
ఒక వ్యక్తి విజయం సాధించాడంటే, ఆ ప్రయాణం అంత సులువుగా ఉండదు. ఎన్నో అడ్డంకులు, ఓటములు, ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. అలాంటి వాళ్లలో ముందు వరుసలోనే ఉంటాడు బిహార్ కు చెందిన 29 ఏళ్ల దిల్ఖుష్. ఒకటి కాదు.. రెండు కాదు! డ్రైవర్, ఎలక్ట్రీషియన్ లాంటి ఎన్నో పనులు చేసి అన్నింట్లోనూ నష్టమే చవిచూశాడు. అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. అయితేనేం! గుండె ధైర్యం, కఠిన శ్రమ, మంచి ఆలోచనతో ‘రోడ్ బెజ్’ అనే క్యాబ్ సర్వీస్ యాప్ ప్రారంభించాడు. సామాన్య ప్రజలకు, మారుమూల పల్లెల్లోకీ తక్కువ ధరకే క్యాబ్ సర్వీస్ అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దిల్ఖుష్.
పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే దిల్ఖుష్ కి కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో చదివించే స్తోమత లేకపోవడం, కుటుంబ భారం మీద పడటంతో చదువు మానేశాడు. ఏ ఉద్యోగం లేకపోయినా ఇంట్లోవాళ్ల బలవంతంగా మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దాంతో చుట్టూ ఉన్నవాళ్లంతా అతణ్ని నిరుద్యోగిగానే కాకుండా చేతకానివాడంటూ హేళన చేయడం మొదలుపెట్టారు. దాంతో తండ్రి దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని, ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే దానివల్ల సరైన ఆదాయం రాకపోవడంతో దిల్లీకి మకాం మార్చాడు. అక్కడ కిరాయికి క్యాబ్ నడిపాడు. కానీ నెలరోజుల్లోనే అతని ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి బిహార్లోని సొంతూరుకు చేరుకున్నాడు. ఎలక్ట్రీషియన్ గా కొన్నిరోజులు పని చేశాడు. అదీ కుదురక మార్కెట్లో కూర్చుని కూరగాయలు అమ్మాడు. ఆ వ్యాపారం కూడా కలిసి రాకపోవడంతో మళ్లీ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వచ్చిన ఆలోచన అతని జీవితాన్నే మార్చింది.
‘‘బిహార్ లో కార్పొరేట్ సెక్టార్ ఎక్కువగా ఉండకపోవడంతో క్యాబ్ సర్వీసెస్ చాలా తక్కువ. ప్రజలు ఎయిర్ పోర్ట్, ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చినప్పుడే క్యాబ్ మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్లు టూ వే చార్జీలను ప్యాసెంజర్ల నుంచి తీసుకునేవాళ్లు. ఉదాహరణకు దిల్లీ నుంచి పాట్నాకు ఫ్లైట్ చార్జి రూ.3,000 అయితే, అదే క్యాబ్ మాట్లాడుకుంటే రూ.4,000 అయ్యేది. ఇలాంటివి చూసినప్పుడు నాకు క్యాబ్ సర్వీసెస్ యాప్ తయారీ ఆలోచన వచ్చింది. అలా ఇప్పుడు మా రోడ్ బెజ్ యాప్ ద్వారా మేము క్యాబ్ సర్వీసెస్ వన్ వే చార్జితో నడుపుతున్నాం. ప్రస్తుతం మా యాప్ ని 50వేల మంది ఉపయోగిస్తున్నారు. అందులోనూ బిహార్ లో ప్రతి మారుమూల పల్లెకూ క్యాబ్ సౌలభ్యం అందిస్తున్నామ’’ని గర్వంగా చెబుతున్నాడు దిల్ఖుష్.
రోడ్ బెజ్ సర్వీసులు 24/7 అందుబాటులో ఉంటాయి. అయితే మూడు గంటల ముందు క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా 3,500 మంది ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. మధ్య తరగతి డ్రైవర్లకు, యాత్రికులకు ఉపయోగపడే పని చేసిన దిల్ఖుష్ ని కచ్చితంగా అభినందించాల్సిందే. జీవితంలో కష్టనష్టాలకు భయపడకుండా, ముందడుగు వేస్తేనే విజయం వరిస్తుందని అతను నిరూపించాడు తను.