
చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని. స్కూల్ ఎగ్గొట్టేవాడిని. అందరూ నాలా ఉండాలని కాదు కానీ… హద్దులు దాటే క్రమశిక్షణ వల్ల నష్టమే ఎక్కువని నా నమ్మకం. పిల్లలకు కావాల్సిన స్వేచ్ఛను ఇస్తూనే వాళ్ల తీరును గమనిస్తూ… అవసరం అయినప్పుడు తగిన సలహా ఇస్తే తప్పకుండా వింటారు! మా అమ్మానాన్నలు నాతో అలాగే ఉండేవాళ్లు. చాలామంది నా నవ్వును ఇష్టపడతారు. అది కూడా అమ్మ సలహానే! నా చిన్నప్పుడు చాలా ముభావంగా కనిపించేవాడిని. కానీ అమ్మ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉండమని గుర్తుచేస్తుండేది!

తేజ పుణ్యమా అని!
ఇప్పుడు మీడియాలో కనిపించడం చాలా తేలిక. యూట్యూబ్ లాంటి మాధ్యమాలు చాలా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పటి పరిస్థితి ఇలా ఉండేది కాదు. పెట్టుబడి పెడితేనో, సినీ నేపథ్యం ఉంటేనో కానీ సినిమాల్లో పెద్ద పాత్రలకి అవకాశం వచ్చేది కాదు. కానీ తేజగారి వల్ల అదంతా మారిపోయింది. ఆయన, ఎప్పటికప్పుడు కొత్తవాళ్లకి అవకాశం ఇచ్చేవారు. అలా నేనూ సినిమాల్లోకి అడుగుపెట్టగలిగాను. నేను సినిమాల్లో నటించే సమయానికి నా వయసు 17 ఏళ్లే! గెలుపు, ఓటములను ఒకేలా తీసుకోగలిగే పరిపక్వత ఆ వయసులో ఉండదు. కానీ అలాంటి వయసులోనే స్వతంత్రంగా నిలబడాల్సి రావడం, నన్ను నేను నిరూపించుకోవాల్సి రావడం అంత తేలిక కాదు! కానీ ఆ అనుభవాలు చాలా నేర్పాయి. సురక్షితమైన వాతావరణంలో ఎదగడం కంటే… ఇలా పడుతూలేస్తూ ఎదిగే తీరు మన ఆలోచన తీరును ప్రభావితం చేసి తీరుతుంది. ఈరోజు ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొగలుగుతున్నాం అంటే దానికి కారణం నాటి ఒడిదుడుకుల అనుభవాలే!

ఇదీ నా పాలసీ!
చాలామంది మేం జీవితాన్ని ఇలా గడుపుతాం, అలా భావిస్తాం అని చెబుతూ ఉంటారు. నిజానికి జీవితం అంటే ఒకటే కాదు. మన కుటుంబం, కెరీర్, ప్రేమ, చదువు… ఇలా ప్రతి కోణం గురించీ మనదైన దృక్పథం ఉండాలి. చదువు విషయంలో సీరియస్ గా ఉండాలి. స్నేహితుల మధ్య గొడవలను సరదాగా తీసుకోవాలి! జీవితం అన్నాక రకరకాల సమస్యలు వస్తాయి. మనకి వచ్చిన సమస్య తాత్కాలికమా, శాశ్వతమా, ప్రాణాల మీద తెచ్చేదా, ఇతరుల వల్ల కలిగిందా… అన్న విషయాన్ని గుర్తించినప్పుడు మరింత దృఢంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం. అసలు ఆ మాటకు వస్తే… ఒకానొక సమయంలో మన జీవితాలని కుదిపేసిన సమస్య… కొన్నాళ్లకి చాలా చిన్నదిగా కూడా కనిపించవచ్చు! కాబట్టి సమస్య వచ్చినప్పుడు కంగారుపడిపోకుండా, దాని గురించి ఓ స్పష్టత తెచ్చుకోవడం అవసరం. అప్పుడు పరిష్కారం తేలికైపోతుంది.

