Design a site like this with WordPress.com
Get started

జీవితాన్ని మార్చేసే మండి సార్‌ కబుర్లు

నేను తెలంగాణలో పుట్టిన తెలుగు బిడ్డను. పాతికేళ్లుగా ముంబయిలోని వర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నేను మండి అనే పద్దతిని ప్రవేశపెట్టాను. ఏ విద్యార్థి అయినా తాను నేర్చుకున్న చదువును తానే అమ్ముకోవడమే ఈ మండి విధానం. నువ్వు నేర్చుకున్నది అమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో… అనే పద్దతి ఇందులో ప్రధానం.  20 ఏళ్ల నుంచి 10 వేల విద్యార్థులకు ఈ విధానం నేర్పాను. క్రమంగా పిల్లలు నన్ను మండి సర్… మండి సర్ అని పిలవడం ప్రారంభించారు. అలా పేరు నాకు స్థిరపడిపోయింది. అలాగే నన్ను అంగడి సర్, సంత సర్, బజార్‌ సర్ అంటుంటారు!

చదువును నేర్చుకోవాలి, నేర్చుకున్న చదువును వినియోగించాలి, దాని నుంచి విలువను వెలికితీయాలి. అప్పుడే చదువు సార్థకం అవుతుంది. చదువుకున్న విషయం నిరూపణ అవుతుంది. విద్యావిధానంలో… స్వావలంబన తీసుకురావడం, విలువ సృష్టి అనేది చాలా అవసరం! ప్రస్తుత విద్యావిధానంలో ఇది లోపించింది. ఇది ప్రవేశ పెడితే, మన విద్యార్థులు సమాజానికి చాలా ఉపయోగపడతారు.

ఉద్యోగం అడగటం కాదు.. ఇచ్చే స్థాయికి చేరాలి

నేను ప్రస్తుతం తెలంగాణ ఎకాడమీ ఫర్‌ స్కిల్ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థతో కలసి పని చేస్తున్నాను. దాదాపు వెయ్యి మంది విద్యార్థులను ఒకటి, రెండు రోజులు అసలైన మార్కెట్‌లో ప్రవేశపెట్టి… వారు నేర్చుకున్న విషయాలను నిరూపించి సంపాదించడం ఎలా అనేది చూపిస్తున్నాం. దీని వల్ల విద్యార్థులు స్టార్టప్‌ లు రూపొందించేందుకు ముందుకు వస్తారు. స్టార్టప్‌ లు వస్తే, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్లుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వాళ్లుగా వారు ఎదుగుతారు..

మరో కీలక విషయం! వస్తువును తయారు చేశాక అమ్మడం కంటే, వస్తువు తయారు చేయకముందే దాన్ని అమ్మడం నేర్చుకోవాలి. ఇది నేర్పించాలి. ఒక జర్నలిస్టుకు పేపర్‌, పత్రిక అమ్మడం వస్తే… అప్పుడు పేపర్, పత్రిక పెట్టి అమ్మే స్థాయికి చేరుకుంటాడు.. ఇది అంకురాలకు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకూ అమ్మడం మొదటి మెట్టుగా అంకురాలను ప్రారంభించలేదు. తెలంగాణ అకాడమీ ఆ పని చేస్తోంది.

అమ్మడం అన్నది ఎవరో కొంత మంది మాత్రమే చేస్తారని మన సమాజంలో భావిస్తుంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. అమ్మడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. అందుకే పిల్లలకు అమ్మడం నేర్పాలి. నేను పాఠశాల విద్యార్థులకు గాంధీ గారి జీవిత చరిత్ర పుస్తకాలు అమ్మించాను. దీని వల్ల ఆ పిల్లవాడు గాంధీగారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటాడు. అప్పుడే అమ్మగలుగుతాడు. దీనివల్ల ఓ మంచి పుస్తకం పది మందికి చేరుతుంది. పిల్లవాడు కూడా జ్ఞానం పొందుతాడు. పుస్తకం అమ్మకం ద్వారా సంపాదించుకుంటాడు. ఇలా ఎన్నో లాభాలు పొందుతాడు!

అమ్మడంతో ఎనో లాభాలు

అమ్మడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. లోక జ్ఞానం వస్తుంది. మేము ఈ పుస్తకాలు (గాంధి జీవిత చరిత్ర) ఐదు లక్షల వరకూ అమ్మాం. ప్రతి పుస్తకం అమ్మకం సమయంలో చాలా సంభాషణ జరిగింది. విద్యార్థికి లోకజ్ఞానం వస్తుంది. ఇలాగే ఖాదీ ఉత్పత్తులు వంటి కూడా అమ్మించవచ్చు. ఇలాంటివి విద్యావిధానంలో కూడా పెట్టాలి. విద్యార్థులతో ఇలాంటి ఉత్పత్తులు అమ్మించి, దానికి మార్కులు ఇవ్వాలి. దీని ద్వారా జాతీయ భావం కూడా పెరుగుతుంది. ఇలా విద్యార్థులతో అమ్మించాలి. ఇలాంటి అమ్మకం ద్వారా రోజుకో వంద రూపాయలు సంపాదించుకున్నా ఏడాదికి 36 వేలు సంపాదించుకుంటారు. స్వావలంబన సాధిస్తారు. ముందు ముందు వీళ్లే స్టార్టప్‌ లు పెడతారు. నలుగురికీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరతారు. లైఫ్‌ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇలాంటి ఉత్పత్తులు మాదగ్గర కొన్ని వందలు ఉన్నాయి.

ఇలా విద్యార్థులతో వస్తువులు అమ్మిస్తే.. కొందరు తల్లిదండ్రులు అడ్డు వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని విద్యావిధానంలో భాగంగా చేస్తే ఎవరూ అడ్డు చెప్పరు. ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చే వారుగా విద్యార్థులను తయారు చేయమంటోంది. అందుకే, విద్యావిధానంలో దీన్ని భాగం చేయాలి. దీని ఫలితాలు చూస్తే ఎవరూ అలాంటి ప్రశ్నలు వేయరు. ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో విద్యార్థులు కొన్ని కంపెనీలకు ఉద్యోగులుగా మారేందుకు అనువుగా ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగులయ్యాక ఆయా సంస్థలకు పనిచేసి పెడతారు. ఆయా సంస్థలు డబ్బు సంపాదించుకుంటాయి. ఇలా కొందరు మాత్రమే ధనవంతులుగా మారుతున్నారు. కొందరి చేతిలోనే సంపద కేంద్రీకృతం అవుతోంది. చాలా మంది కేవలం ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు. కానీ ఇలాంటి విధానాల వల్ల విద్యార్థులు ఉద్యోగులుగా కాకుండా సొంత సంస్థలు ఏర్పాటు దిశగా ఆలోచిస్తారు. స్టార్టప్‌ల గురించి ఆలోచిస్తారు. తాము యజమానులుగా ఎదుగుతారు. నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు. దీని వల్ల సంపద కూడా కేంద్రీకృతం కాదు. అది దేశానికి చాలా అవసరం.

