు నాకు చాలా సంతోషం ఇస్తాయి. ఎందకంటే, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మే! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి పెద్ద సంస్థల్లో చదువుకోకపోయినా… మా అమ్మ, నాన్న నేర్పిన పాఠాలు చాలా విలువైనవని నేను నమ్ముతాను. అప్పట్లో మా అమ్మ, నా చేతిలో కొంత సొమ్ము పెట్టి నువ్వు నచ్చిన చదువు చదువుకో అనే స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను.
ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకున్నా!
వరంగల్ కు 120 కి.మీ. దూరంలో ఉన్న ఊరు మాది. అందులో ఓ 15 కి.మీ. అడవిలో నడిచి వెళ్లాలి. అలాంటి ప్రాంతం నుంచి నన్ను పంపడానికి, మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం! 11 ఏళ్ల వయస్సులో ఊరు వదిలి వరంగల్ నగరానికి వచ్చి ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. నేను చదువుకునేటప్పుడే… ట్యూషన్లు చెప్పి నా ఖర్చులకు సంపాదించుకున్నా! ఎలాగూ హాస్టల్ లోనే ఉంటున్నావు కదా, ఖర్చులు ఏముంటాయని డబ్బు ఇచ్చేవారు కాదు! అందుకే నా ఖర్చులు నేనే సంపాదించుకునేవాడిని.
అప్పట్లో పదో తరగతి పూర్తయితే ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో పేరు నమోదు చేసుకునేవారు. అక్కడి నుంచి ఉద్యోగాలు వచ్చేవి. మానాన్న చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. చదువైనా చదవాలి, పనైనా చేయాలి… ఖాళీగా ఉండొద్దని చెప్పేవారు! మాకు వ్యవసాయ భూములు కూడా ఉండేవి. మా ఊళ్లో కొందరు చదివినా ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేం పనులకు వెళ్తే కూలీల ఖర్చు తగ్గుతుందని మా నాన్న అనేవారు. పిల్లలు అటు చదువుకూ.. ఇటు పనికీ పనికిరాకుండా పోతారేమో అన్న భయం ఆయనలో కనిపించేది. అది భయం కాదు జాగ్రత్త అని తర్వాత తెలుసుకున్నాను.

నా వ్యక్తిత్వం… నాన్న నేర్పిన పాఠం!
మా నాన్న వ్యసనాల గురించి మాటిమాటికీ హెచ్చరించేవారు. పేకాట, మద్యం లాంటి వ్యసనాలు.. మనిషిని బాగా ప్రభావితం చేస్తాయని చెప్పేవారు. వ్యక్తిత్వం చాలా ముఖ్యమని నాన్న అనేవారు. చెడు సావాహాలు మనిషిని పాడు చేస్తాయని ఆయన నమ్మకం. ఎప్పుడూ మంచి కోసమే పని చేయాలని చెప్పేవారు. ఆయన చాలా పట్టుదల మనిషి. చాలా ధైర్యస్తుడు. అప్పట్లోనే తన భూమి వివాదాల్లో హైకోర్టు వరకూ వెళ్లి వచ్చారు. రాజులా తినాలి, బంటులా పని చేయాలని చెప్పేవారు. ఆయన ఎలాంటి అనారోగ్యం లేకుండా 90 ఏళ్లు జీవించారు.
నాన్నకు నచ్చని అమెరికా జీవితం..
మా నాన్న కూడా బాగా చదువుకున్నారు. అప్పట్లో ఆయనకు ఉద్యోగం వచ్చినా, ఎవరి దగ్గరో ఎందుకు పని చేయాలంటూ మా తాతగారు నాన్నను ఉద్యోగం చేయవద్దన్నారట. నేను అమెరికాలో స్థిరపడటం చూసి నాన్న సంతోషించారు. ఒకసారి అమెరికాకు వచ్చారు కానీ ఇక్కడి జీవితం ఆయనకు అంతగా నచ్చలేదు. మేం చదివేటప్పుడు కూడా మానాన్న మా చదువుతో తప్పకుండా ఉపాధి దొరకాలి అనే వారు. అందుకే మేం ఉద్యోగాలిచ్చే చదువుల కోసం ప్రయత్నించాను.
అమెరికా… అవకాశాల స్వర్గం!
అమెరికా గురించి చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఇక్కడ దాదాపు అందరూ పని చేస్తారు.. ఇక్కడ ఈ చదువు వచ్చిన వాళ్లే ఈ పని చేయాలని ఏమీ నిబంధన ఏమీ లేదు. చాలా మందికి ఈ విషయంలో అపోహలు ఉంటాయి. నేను సాఫ్ట్ వేర్ ద్వారా వెళ్లాను కదా… మా ఫీల్డులో చాలామంది సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్‌లేని వారు కూడా పని చేస్తుంటారు. ఇక్కడ అలా అవకాశం ఇస్తారు. ఇది నిజంగానే గొప్ప విషయం.
మేం ఇంటర్‌లో 300 మందిలో కేవలం ఐదుగురమే పాసయ్యం. అప్పట్లో పదో తరగతిలోనూ చాలా తక్కువ మంది పాసయ్యారు. పది పాస్ కావడం అప్పట్లో గొప్ప విషయం. అలా చదువుకునే విషయంలోనే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అందులో విజయం సాధించాను. ఆ తత్వం నాకు అమెరికాలోనూ ఉపయోగపడింది. నాకు ఇంజినీరింగ్ లో డిగ్రీ లేకపోయినా ఈ తత్వం నాకు సవాళ్లు ఎదుర్కోవడంలో బాగా ఉపయోగపడింది. అనేక ఏళ్ల పాటు ప్రాక్టీసు చేయడం వల్ల పర్ ఫెక్షన్ వచ్చింది. తెలుగు మీడియం నుంచి వచ్చినా ఆంగ్లంపై పట్టు సాధించాను. ఇంటర్, డిగ్రీలో ఇంగ్లీష్ బాగా చదివాను.. పట్టు సాధించాను. అప్పట్లోనే నేను ఇతరులకు కూడా ఇంగ్లీషు ఇతరులకు బోధించేవాడిని. ఇది నావల్ల కాదు అని ఎప్పుడూ భావించే వాడిని కాదు. ఆ దృక్పధం నాకు బాగా తోడ్పడింది.

