
‘వ్యాపారంలో కోటి రూపాయలు వచ్చినా రాని ఆనందం… నా కొడుక్కి ఒక షర్టు కొనిస్తే సంతోషంగా పదిమందికీ చెప్పుకుంటాను’ అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ విషయం అక్షరాలా వాస్తవమని పిల్లలున్న అమ్మానాన్నలంతా ఒప్పుకుంటారు. తమకు ఉన్నా లేకున్నా పిల్లలకు ఏలోటూ రాకుండా పెంచుతారు. కానీ ఎదిగే పిల్లలకు షూ కొనాలన్నప్పుడు అమ్మానాన్నలకు పెద్ద సమస్యే ఎదురవుతుంది. అప్పటికి కరెక్ట్ సైజ్ తీసుకున్నా, కొన్నిరోజులకే పాదాలు పెరగడంతో అవి బిగుతు అవుతాయి. దాంతో ఇబ్బందిపడక తప్పదు. చాలా ఖర్చు చేసి వాటిని కొంటారు కాబట్టి వెంటనే వాటిని పారేయడానికి మనసు ఒప్పదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు పూణెకు చెందిన సత్యజిత్ మిట్టల్. పిల్లల పాదాల సైజు పెరుగుతున్నా ఆయా షూ సాగేలా తయారు చేశాడు మిట్టల్.
ఎదిగే పిల్లల విషయంలో మన దేశంలో, ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాగూ నాలుగు రోజుల్లో పెరుగుతారు కదా అని, బట్టల్లో కూడా పెద్ద సైజునే ఎంచుకుంటారు. కానీ షూ విషయంలో ఇలా ఎక్కువ, తక్కువ సైజుల్లో పిల్లలకు తొడగడం వల్ల వాళ్లకు సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా పదేళ్ల లోపు పిల్లలకు పాదాల సైజుల్లో త్వరగా మార్పులు వస్తాయి. అందుకే తల్లిదండ్రులు షూ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. వీటన్నింటినీ దగ్గర నుంచి చూసిన సత్యజిత్.. ఫూట్ వేర్ స్టార్టప్ ‘ఆరెట్టో’ ను మొదలుపెట్టాడు.
‘‘పిల్లలెవరైనా తమ మొదటి పదేళ్ల జీవితంలో, ఎప్పుడూ కాళ్లకు సరిగ్గా సరిపోయే షూ ను ధరించరు. కారణం ప్రతి మూడు నెలలకు వాళ్ల పాదాల సైజుల్లో మార్పు వస్తుంది. 13 ఏళ్ల వయసు వచ్చేచాక ఒక్కో పిల్లాడు 15 సైజుల షూస్ వాడాల్సి ఉంటుంది. కానీ మనచుట్టూ. మన ఇళ్లలో అది జరుగుతోందా అంటే లేదని చెప్పాలి. అందుకే నేను ప్రొడక్ట్ డిజైనర్ నుంచి ఎంట్రప్రెన్యూర్ గా మారాలనుకున్నాను. ఇప్పుడున్న రోజుల్లో షూ ధరలు బాగా పెరిగాయి. దాంతో తల్లిదండ్రులు తరచూ షూ మార్చే పరిస్థితుల్లో లేరు. రెండేళ్ల పరిశోధన, అధ్యయనం తర్వాత ఈ వ్యాపారం ప్రారంభించాను. ఎదిగే పిల్లల కాళ్లకు సరిపోయే షూ తయారు చేశాను. పాదం పరిమాణం పెరిగినా, షూ సాగేలా తద్వారా పాదాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అదే నా కంపెనీ ప్రత్యేకత కూడా’’ అని సత్యజిత్ మిట్టల్ చెప్తున్నాడు.
2022లో తన స్నేహితురాలు కృతికా లాల్ తో కలిసి ఈ ఆరెట్టా కంపెనీని ప్రారంభించాడు మిట్టల్. వీళ్లు తయారు చేస్తున్న షూలను పీడియాట్రిషియన్ల ఆమోదం పొందాకే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఒక్కో సైజు షూ మూడు నెంబర్ల వరకు సాగగలుగుతాయి. ఈ కంపెనీ ఉత్పత్తులు దిల్లీ, ఫూణె, ముంబై, బెంగళూరులో చాలాచోట్ల అందుబాటులో ఉన్నాయి. అలాగే తమ షూ అమెరికా, యూకేకు కూడా ఎగుమతి అవుతున్నట్లు సత్యజిత్ తెలిపారు.
‘‘ఒకప్పుడు నా కొడుక్కి మేము నెలకో జత షూ కొనేవాళ్లం. దానికోసం రూ.2500 పెట్టేవాళ్లం. అందరి తల్లిదండ్రుల్లాగే మాకూ ఆర్థికంగా ఈ ఖర్చు భారంగా ఉండేది. అలాగని పిల్లలకు షూ కొనకుండా ఉండలేం. ఈ కాలం పిల్లలను బయటికి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా షూ తప్పనిసరి అయింది. అందువల్ల ఇలా పాదాలను బట్టి సాగే షూ మాలాంటి పేరెంట్స్ కి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని చెబుతున్నారు పూణెకు చెందిన శ్రేయ. వీళ్ల కంపెనీ షూల ధరలు రూ.1,800 నుంచి రూ.2,600 మధ్య ఉంటున్నాయి. స్టార్టప్ మొదలైన తొమ్మిది నెలల్లోనే సత్యజిత్ 6 వేల జతల షూస్ విక్రయించాడు. ఇలాంటి సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు పిల్లలకు, అమ్మానాన్నలకు ఎంతగానో తోడ్పడతాయి.