ఇది గాంధీ చూపిన బాట

మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. మరో 20 కోట్ల మంది విద్యాసంస్థలకు అవతల ఉన్నారు. వీరంతా ఇలా అమ్మడం ప్రారంభిస్తే, చాలా మార్పు వస్తుంది. దీన్ని విద్యావిధానంలో భాగం చేయాలి. ఇదే నేను యూనివర్శిటీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులకు సంపాదించడం నేర్పండి. ఇది నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. స్టార్టప్‌ లు పెట్టించేవారిగా ప్రోత్సహించాలని కేంద్రం చెబుతోంది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్‌ ఇలా విద్యార్థులను సంపద సృష్టించేవారుగా మార్చాలి.

ఇది నేను చెప్పడం లేదు.. మహాత్మాగాంధీ 90 ఏళ్ల క్రితమే చెప్పారు. టూవార్డ్స్‌ ఎడ్యుకేషన్‌ అని ఆయన నిరూపించిచూశారు. ఆయన విద్యార్థులతో ఇది చేయించారు. మహాత్మాగాంధీ నిరూపణ లేకుండా ఏదీ రాయరు. ఈ స్వావలంబన అనేది సత్యం, అహింసా మార్గంలో ఇది చాలా ముఖ్యం. ఈ అమ్మడం అనే ప్రక్రియను చాలా సజావుగా ప్రారంభించాలి. జాతీయ భావం పెంచే ఉత్పత్తులతో ప్రారంభిస్తే మంచి ఆరంభం ఉంటుంది.

ఇప్పటి వరకూ నేను 10 వేల మందికి ఈ విధానం నేర్పాను. నా ద్వారా ఇప్పటి వరకూ 1000 మంది విద్యార్థులు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు. నేను వేసుకున్న టీషర్టు నా శిష్యుడి కంపెనీలో తయారైందే. నాకు బహుమతిగా ఇచ్చాడు. మరో విద్యార్థి ఎనీ టైమ్ డ్రైవర్‌ అనే యాప్ రూపొందించాడు. డ్రైవర్లను తయారు చేసి అందుబాటులో ఉంచాడు.. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. మనకు మహిళా డ్రైవర్ల కొరత ఉంది. అలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించాలి.

వ్యాపారం అంటే దోచుకోవడం కాదు.. 

మన సమాజంలో వ్యాపారం అంటే  ఓ చెడు అభిప్రాయం ఉంది. వ్యాపారం అంటే దోచుకోవడం అంటారు. పూర్వకాలం నుంచి ఉన్న మన అనుభవాలు కూడా అలాంటి అభిప్రాయాలు కలిగించాయి. కానీ ఈరోజుల్లో వ్యాపారం అంటే దోపిడీ కాదు… సౌకర్యాలు అందించడం, సౌకర్యం అందిస్తూ ఉపాధి పొందడం! వ్యాపారం చాలా విలువలతో కూడింది. అలాగే వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయని భయపడతారు. వ్యాపారం గురించి తెలుసుకుని అత్యాశకు పోకుండా చేస్తే వ్యాపారంలో నష్టాలు రావు. ఏ పద్దతితో ఎలా చేయాలో తెలుసుకుని వ్యాపారం చేయాలి. ఓ కారును 30 నుంచి 60 కి.మీ వేగంతో పోతే ప్రమాదాలు జరగవు. కానీ 150 నుంచి 300 కి.మీ వేగంతో వెళ్లే ప్రమాదం కాదని చెప్పగలమా! ప్రమాదం వచ్చిందని బాధపడటం భావ్యమా? ఇదీ అంతే!

మనం చివరకు పిన్నీసులను కూడా విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. ఇది మారాలి! మన వస్తువులు మనమే తయారు చేసుకోగలగాలి. అమ్మగలగాలి. ముందు మన దృక్పథం మారాలి. మనం వేరే వాళ్లపై ఆధారపడాల్సిన పనిలేదు. చదువుకున్న వాళ్లు ఆ చదువు నుంచే సంపాదించాలి. మరో విషయం ప్రతి ఒక్కరూ చదువు కోవాలి. చదువుకోని వాడు మన పక్కన ఉంటే మన పక్కన ఆపద ఉన్నట్టే.

నిత్య సైనికుడు… భువనచంద్ర

నేను తమ్మిలేరు నదికి ఇవతల ఉండే కృష్ణాజిల్లాలో పుట్టాను. ఆ నదికి ఆవల పశ్చిమగోదావరి చింతలపూడిలో పెరిగాను. శ్రీకాకుళం, హైదరాబాదుల్లో చదువుకున్నాను. ఇక సైనికుడిగా మారాక… దేశమే నాదయ్యింది. నేను 18 ఏళ్లు వైమానిక దళంలో పనిచేశాను. ఒక దళంలో ఉండే ఆరు వందల మందీ ఒక్క కమాండుకి కచ్చితంగా పనిచేసేంత క్రమశిక్షణ మాకు అందించారు. మిలట్రీలో నేర్పే తొలి విషయం ఇదే! అందుకే ప్రతి దేశంలో… ఆరోగ్యవంతుడైన ప్రతి యువకుడినీ కనీసం అయిదేళ్లు మిలట్రీలో ఉంచాలి అనే నిబంధన తీసుకురావలన్నది నా కోరిక.

నేను సైన్యంలో ఉండగానే 1971 పాకిస్తాన్‌ యుద్ధం మొదలైంది. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్లినా, జనం వచ్చి ఆశీర్వదించేవారు. ఆ ప్రేమ అంతా చూసిన తర్వాత లక్షసార్లు జన్మించినా సైనికుడిగానే పుట్టాలి, సైనికుడిగానే చనిపోవాలి అనిపించింది. ఆ యుద్ధంలో నాకు ఆరు మెడల్స్ వచ్చాయి. సినిమా రచయితగా నాకు డబ్బు, పేరు వచ్చినా… నాకేమాత్రం గర్వంగా లేదు. కానీ ఓ సైనికుడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది!

