
ఒక తండ్రి ఆశయం.. ఒక కూతురి పట్టుదల… ఇప్పుడో సంచలన వార్తగా మారింది. అవును, కూతురు ప్రతిభను గుర్తించిన ఒక తండ్రి రెక్కలుముక్కలు చేసుకుని మరీ, కూతుర్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని టెన్నిస్ అండర్-14 క్యాటగిరీలో నెంబర్ వన్ గా నిలిచిన తానియా సరాయ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడామె ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్ ర్యాంకింగ్ లో 1709 స్థానంలో ఉండటం గర్వించాల్సిన విషయం.
రాజమండ్రికి చెందిన సామ్సన్ కూతురు ఈ తానియా. చిన్నతనంలో తానియాకు టెన్నిస్ పై ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించాడు ఆ తండ్రి. తానియా కు టెన్నిస్ పై ఆసక్తి కలగడానికి కారణం ఆమె తాతయ్య. ఆయన వరంగల్ జిల్లాలోని నర్సాపూర్ లయన్స్ క్లబ్ తరఫున టెన్నిస్ ఆడేవాడు. ఇలా తానియాకు టెన్నిస్ బాల్యం నుంచే పరిచయమైన ఆట. ఆ ఆసక్తితోనే తన ఆరేళ్ల వయసులో అనంతపూర్ రఫెల్ నాడల్ టెన్నిస్ అకాడమీలో ఆడటం ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు టెన్నిస్ నేర్పించేందుకు ఆ అకాడమీని రఫెల్ నాడల్ ఫౌండేషన్ నడిపిస్తోంది.

టెన్నిస్ లో తన కూతురు కనబరుస్తున్న ప్రతిభను చూసి, సామ్సన్ తన కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులో ఆటో నడిపిస్తూ, తన సంపాదనలో ఎక్కువ శాతాన్ని తన కూతురు టెన్నిస్ కోచింగ్ కే ఖర్చు చేసేవాడు. అలా తానియాను అడ్వాంటేజ్ టెన్నిస్ అకాడమీ చేర్పించాడు. ఏడాదిన్నర తర్వాత తానియా ప్రతిభను మెచ్చి, సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఆ ట్రైనింగ్ సెంటర్ నగరశివార్లలో ఉండేసరికి, అక్కడిదాకా ఆటో నడపడం కష్టం అయ్యేది సామ్సన్ కి. దాంతో తానియా కుటుంబం మణికొండకు మారింది. ప్రస్తుతం వివిధ కోచ్ ల దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఇలా ఆమె ప్రతి అడుగులోనూ తండ్రి సామ్సన్ తో పాటు మొత్తం కుటుంబం అండగా నిలుస్తోంది.

‘‘తానియాకు మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించడం, ఫిజియోథెరపీ, న్యూట్రిషనిస్ట్ ల సంప్రదింపులు, జిమ్ మొదలైన వాటన్నింటికీ ఎంతలేదన్నా నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతోంది. ఆటో నడుపుతూ వచ్చే సంపాదనతో నాకు అయినంత వరకు ఖర్చు చేస్తున్నాను. అది సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడాలి, ఎంతవరకు ఈ కష్టం కొనసాగుతుందో. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా వివిధ టోర్నమెంట్లకు తానియాను తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నాం కానీ, అవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాలు కదా!’’ అని సామ్సన్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ బాధపడుతున్నాడు.
తానియా ఇటు రాష్ట్రస్థాయి, అటు జాతీయ స్థాయిలలో మొత్తం 128 టోర్నమెంట్లలో ఆడింది. అందులో సింగిల్స్, డబుల్స్ కలిపి మొత్తం 117 టోర్నమెంట్లలో విజయం సాధించింది. ‘‘ఈ ఏడాదిలో కనీసం 16 ఐటీఎఫ్ (International Tennis Federation) టోర్నమెంట్లలో ఆడాలన్న లక్ష్యంతో ఉన్నాను. ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. 2023 చివరికల్లా టాప్ 100లో ఉండాలని కోరుకుంటున్నాన’’ని తానియా ధీమాగా అంటోంది.
ఆమె టెన్నిస్ ప్రయాణం చూసుకుంటే, అందులో తండ్రి సామ్సన్ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్ లో ఎన్నో విజయాలు సాధించి ఆ తండ్రే కాదు, మొత్తం దేశం గర్వించేలా తానియా ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే మంచి మనసుతో తన ప్రయాణలో తోడ్పాటు అందించిన, అందించే స్పాన్సర్లకు తామెప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని ఆ తండ్రీకూతుళ్లు చెప్తున్నారు.