
జీవితంలో ఒకొక్కరు ఒకో దశలో విజయం సాధిస్తారు. కొత్త ఆశయాలు ఏర్పరచుకుని ముందుకు వెళ్లడానికి వయసుతో సంబంధం ఉండదు కదా! అలా రాజస్థాన్ కు చెందిన అంజలి అగర్వాల్ కు అప్పటివరకూ చేస్తున్న ఐటీ ఉద్యోగం నచ్చలేదు. దాంతో తను ఇష్టపడిన వ్యాపారరంగం వైపు అడుగులు వేసింది. భారతదేశానికి ప్రత్యేకమైన చేనేతలో ఒకటి- రాజస్థాన్ కు చెందిన కోటా డోరియా. ఆ నేతతో తన ప్రయాణం మొదలుపెట్టింది అంజలి. ‘కోటా డోరియా సిల్క్’ అనే గార్మెంట్ కంపెనీ ప్రారంభించి దేశమంతటా తన దుస్తులను విక్రయిస్తోంది. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. కోటా డోరియా సాధారణంగా కాటన్ తో తయారవుతుంది. కానీ అంజలి చేస్తున్న వ్యాపారం కోటా డోరియాలో సిల్క్! ఇలా భిన్నంగా ఆలోచించి అందరికీ ఉపయోగకరంగా కోటా డోరియాలో సిల్క్ తీసుకురావడంలోనే అంజలి విజయరహస్యం ఉంది.
రాజస్థాన్ వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి వేడిని తట్టుకునేందుకు ఎక్కువగా కాటన్ దుస్తులనే ధరిస్తారు. అలా కోటా డోరియా కూడా కాటనే. బయటికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కోటా డోరియాపై ఎంత ప్రేమ, ఇష్టం ఉన్నా… తరచూ వాటికి గంజిపెట్టి ఇస్త్రీ చేయాల్సి రావడంవల్ల ఎక్కువగా వాడేవారు కాదు. అంజలి సమస్య కూడా అదే ఉండేదట. అందుకే కోటా డోరియాలో సిల్క్ తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. చేనేత కళాకారులు, కార్మికులతో సంప్రదించి సిల్క్ మిక్సింగ్ తో కోటా డోరియాను తీసుకురావడం సాధ్యమేనని తెలుసుకుంది. అప్పుడు తన అసలు పనిని ప్రారంభించింది. కేవలం రూ.25,000 పెట్టుబడితో మొదలైన కోటా డోరియా సిల్క్ ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తోంది.
‘‘ప్రఖ్యాత ఐటీ కంపెనీలో నేను 12 ఏళ్లు పనిచేశాను. తర్వాత నాకు రొటీన్ జాబ్ మీద ఆసక్తి తగ్గిపోయింది. దాంతో సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నాను. నాకు మొదట్నించీ చీరలంటే చాలా ఇష్టం. అందులోనూ రాజస్థాన్ కే ప్రత్యేకమైన కోటా డోరియాపై ఆసక్తి. అలా నా ప్రయాణం మొదలైంది. సిల్క్ కాంబినేషన్ పనుల్లో చాలా ఫ్యాబ్రిక్ వృధా అయ్యింది. కానీ ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. డిజిటల్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీపై దృష్టి పెట్టాను. అలాగే బంగారు, వెండి పోగులతో కోటా చీరలను తీసుకొచ్చాను. అంతేకాదు నేత ద్వారా బంధేజ్, లెహరియాలను సంప్రదాయ డిజైన్లలో తయారు చేశాం. ఇలా రకరకాల ప్రయోగాలవల్లే మేమిప్పుడు ఈ స్థితిలో ఉన్నాం’’ అని గర్వంగా చెబుతోంది అంజలి అగర్వాల్.
ఆన్ లైన్ వ్యాపారాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్న అంజలికి ప్రస్తుతం దేశ నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలా విభిన్న ఆలోచన, ప్రయోగం… అన్నింటికంటే ముఖ్యమైంది తోటి మహిళలకు ఉపయోగకరంగా ఉండాలనుకున్న ఆలోచనే ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆసక్తి, పట్టుదలకు పదును పెడితే జీవితంలో ఎలాగైనా విజయం సాధించవచ్చిన అంజలి ప్రయాణం రుజువు చేస్తోంది.