నేను పాల్గొన్న యుద్ధం, చిట్టచివరి మానవ యుద్ధం. అప్పట్లో సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడంతో… కాల్బలం కాల్బలంతో, వైమానిక దళం వైమానిక దళంతో తలపడింది. యుద్ధం ఎప్పుడూ దేశాల మధ్యో, మతాల మధ్యో, కులాల మధ్యో జరుగుతుంది అనుకుని పొరపాటు పడతాం. ఆఖరికి భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధం కూడా అహంకారం వల్లే జరుగుతుంది. రామరావణ, కౌరవపాండవ యుద్ధాలు కూడా ఇందుకు సాక్ష్యాలే. కాబట్టి యుద్ధాన్ని ఆపాలంటే మనిషి తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిందే!

మారుపేరుతో రచయితగా!

నా చిన్నతనం నుంచి పోస్టర్ల మీద నా పేరు రాసుకునేవాడిన. ఎవరైనా పెద్దయ్యాక ఏం చేస్తావు అంటే సినిమాల్లో చేరడానికి మద్రాసుకి వెళ్లిపోతాను, అని చెబితే మద్రాసు పిచ్చోడు అని పిలవడం మొదలుపెట్టారు. మిలట్రీ నుంచి వచ్చిన రెండు నెలల తర్వాతే ఓఎన్‌జీసీలో చేరే అవకాశం వచ్చింది. కానీ సినిమాల్లో పనిచేయాలనే నా కోరికను తీర్చుకోవడానికి మద్రాస్‌ వచ్చాను. సినిమా రచయితగా నేను పైకి వస్తే మంచిదే! అలా కాకపోతే… నన్ను చూసి ‘తను విఫలం అవుతాడని ముందే ఊహించాను’ అని పెదవి విరిచేవాళ్లు చాలామందే ఉంటారు. కాబట్టి మా అమ్మపేరు చంద్రావతి, ఇంకొకరి పేరు భువనేశ్వరి… ఆ రెండు పేర్లూ కలిపి భువనచంద్రగా మారాను. అదృష్టవశాత్తు, పదిహేను రోజుల్లోనే అవకాశం దొరికింది. నా మొదటి అవకాశం ఇచ్చింది బాపినీడు.

ఓ రచయితగా నాకు ఎన్ని చాన్సులు వస్తాయో ఆ సమయంలో నాకు తెలియదు. కానీ నేను బతికేది ఒక్కసారి. ఉద్యోగం లేకపోతే నేను మెకానికల్‌ ఇంజినీరుని కాబట్టి చెట్టు కింద కూర్చుని రిపేర్లు చేసుకుంటాను. నేను సంపాదించుకునే రొట్టె నేను ప్రశాంతంగా తినగలగాలి. సంపాదన ఆనందం కలిగించాలి. అలా 34 ఏళ్ల నుంచి పాటలు రాస్తూనే ఉన్నాను. ఆ రిస్క్‌ తీసుకోకపోతే ఇంతమంది ప్రముఖులు నా పాటకు డ్యాన్స్ చేసేవాళ్లు కాదు కదా!

ఒకటే బతుకు… అది నీ ఇష్టం!

యూ లివ్‌ ఓన్లీ వన్స్. కోటీశ్వరుడిగానో, కూలివాడిగానో, గాయకుడిగానో, నటుడిగానో… ఎలా బతుకుతావో నీ ఇష్టం. నువ్వు చేసే పనిలో నువ్వు ఆనందపడాలి, సమాజం ఆనందపడాలి. అలా నాకు సినిమా రైటర్‌ ని కావాలనేది నా కోరిక. అలా కాకపోయినా ఏదో ఒక రకంగా సినిమాల్లో ఉండాలి అనేది కోరిక. ఆ పట్టుదలే గెలిపించింది. భగవద్గీతలో యుద్ధం ప్రారంభం అయినప్పుడు… యుద్దాయ కృతనిశ్చయః అని కృష్ణుడు అన్నట్టు పట్టుదలతో ఉండాలి. మీ గమ్యాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. యుద్ధం అంటే గెలవడం మాత్రమే కాదు.. ఎదుర్కోవడం.

అమ్మ మీద రాయను!

నా జన్మకు మూలకారణం అయిన అమ్మ గురించి ‘నువ్వు గొప్పదానివి’ అంటూ ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం కదా. అమ్మ అన్నా మాట తల్చుకుంటేనే కళ్ల వెంబడి నీళ్లు రావాలి. తల్లిదండ్రులు అంటే మనకు ఉండాల్సింది భక్తి, భయం కాదు ప్రేమ. దేవుడి కంటే లక్ష రెట్లు ఎక్కువైన ఆరాధన. అమ్మతనం మాటలకు, భాషకు అందదు. మా అమ్మ ఎన్నో కీర్తనలు, దేశభక్తి గీతాలు పాడేది. ఆమె నాకు వందల కథలు అద్భుతంగా చెప్పబట్టే, భువనచంద్ర అనే మూర్ఖుడి బుర్రలో కాస్త జ్ఞానం వెలిగించింది. ఇక ‘సుఖపడటం ఎవరూ నేర్పనక్కర్లేదు. నా దగ్గర నువ్వు కష్టపడటం నేర్చుకో. అదే రేపు నీకు సుఖం అవుతుంది’ అని చెప్పినవాడు మా నాన్న.

మా ఊరు

చింతలపూడి ఓ చల్లటి ఊరు. నాలుగు దిక్కులా నాలుగు చెరువులు. మా ఊరి వాళ్లకు రేపటి కోసం కోట్లు కూడబెట్టాలనే తాపత్రయం లేదు. మా ఊరి అనుబంధం నిలుపుకోవడం కోసమే అక్కడి నుంచే పెన్షన్‌ తీసుకుంటున్నాను. ఆ గాలి, ఆ నీరు తగులుతుంటే మళ్లీ అమ్మ ఒడిలో పడుకున్నట్టు… తన పొత్తిళ్లలో ఉన్నట్టు అనిపిస్తుంది.

వాళ్లు!