ప్రయోగమే జీవితం!
నేను ఎప్పుడూ ప్రయోగాలకు వెనకాడేవాడిని కాదు! ఉదాహరణకు ఆర్య2 లో అల్లు అర్జున్ పక్కన చేయాల్సి వచ్చినప్పుడు, తను నాకంటే పెద్ద స్టార్ కదా, తన ముందు తేలిపోతానేమో అని భయపడలేదు. దాన్ని ఒక పాత్రగానే చూశాను. అలాగే టీవీల వైపు సినిమా నటులు వెళ్లడం అంటే వాళ్ల కెరీర్ చివరి దశకు రావడం అనుకునే రోజుల్లో, నేను టివి రియాలిటీ షో చేశాను. ఒటిటిలోకి ప్రవేశించిన తొలి తెలుగు హీరోని కూడా నేనే! మనం ఏదన్నా ఒక రిస్క్ తీసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఎన్నో చెబుతారు. వాళ్లదేముంది చెబుతారు, వెళ్లిపోతారు. కానీ మనకి ఏం కావాలో, అది చేయాలనే స్పష్టత ఉండాలి. మనకి తెలియని విషయం అయితే, మనమే అందులో అనుభవజ్ఞుడిని అడుగుతాం! కానీ మీ జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరే కదా ఎక్స్ పర్ట్. కావాలంటే ఫలానా విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడగవచ్చు… అది కూడా ఎవరు పడితే వారిని కాదు. నీ శ్రేయోభిలాషుల నుంచే!

ఔదార్యం ఉండాలి!
సాటి మనిషి కష్టాన్ని చూసి స్పందించగల మనసు ఉండాలి. మనకు ప్రతిఫలం లేకపోయినా పక్కనవారికి సాయపడే ప్రయత్నం చేయడమే నిజమైన మానవత్వం అని నా ఉద్దేశం. అందుకే చెన్నై వరదలు లాంటి సందర్భాల్లో నా వంతుగా ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేశాను. నిజానికి ఇదేమంత కష్టం కాదు. చాలాసార్లు సమస్యకి స్పందించి ఏదో ఒకటి చేస్తే బాగుండు అని చుట్టుపక్కల వ్యక్తులను కదిపే ప్రయత్నం చేస్తే చాలు… ఆ ఒక్క అడుగే ఎంతో ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఇలా సాయపడాలి, ఇలా చేయూత ఇవ్వాలి అని అనుకోలేదు… కానీ అవసరం అయినప్పుడు నేనుంటానని మాత్రం మాట ఇవ్వగలను.

జీవితాన్ని ఆస్వాదించాలి!
జీవితాన్ని, దృక్పధాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండటం తప్పేమీ కాదు. అది అవసరం కూడా! అలాగని మనం ఇంకా బాగా ఉండాల్సింది, ఇంకా సాధించాల్సింది అని పశ్చాత్తాపపడుతూ కూర్చుంటే కనుక… ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే! ప్రతి క్షణం, ప్రతి సందర్భంలోనూ… అత్యుత్తమ ఫలితాలు సాధించడం అంబానీ వల్ల కూడా కాదు. ఆ మాటకు వస్తే… మనమేమీ ఈ లోకంలో అన్నీ సాధించేసేయడానికే రాలేదు. విజయం జీవితంలో ఓ భాగం మాత్రమే. దాని కోసం నీ మిగతా జీవితం… కుటుంబం, ప్రయాణాలు, స్నేహితులు, వినోదం… వీటంన్నింటినీ వదులుకుంటే ఎలా! బతుకు ప్రయాణాన్ని ఆస్వాదించాల్సిందే.

ప్రపంచాన్ని మనకోసం సిద్ధం చేయాలి!
సినిమాల్లో నాకు తగిన పాత్ర ఉంటే తప్పకుండా, అది నన్ను వెతుక్కుంటూ వస్తుందనే నమ్మకం ఉండేది. అంతేకానీ, ఒకరి దగ్గరకు వెళ్లి నా అంతట నేను వేషం అడగితే… వాళ్ల దృష్టిలో లోకవ అయిపోతానని నా ఆలోచన. కానీ ఓ రోజు నాన్న నాకు ఇచ్చిన సలహా ఎప్పటికీ మర్చిపోలేను. ‘నువ్వు వెళ్లి అడగాల్సిన పని లేదు. కానీ అవకాశాలు నీ దగ్గరకి వచ్చేందుకు నీలో సన్నద్ధత ఉండాలి కదా! ఒక నటుడిగా నిరూపించుకోవడానికి శారీరికంగా, కెరీర్ పరంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. అప్పుడు లోకం నీ ప్రయత్నాన్ని గుర్తించి, నీ దగ్గరకు వస్తుంది’ అన్న తన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఇది ఒక్క సినిమాలకే కాదు, ఏ కెరీర్ కైనా వర్తిస్తుంది. అవకాశాలను అందుకునేందుకు మన వంతుగా నిరంతరం సన్నద్ధతతో ఉండాలి! All The Best.