అప్పుడే చాలా కష్టం అనుభవించా…
ఇక్కడ కరోనా సమయంలో ఫ్లయిట్ సర్వీస్ ప్రాజెక్టు చేసినప్పుడు కూడా ఈ తత్వం నాకు తోడ్పడింది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ఎక్కువ ఆలోచిస్తా. నేను నిర్ణయం తీసుకోవడంలో చాలా నెమ్మదిగా ఉంటా. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని సాధించేవరకూ వదిలిపెట్టను. అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపే విషయంలో నేను చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. అసలు ఈ ఫ్లయిట్ సర్వీసుల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా భారతీయులకు సేవ చేయాలనే ఆలోచనతోనే దీనిపై దృష్టి సారించా. కరోనా సమయంలో ఇండియా వచ్చేందుకు ఒక్కో ఫ్లయిట్‌కు 300 సీట్లు ఉంటే 30 వేల మంది అప్లయ్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు ఉన్న పరిచయాల ద్వారా చాలా కష్టపడి ఈ ఫ్లయిట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేశా.
మూడు టైమ్‌జోన్లలో ఒకేసారి పని చేశా
ఇండియా, అమెరికా విమాన సంస్థలు ఆపరేషన్లకు సిద్ధంగా లేని సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సేవలు అందించాను. అమెరికా ఎంబసీలో 30 వేల మంది రిజిస్టర్ చేసుకుంటే, నా వద్ద 2వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతో ఒత్తిడి అధిగమించి ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడం నా జీవితంలోనే అత్యంత సంతృప్తినిచ్చింది. నేను జీవితంలో ఎక్కువగా కష్టపడింది ఈ ప్రాజెక్టులోనే.
ప్రస్తుతం నేను ప్రథమ్ సంస్థతో కలసి పని చేస్తున్నాను. అది విద్యారంగంలో సేవ చేస్తున్న సంస్థ. మరో ఆంట్రపెన్యువర్ సంస్థలోనూ సభ్యుడిగా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు సాయం చేయాలన్నదే నా అభిలాష. 2018లో ఇవాంకా (నాటి అమెరికా అధ్యక్షుని కుమార్తె) బృందంలో సభ్యుడిగా అతిథిగా అడుగు పెట్టడం చాలా సంతృప్తి ఇచ్చింది.

స్మార్ట్‌ఫోనే అత్యుత్తమ ఆయుధం..
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యువత చేతిలో ఉంది. దాంతోనే ఏదైనా చేయొచ్చు. నైపుణ్యాలు ఎక్కడైనా ఒక్కటే. ఇంగ్లిష్ రానంత మాత్రాన మనం వెనుకబడిపోవాల్సిన అవసరం లేదు. ఓ చైనా బిజినెస్ మెన్ ఇంగ్లిష్ రాకుండానే అమెరికాలో మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి, భాషతో పని లేదు. మనమీద మనకు నమ్మకం ఉంటే చాలు. మీకు ఉన్న స్కిల్‌పై ఆధాపడండి చాలు. పెద్దగా ఆలోచించండి… మీరు ఎదగండి… నలుగురికి ఉపాధి కల్పించండి!