భారతీయ వేదాంతం అంటే దేవుడు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మాత్రమే కాదు… ఈ సృష్టిలో ప్రతి జీవికీ సంబంధించిన విజ్ఞానం. హిమాలయాల నుంచి ఎడారుల వరకు నేను కలిసిన ఎందరో మహానుభావుల నుంచి తెలుసుకున్న విషయం ఇది. దీన్ని క్రోడీకరించే ‘వాళ్లు’ అనే పుస్తకం రాశాను. మీకు 70 ఏళ్లు వస్తే… లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా వెనక్కి వెళ్లలేరు. ఈ విశ్వం మొత్తాన్నీ రాసిచ్చినా.. పోయిన ప్రాణం వెనక్కి రాదు. అంటే బతికుండే ప్రతి క్షణం ఈ విశ్వానికంటే గొప్పది. నీ జీవితపు విలువను గుర్తించాల్సింది నువ్వు. నిన్ను నువ్వు గౌవించుకున్నప్పుడు, నిన్ను ప్రేమించుకున్నప్పుడు నీకు వాటి విలువ తెలుస్తుంది. హిమాలయాలు నీ దగ్గర ఉంటే గులకరాళ్లను చూసి ముచ్చటపడితే నీ అంత మూర్ఖుడు ఎవరూ ఉండరు. 

వేటూరి అంటే ఇష్టం!

సంక్లిష్టమైన జీవితాన్ని సరళంగా చూపిన గొప్ప రచయితలు ఎంతోమంది ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే నా తరం వారు పాద రేణువులకే రేణువులతో సమానం. అదృష్టవశాత్తు అలాంటి ఒకరిలో వేటూరి గారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. పండితపామరులకు ఇద్దరికీ నచ్చేలా… ఎక్కడ అల్లరి చేయాలో అక్కడ అల్లరి, ఎక్కడ బోద చేయాలో… అక్కడ బోధ చేసే ఆయన ప్రతిభ అంటే నాకు ఆరాధన.

– ఓటమిని చాలా తేలికగా చూడాలి. ఓడినవాడు సంతోషంగా రంకెలెయ్యాలి. గెలిచేందుకు మరో అవకాశం మిగిలే ఉందని గుర్తుచేస్తుంది. ఓటమి.

– భయం అంటే సంస్కృతంలో సెక్యూరిటీ అని అర్థం. ఆహార, నిద్ర, భయ, మైధునాలు ప్రతి జీవికీ ఉంటాయి. అది సహజ లక్షణం. దాన్ని గెలవడానికి సంకల్పం, ధైర్యం ఉండాలి. ఆ ఒక్కటీ మీ దగ్గర ఉంటే ప్రతి ఒక్కటీ మీ దగ్గరకు వస్తుంది. జీవితం అనే పోరాటంలో ప్రతి ఒక్కరూ సైనికులే!

– ఒక మగవాడు నిర్లిప్తుడు… ఆకాశం. స్త్రీ జీవం… ప్రకృతి. ప్రకృతికి రుతువులున్నాయి, మార్పులున్నాయి. కాబట్టి నేనే కాదు, ఎవరైనా స్త్రీల నుంచే ఎక్కువ నేర్చుకోగలరు.

పోరాడితే మార్పు సాధ్యమే – స్ఫూర్తి కొలిపాక

సైన్యం కోసం ఎన్నికయ్యా. కానీ.. 

నేను పుట్టిపెరిగింది అంతా సికింద్రాబాద్‌ లోనే. ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే టెక్ మహీంద్రాలో ఉద్యోగం వచ్చింది. అసలు నాకు ఆర్మీలోకి వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉండేది. ఎస్‌.ఎస్‌.బీకి సెలక్ట్‌ అయ్యాను కూడా. అన్ని పరీక్షల్లో నెగ్గాను. కానీ మెడికల్‌ టెస్టులో చిన్న సమస్య వచ్చింది. మడమల సమస్య కారణంగా నన్ను రిజెక్ట్ చేశారు. వాస్తవానికి అది అసలు సమస్య కానే కాదు. కానీ ఈ నిబంధనలు అన్నీ 200 ఏళ్ల క్రితం పెట్టినవి. ఇప్పటి వరకూ వాటిని సమీక్షించలేదు.

మేక్‌ ఎ ఢిఫరెన్స్.. నా జీవితాన్ని మార్చేసింది.. 

సాఫ్ట్‌ వేర్ కంపెనీలో పని చేసేటప్పుడే మేక్‌ ఎ డిఫరెన్స్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరాను. వారాంతాల్లో ఆ సంస్థ కోసం పని చేసేదాన్ని. ఆ సంస్థ స్వరూపం పనితీరు తెలుసుకున్నా. అప్పుడే అనాథ పిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నా. అప్పుడు ఆ చిన్నారుల కోసం డ్రీమ్ క్యాంప్ అని ఓ కార్యక్రమం నిర్వహించాం. దాని కోసం పిల్లలను ఓ మూడు రోజుల పాటు ఏదైనా రిసార్ట్‌లో ఉంచి అనేక అంశాలు నేర్పేవాళ్లం. అలా ఆ డ్రీమ్ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు నాలో ఉన్న మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ ఏంటో నాకు తెలిశాయి. 300 మంది వాలంటీర్లను సమన్వయం చేసేదాన్ని. ఆ సంస్థ కోసం నేను చాలా నిధులు సేకరించాను. మా సంస్థలోని ఉద్యోగుల నుంచి కూడా చాలా మందిని ఒప్పించి నిధులు సేకరించాను. 

అమ్మ పాఠం.. నాకు మలుపు..

మా అమ్మ గురించి చెప్పాలి. ఆమె 50 ఏళ్ల వయస్సులో మళ్లీ చదువు ప్రారంభించింది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి ఇతర బాధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా చదువుకోలేకపోయారు. అందుకే 50 ఏళ్ల వయస్సులో మళ్లీ చదువు ప్రారంభించారు. ఇప్పుడు అమ్మ పీ.హెచ్‌.డీ కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను అమ్మ పుస్తకాల్లో ముంబయిలో ఉన్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్ సైన్సెస్‌ గురించి తెలుసుకున్నా. ఈ సంస్థను 1936 లోనే అంటే స్వాతంత్ర్యానికి ముందే ఏర్పాటు చేశారు. చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ. ఇదే నాకు సరైన వేదిక అనిపించింది. అలా ఆ సంస్థలో చేరాను.

టాటా సంస్థ నేర్పిన పాఠాలు..

