ప్లాస్టిక్‌ బాటిళ్లతో, కళ్లు చెదిరే ఇల్లు

రోజురోజుకూ అన్నిరకాల కాలుష్యాలూ పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా చలామణీ అవుతోంది. ఇదంతా మానవ మనుగడకే ప్రమాదమని శాస్త్రవేత్తలు, విద్యావంతులు చెబుతున్నా, పెద్దగా మార్పు కనిపించట్లేదు. కొంతమంది మాత్రం వాస్తవాన్ని గ్రహించి, తమవంతు బాధ్యతగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి ‘ఔరా’ అనిపిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటారు ఔరంగాబాదుకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు. వేలకొద్దీ వాడేసిన ప్లాస్టక్ బాటిళ్లు సేకరించి.. వాటిని ఉపయోగించి ఒక సస్టెయినబుల్ హోమ్ నిర్మించారు!

ఔరంగాబాద్ లోని శంభాజీ నగర్, ఇప్పుడొక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది. అందుకు ఓ ఆకర్షణీయమైన కట్టడమే కారణం. నమిత, కళ్యాణిలు కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ఇద్దరూ 2020 లో ఔరంగాబాద్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక, ఇద్దరూ గువహటిలో అక్షర్ స్కూల్ గురించి విన్నారు. అక్కడి విద్యార్థుల సీట్లను, సిమెంట్ నింపిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేశారని తెలుసుకున్నారు. అప్పుడే భూమికి, వాతావరణానికి మహమ్మారిగా మారిన వేస్ట్ పాస్టిక్ ని రీసైకిల్ చేయాలని అనుకున్నారు. అలా 2021లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మట్టి, ప్లాస్టిక్ బాటిళ్లతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. దీనికి ప్రాజెక్ట్ వావర్ అని పేరు పట్టారు.

‘‘మేము అక్షర్ స్కూల్ వీడియో చూశాక, ఇలా ఇల్లు కట్టాలన్న ఐడియా వచ్చింది. అప్పట్నించి నేను, కళ్యాణి ప్లాస్టిక్ బాటిళ్ల వేటలో పడ్డాం. పారిశుధ్య కార్మికులు, హోటళ్లు, వీధుల్లో వాడేసిన బాటిళ్లను తీసుకుచ్చాం. మొదట మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వ్యతిరేకించారు. రోడ్ల మీద ఇలా చెత్త ఏరడమేంటని కోప్పడ్డారు కూడా.  చాలామంది మమ్మల్ని చెత్త ఏరుకునేవాళ్లు, ప్లాస్టిక్ వాలీ, బాటిల్ వాలీ అంటూ హేళన చేశారు. కానీ మేమిద్దరం మా నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకోలేదు.  మా పని మేము చేసుకుంటూ వెళ్లాం. అలా మొత్తం 16వేల ప్లాస్టిక్‌ వేస్ట్‌ బాటిల్స్ సేకరించాం. అలాగే సిమెంటుకి బదులు మట్టినే వాడాలనుకున్నాం. అనుకున్నట్లే మట్టి ఇటుకలు, వెదురు, ఇతరత్రా ప్లాస్టిక్ వేస్ట్ ని మాత్రమే ఉపయోగించాం కూడా. ఇతర పాస్టిక్ వేస్ట్ ని 10 వేల బాటిళ్లలో నింపాము. మిగిలిన 6వేల బాటిళ్లలో మట్టిని నింపాము. అయితే ఇల్లు కట్టడానికి ముందు మేమిద్దరం చాలా అధ్యయనం చేశామ’ని చేబుతోంది నమిత.

ఈ స్నేహితులు వాడుతున్న పదార్థాలన్నింటినీ ఔరంగాబాద్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలోని సివిల్ ల్యాబ్ ఇంజినీర్లు టెస్ట్ చేసి నిర్ధారించారు. ఆ తర్వాత వాళ్లు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మొదట ఓ గోడని నిర్మించారు. ఆ తర్వాత ఎంతో శ్రమకోర్చి మిగతా నిర్మాణం పూర్తి చేశారు. ‘‘ఈ ఇంటిని మేము 6X4 ఫీట్ల ఫరిమాణంతో కట్టాం. మొదట్లో మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు, మూడుసార్ల తర్వాత విజయవంతంగా కట్టగలిగాం. మొదట మమ్మల్ని తిట్టిన, హేళన చేసినవాళ్లందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నార’’ని సంతోషంగా చెప్తోంది కళ్యాణి.

ఈ ఎకో ఫ్రెండ్లీ కట్టడానికి మామూలు సిమెంట్ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో సగమే అయిందట. రెండు గదులుగా ఉన్న దీంట్లో ఈ ఇద్దరు అమ్మాయిలు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అందులో 15మంది మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఎక్కడెక్కడి నుంచో ఔత్సాహకులు ఇక్కడికి వస్తున్నట్లు చెబుతున్నారీ స్నేహితురాళ్లు. తరచూ ఆవు పేడ, మట్టితో ప్లాస్టరింగ్ చేస్తుంటే, 10-15 ఏళ్ల వరకు ఇలాంటి కట్టడాలు దృఢంగా, సురక్షితంగా ఉంటాయని నిపుణులు కూడా అంటున్నారు. చిన్న వయసులోనే సమాజం, పర్యావరణంపై బాధ్యతతో ఈ అమ్మాయిలు చేసిన ఆలోచన అన్ని వయసుల వారికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started