టాటా సంస్థలో సోషల్ వర్క్‌ లోని లైవ్లీ హుడ్ – సోషల్ ఎంట్రపెన్యుయర్‌షిప్‌ అనే సబ్జక్ట్ తీసుకున్నాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. మొదటి సంవత్సరం అంతా ఫీల్డ్ వర్క్‌ తోనే సరిపోయింది. మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలోని ఓ గిరిజన పల్లెలోనే గడిపాం. అక్కడి సమస్యలను అధ్యయనం చేశాం. వారంలో రెండు రోజులు పూర్తిగా ఆ గ్రామంలోనే గడిపేవాళ్లం. అక్కడ వర్షాలు బాగా పడుతున్నా, నీరు నిల్వ చేసుకునే సదుపాయాలు లేవు. ఆ గిరిజనులకు భూములు లేవు, ఉండటానికి సరైన ఇళ్లు లేవు, సరైన టాయ్‌లెట్స్ ఉండేవి కాదు…  సరైన నీటి సౌకర్యం లేక జనం ముంబయికి వలసపోతుండే వాళ్లు. ఓ ఏడాది పాటు అక్కడే ఉండి వాళ్ల సమస్యలు అధ్యయనం చేశాం. అప్పుడు వాళ్లను భాగస్వామ్యం చేసి వాళ్ల సమస్యలకు పరిష్కారాలు చూపించాం.

టిస్‌.. సమస్యలపై నా దృక్పథం మార్చేసింది..

సోషల్ వర్క్‌ అధ్యయనంలో చాలా అంశాలపై అధ్యయనం చేశాం. పెళ్లిళ్లు, కులాలు… ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేశాం. ప్రత్యేకించి పెళ్లిళ్ల గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుసుకున్నాం. మనం సాధారణంగా పెళ్లి అంటే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కలిసి జీవించడమే అనుకుంటాం. కానీ ఇంత కంటే భిన్నంగా, మన దేశంలోనే అనేక జాతుల్లో అనేక ఆచారాలు ఉన్నాయి. ఒక ఆచారంలో అమ్మాయిని, ఓ అబ్బాయికి కాకుండా ఓ ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయిలందరికీ ఆమే భార్య. బహుశా అమ్మాయిల కొరతతో ఈ ఆచారం వచ్చి ఉంటుంది. ఇలాంటి చాలా తెగల గురించి తెలుసుకున్నాను. చైనాలోని ఓ ద్వీపంలో కేవలం మహిళలే ఉంటారు. పురుషులకు స్థానం లేదు. మనం చూసే ప్రపంచమే కాదు. ఇంకా చాలా ప్రపంచం ఉందని తెలుసుకున్నా. రెండో ఏడాది ఒడిశాలోని మరో గిరిజన తెగ గురించి అధ్యయనం చేశాం. మహారాష్ట్రలోని తెగకూ ఇక్కడి తెగకూ చాలా తేడా ఉంది. ఇక్కడి వాళ్లకు భూములు ఉన్నాయి. డబ్బు ఉంది. అధికారం కూడా ఉంది. అందుకే గిరిజనులు అనగానే ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఈ విషయం నాకు ఒడిశా గిరిజనులను చూశాక తెలిసింది.

ఎంపీసీ, బైపీసీ… ఇంకేమీ చదువులు లేవా?

మీకు ఏం నచ్చుతుందో అదే చదవండి. టెంత్‌ తర్వాత ఓ ఏడాది పాటు మీకు ఏం నచ్చుతుందో ఎక్స్‌ప్లోర్ చేయండి. అప్పుడు నచ్చిన చదువు చదవండి. నేను చాలామందికి ఇదే చెప్పేదాన్ని. మీరు చదివేదానిపై మీకు ఆసక్తి లేకుండా ఎలా చదువుతారు? మన దగ్గర చదువు అంటే ఎంపీసీ లేదా బైపీసీ! ఇప్పుడు కాస్త కామర్స్ చదువుతున్నారు. మనకు ఇవి తప్ప వేరే చదువుల గురించి తెలియదు. పట్టించుకోం కూడా.

అమ్మతో చాలా చర్చించేవాళ్లం

మా అమ్మతో మేం చాలా సంభాషించేవాళ్లం. అమ్మతో అన్నీ షేర్‌ చేసుకునేవాళ్లం. ఇప్పుడు కూడా అనేక అంశాలు మేం అమ్మతో చర్చిస్తాం. ఎంతో భిన్నాభిప్రాయాలు కూడా మాట్లాడుకునేవాళ్లం. ఇలాంటి చర్చల ప్రతి ఇంట్లో జరగాలి. పిల్లల అభిప్రాయాలు తల్లిదండ్రులతో పంచుకోవాలి. మేం మా అమ్మతో పెళ్లి గురించి, ఇల్లరికం గురించి, లింగ సమస్యల గురించి, నా అనుబంధాల గురించి… ఇలా ఎన్నో మాట్లాడుకుంటాం. నేను చెప్పింది మీరు వినాలి అనే ధోరణి తల్లిదండ్రుల్లో ఉండకూడదు. మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. భిన్నాభిప్రాయాలను గౌరవించాలి.  ఈ మార్పు పిల్లలు, తల్లిదండ్రులు ఇరువైపుల నుంచి ఉండాలి.

వరకట్నం మనం విస్మరిస్తున్న పెద్ద సమస్య!

ఇన్నేళ్లయినా మనం ఇంకా వరకట్నం సమస్యను రూపుమాపలేకపోయాం. మనం దాన్ని ఆమోదించేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య హైదరాబాద్‌లో లుఫ్తాన్సా సంస్థలో పనిచేసే ఎయిర్‌ హోస్టన్‌ కూడా వరకట్నం వేధింపులతో మేడ మీద నుంచి దూకి చనిపోయింది. ఎంత దారుణం! ఇప్పటికీ మన స్నేహితులు, స్నేహితురాళ్లు కట్నాలు ఇచ్చిపుచ్చుకునే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నేను చాలామంది అబ్బాయిలను అడిగాను… మీరు కట్నం తీసుకుంటారా అని! వాళ్లు తీసుకుంటామనే అంటున్నారు. అలా తీసుకోకపోతే, ఏదో లోపం ఉందనుకుంటారు అనే పరిస్థితి సమాజంలో ఉంది. అంతే  కాదు. అబ్బాయిలే తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎందుకు ఇలా? ఈ అంశాలపై సమాజంలో చర్చ జరగాలి. అందుకే నేను నో డౌరీ డే అంటూ ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించాను.

తెలంగాణ మహిళాకమిషన్‌ కోసం పోరాడా..

వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడే నో డౌరీ డే గురించి ప్రచారం చేశా. అప్పుడే మహిళా కమిషన్ గురించి తెలుసుకున్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన కమీషన్. ఈ కమిషన్‌కు చాలా అధికారాలు ఉంటాయి. కొన్ని కోర్టు అధికారాలు కూడా ఉంటాయి. అయితే తెలంగాణలో అసలు ఈ కమిషన్‌ పేరుకే ఉండేది. ఆ కమిషన్ ను సంప్రదించాలని ప్రయత్నిస్తే, అసలు  మహిళా కమిషన్‌ కు కొంత కాలంపాటు ఛైర్మన్‌ లేరు, సభ్యులూ లేరని తెలిసింది.  ఇది నా దృష్టికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఆ ఇష్యూ మీద చాలా పోరాటం చేశాం. విజ్ఞప్తులు ఇచ్చాం. గవర్నర్, రాష్ట్రపతి వంటి వారికి లేఖలు రాశాం. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపాం. చివరకు కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలతోనే చివరకు తెలంగాణలో మళ్లీ మహిళా కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించారు. 

అందుకే అవాజ్‌ తెలంగాణ స్థాపించా..

మహిళా కమిషన్‌ గురించి పోరాడుతున్నప్పడే మాకు అనేక సమస్యలపై అవగాహన వచ్చింది. చాలా సమస్యలపై ఇంకా పోరాటం సాగించాలని అర్థమైంది. చాలా మంది మేమూ పోరాడతామని ముందుకు వచ్చేవారు. అందుకే ఆవాజ్ తెలంగాణ అనే సంస్థను స్థాపించాం. తెలంగాణలో మహిళా సమస్యలపై దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. అనేక సమస్యలపై వాలంటీర్లను ఏర్పాటు చేసి, అధ్యయనం చేస్తున్నాం. మహిళా సంక్షేమం గురించి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ చట్టాల అమలు కోసం పోరాడుతున్నాం. కోర్టుల్లో కేసులు వేస్తున్నాం. సమస్యలపై ప్రచారం చేస్తున్నాం.

లింగ వివక్ష గురించి తెలుసుకోవాలి

లింగ వివక్ష అంటే కేవలం ఆడ, మగ మాత్రమే కాదు! గేస్, లెస్బియన్లు, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలి. వారి సమస్యల గురించి ఆలోచించాలి. ఈ ఎల్జీబీటీ వాళ్ల సమస్యలు మరింత దారుణంగా ఉన్నాయి. అలాగే మహిళాసాధికారిత పెంచాలి. పెళ్లాలపై జోకులు మాన్పించాలి. ఇంకా సమాజంలో అనేక వర్గాల పరిస్థితి దారుణంగా ఉంది. వారి గురించి కూడా ఆలోచించాలి. ఈ సమాజం మారదు అనే మాటలు మానేయాలి. సమాజంలో మనమూ భాగమే అనే స్పృహ అందరిలోనూ రావాలి. దానికి మనం ప్రయత్నించాలి. పోరాడితే మార్పు సాధ్యమే అని గ్రహించాలి.

సవాళ్లను ఓడించే… సుందరి పిసుపాటి

ఇదీ నేపధ్యం!

ఈ లోకంలో 1272 నుంచే న్యాయవాద వృత్తి ఉంది. కానీ 1847లో.. అంటే ఆరువందల ఏళ్ల తర్వాత మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా మరీజా నిలదొక్కుకున్నారు. మన దేశంలో అయితే 1897లో కార్నేలియా సొరాబ్జీ ప్లీడరుగా రాగలిగారు. Legal practitioners Women Act 1923 వచ్చేవరకు మహిళలు న్యాయవాదాన్ని ప్రాక్టీస్‌ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. 1989లో ఫాతిమా బీబీ… సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం ఓ అరుదైన మజిలీ.

మా తాతగారు అనంతపురం గుత్తిలో న్యాయవాదిగా ఉండేవారు. ఆయనతో పాటు కోర్టుకు వెళ్తూ, ఆయన క్లయింట్లతో మాట్లాడుతున్నప్పుడు గమనిస్తూ ఉండేవాళ్లం. మా నాన్నగారికి నన్ను కూడా న్యాయవాదిగా చేయాలని ఉండేది. దానికి తగ్గట్టుగానే నేను వాదించేందుకు, విభేదించేందుకు భయపడేదాన్ని కాదు. బెరుకులేకుండా మాట్లాడేదాన్ని కాబట్టి స్కూల్లో కూడా వక్తృత్వ పోటీల్లో నిలబడేదాన్ని.

ఎదురైన అవకాశం

ఇంటర్‌ తర్వాత ‘బెంగళూరులో నేషనల్‌ లా స్కూల్‌’లో ఐదేళ్లు న్యాయవాద కోర్సు చదివేందుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్‌ చట్టం లాంటి అరుదైన రంగంలోకి ప్రవేశించడం ఓ అదృష్టమే. దానికోసం న్యూయార్కులో కొలంబియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్పొరేట్‌ లా చదువుకున్నాను. అక్కడే న్యూయార్క్‌ బార్‌ లో సభ్యత్వం తీసుకుని…. 2,500 మంది న్యాయవాదులు ఉన్న ‘సిడ్లీ ఆస్టిన్‌ బ్రౌన్‌ అండ్‌ ఉడ్‌’ అనే ప్రతిష్టాత్మక సంస్థలో ఆరేండ్ల పాటు పనిచేశాను. అక్కడే కంపెనీల వ్యవహారాలకు సంబంధించి mergers, acquisitions, taxation… లాంటి రంగాల్లో అనుభవాన్ని సంపాదించుకున్నాను.

దేశానికి తిరిగి వచ్చిన సమయంలో… విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందుకు నిపుణుల సలహాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. మాకు ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాదుల్లో ఆఫీసులు ఉన్నాయి. ఈ రంగం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా వృద్ధి సాధిస్తుంది అనే నా అంచనా!

ఇష్టంలో కష్టం ఉండదు!

ఏ పని అయినా ఇష్టంతో, ఆసక్తితో, స్ఫూర్తితో, జిజ్ఞాసతో చేస్తే… అసలు అది పనే అనిపించదు. ఒత్తడీ తెలియదు. నేను అలా పని చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టే… ఈ వృత్తి నాకు ఒత్తిడి అనిపించదు. ఇందుకు నా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంది. ఒకవేళ ఎప్పుడన్నా ఒత్తిడిగా అనిపిస్తే… దాన్ని హ్యాండిల్‌ చేయడం కూడా అలవాటు అయిపోయింది.

మేం చూసే కేసుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. పైగా రాత్రిబగళ్లు పనిచేయాల్సి వస్తుంది. వీటితో పాటు న్యాయస్థానంలో వాదనలకి సిద్ధం కావల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఒత్తిడి కలిగించే వాతావరణమే! అందుకోసం వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేస్తుంటాను. సమయం దొరికినప్పుడు పని గురించి ఆలోచించడం మానేసి… కుటుంబంతో గడిపితే… ఉన్న ఒత్తిడి కాస్తా మాయమైపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు చిన్నప్పుడు కూడా అమెరికాకి చదువుకోవడానికి వెళ్లినప్పుడు నా బాబుకు ఏడు నెలలు. వాళ్లు కూడా ఇప్పుడు న్యాయవాద వృత్తిలోకి వచ్చారు.

గుర్తింపు!

Forbes Legal Power జాబితాలో నా పేరు కూడా వచ్చింది. దీనికి కారణం ఒకటే. మనం చేసే కృషి, లక్ష్యసాధన, క్రమశిక్షణ… కష్టపడితే విజయం తథ్యమని తెలుసుకున్నాను. చల్లాపూర్ణయ్య, జి.కె.మూర్తి, జస్టిస్‌ పర్వతరావు… లాంటి పెద్దలని గమనిస్తూ వారిలో వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, నమ్మకం, ఏకాగ్రతతో పని చేయడం నేర్చుకున్నాను.

మనసు నిబ్బరంగా!

వైద్యుల లాగా న్యాయవాదులు కూడా ఇతరుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. సమస్యలు ఉంటేనే కదా లాయర్ల దగ్గరకు వెళ్లేది. కానీ అవి మన మనసును తాకకూడదు. మనం చెప్పాల్సిన సలహా చెప్పడం, వాళ్లకు సరైన దారి చూపించడం. న్యాయవాదులుగా మన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించాలి. అంతకుమించి చేయగలిగిందేమీ లేదు! ఆ డిటాచ్‌ మెంట్‌ మా సీనియర్ల నుంచీ అలవడింది.

వ్యక్తిగతంగా

– ఎన్ని కేసులలో వాదించినా… ప్రజలకు మేలు చేసే సమస్యల కోసం ‘ప్రజా ప్రయోజన కేసులు (PIL)’ వాదించినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది.

– నేను హైదరాబాద్‌ TiE లో కూడా భాగస్వామిగా ఉన్నాను. స్టార్టప్‌ సంస్థలు, కొత్తగా వ్యాపారాలు పెట్టుకునేవాళ్లు మార్గదర్శకత్వం కోసం అందులో చేరతారు. చట్టబద్ధంగా వారికి ఎలాంటి సమస్యలూ రాకుండా ఉండటానికి మేము సలహాలు ఇస్తాము.

– నేను సభ్యురాలిగా ఉన్న సీఈఓ క్లబ్‌ కూడా విజయవంతమైన వ్యాపారవేత్తల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఇస్తుంది.

వ్యాపారం ఓ సామాజిక బాధ్యత

జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. సమాజానికి మన వంతుగా ఏమన్నా చేయాలి అనే సిద్దాంతాలతోనే మా సీనియర్స్, పెద్దలు, మార్గదర్శకులు పెంచారు కాబట్టి ఇలాంటి సంస్థల్లో భాగస్వామిగా చేరాను. జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తాత్కాలిక లాభాల కోసం పొరపాట్లు చేయకూడదు. రుణాల ఎగవేత, చట్టాల అతిక్రమణ లాంటి తప్పులు చేయకూడదు. మన మీదే ఆధారపడి ఎన్నో కుటుంబాలు, చిన్న వ్యాపారులు ఉంటారు. కాబట్టి… వ్యాపారాన్ని ఓ సామాజిక బాధ్యతగా భావించాల్సి ఉంటుంది.

మార్పు సాధ్యమే!

మగవారితో పోలిస్తే… మహిళలు ఈ వృత్తిలో తక్కువే కానీ, ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అయినా మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర కేవలం పది శాతం మాత్రమే. కాబట్టి మహిళలు ఇంకా ఈ రంగంలోకి ప్రోత్సహించాలి. నేను చిన్నప్పుడు ఇంటర్‌లో టాప్ వచ్చినప్పుడు… జస్టిస్‌ అమరేశ్వరిగారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఓ గొప్ప ప్రోత్సాహం. అలాగే…. ఈ రంగంలో రాణిస్తున్నవారి నుంచి ఇప్పటి యువతులకు ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

మహిళలు ఇంటాబయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. చాలామందికి సోపర్ట్‌ ఉండకపోవచ్చు. కానీ ఎలాంటి అడ్డంకులు, సవాళ్లు వచ్చినా… వాటిని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ఇంట్లో వాళ్లతో మాట్లాడి… ‘నేను ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను. ఇంట్లోనే ఉండిపోతే సంపూర్ణమైన వ్యక్తిగా ఉండలేను’ అని చెప్పగలగాలి.

కొన్నేళ్ల క్రితం… చాలామంది యువత సాప్ట్‌ వేర్‌, వైద్యం దిశగా వెళ్లేవారు. నేను చదివేటప్పుడు కూడా వేలాది మందిలో ఒకరు మాత్రం ఇటు వైపు వచ్చేవారు. కానీ ఇదంతా 20-30 ఏళ్ల నాటి సంగతి. కొన్నాళ్లుగా ఈ తీరు మారుతోంది. చట్టపరమైన సేవలకు డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా కళాశాలలు కూడా పెరుగుతున్నాయి. న్యాయంలో ఆర్థికం అనేది మంచి రంగం. న్యాయరంగంలో వస్తున్న సంస్కరణలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. న్యాయవిద్యలోనూ నాణ్యత పెరిగింది.

ప్రతి పాత్రలోనూ నేను ప్రవేశించాల్సిందే!

సినిమాలు అంటేనే…

నాకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే పిచ్చి. సినిమా చూసి బాగుండటం, బాగోలేదు అనుకోవడం కాదు. దాని మీదే బతకాలనిపించేంత పిచ్చి. పైగా మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ కూడా స్టేజి ఆర్టిస్టులే కావడంతో చిన్నప్పటి నుంచి కళల పట్ల మక్కువ ఏర్పడిందేమో! ప్రతి మనిషీకీ ముందు తన మీద తనకు ప్రేమ ఉంటుంది… కానీ నాకు నా మీద కంటే సినిమా మీదే ఎక్కువగా ప్రేమ.

నేను స్టేజి ఆర్టిస్టుని కాబట్టి నటుడిగానే సినిమాల్లోకి అడుగుపెట్టాలని అనుకున్నాను. క్రమంగా నాటికలు రాయడం అలవాటు అయ్యింది. ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టానో, రచయిత అవుదామని అనిపించింది. నాటకానుభవం రచయితకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రేక్షకులకు ఏం కావాలి, వాళ్లు ఎక్కడ ఎలా స్పందిస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా తెలుస్తుంది కాబట్టి.

మా అమ్మమ్మకు సినిమా అంటే పిచ్చి. పసిపిల్లలుగా ఉన్నప్పుడే నన్ను, తమ్ముడిని తీసుకుని సినిమాలకు వెళ్లేది. అప్పుడు రామారావుగారి సినిమాలు చూస్తుండిపోయేవాడిని. ఇంటికి వచ్చాక కూడా ఆయననే అనుకరించేవాడిని. అప్పట్లో అమ్మానాన్నలు ఇద్దరూ నాటకాల్లో బిజీగా ఉండేవారు కాబట్టి… నాకు ఇది మంచి, ఇది చెడు అని చెప్పింది ఆయన సినిమాలే! తర్వాత ఖైదీ నుంచి చిరంజీవి గారంటే అంత ఇష్టం ఏర్పడింది. అప్పటి సినిమాలు మనిషిని మార్చేవి. చెడు మీద మంచి చేసే పోరాటంలా ఉండేవి. హీరో అంటే మనకోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం పుట్టాడు అనిపించేది.

అవకాశాలు అందుకుంటూ

నేను సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు, నాకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు. పైగా మొహమాటం, వయసు కూడా చిన్నదే. మొదటగా ఈటీవీలో ఓ టెలిఫిల్మ్ రాసే అవకాశం రావడంతో…. పుత్తడిబొమ్మ డైలీ సీరియల్‌ కు అవకాశం వచ్చింది. అది క్రిష్‌ గారి సొంత నిర్మాణ సంస్థ కావడంతో, ఆయనకు నా పని నచ్చి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అదృష్టవశాత్తు నాకు వచ్చిన కథలన్నీ కూడా లోతైన సంభాషణలకు అవకాశం ఇచ్చేవే! వాటిలో పాత్రలు మన కళ్లముందు కనిపించేవే, వారి సమస్యలు మనం చూసేవే. ఆ సంఘటనలు నానుంచి అలా రాయించుకున్నాయి అంతే!

మధనపడితేనే సంభాషణ వస్తుంది. ఎన్నోసార్లు రాస్తాం, కొట్టేస్తాం. బాగా వచ్చింది అనుకున్నాక కూడా, ఇంతకంటే బాగా రాయాలి అనిపిస్తుంది. మనం ఒక మనిషి కోసం ఎదురుచూస్తున్నాం అంటే అర్థం, తన గురించి ఆలోచిస్తున్నాం అని. అలాగే సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉంటే కచ్చితంగా ఫలితం వస్తుంది. సంభాషణలు రాసేటప్పుడు నేను పాత్రలతో పాటు ప్రయాణించే ప్రయత్నం చేస్తాను. ఆ సన్నివేశంలో పది పాత్రలు ఉంటే… ప్రతి పాత్రలోనూ నేను ప్రవేశించాల్సిందే. ఆ పాత్ర నేనే అనీ, ఆ సమస్య నాదే అనీ భావించినప్పుడే తగిన మాటలు వస్తాయి.

కాగితాలు తడిసిపోయాయి

మహానటి రాసేటప్పుడు ఎన్నోసార్లు కన్నీళ్లతో కాగితాలు తడిసిపోయేవి. ఆవిడ ఇన్ని కష్టాలు పడిందా అనిపించేది. ఇక చిరంజీవి లాంటి వాళ్లతో పనిచేయడం అద్భుతం. నేను చిన్నప్పటి నుంచి కంటున్న కల అలాగే నడుస్తోందేమో, నేను ఇంకా నిద్ర లేవేలేదేమో అనిపించేది అలాంటప్పుడు! నాకు ఆత్రేయగారంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ఏ సినిమా తీసుకున్నా… ఒక చిన్న వాక్యమే సినిమా అంత అర్థం చెబుతుంది. అలతిఅలతి పదాలతో అంతులేని భావాన్ని పలికించగలరు. అందుకనే నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని.

తెనాలి అంటేనే!

ఎవరికైనా వాళ్ల పుట్టిన ఊరంటే ఇష్టం. ప్రతి ఊరికీ ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. అలా నా ఊరి గొప్పదనం కళ. నేను ఇక్కడికి వచ్చి మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకుంటున్నాను కానీ… ప్రయత్నం చేస్తే తెనాలిలో చాలామంది మంచి రచయితలుగా స్థిరపడతారు. ఓ సినిమా చూసి, అక్కడి సామాన్యుడు సైతం చెప్పే రివ్యూ చాలామంది సీనియర్ జర్నలిస్టులు రాసేవాటికంటే గొప్పగా ఉంటాయి. గోవిందరాజులు, కాంచనమాల, జగ్గయ్య, జమున, కృష్ణ ఇలా తెనాలి కళాకారుల జాబితా చెబితే ఒక పుస్తకమే తయారు అవుతుంది. మీ అమ్మ గురించి చెప్పండి అంటే నాలుగు ముక్కల్లో చెప్పలేం కదా! జీవితాంతం చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. తెనాలి కూడా అంతే. పుట్టిన ఊరు నుంచి శత్రువు వచ్చినా కూడా వాడిని కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అది జన్మస్థలం మహిమ.

మా తెనాలిలో కళలకాణాచి అనే సాంస్కృతి సంస్థను ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో పేద కళాకారులకు చేతనైనంత సాయం చేశాం. నాటకరంగ కళాకారులకు సంవత్సరానికి మూడు, నాలుగు నెలలు మాత్రమే సీజన్‌ ఉంటుంది. అదే సమయంలో కొవిడ్‌ రావడంతో సంవత్సరం అంతా ప్రభావం పడింది. తెనాలి కళాకారులకు మేము సాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు ఎందరో ముందుకు వచ్చారు.

సంప్రదాయాలు బాగుంటాయి

నేను రామారావుగారికి, ఆత్రేయగారికి, ఘంటసాల గారికీ పుష్కరాల సమయంలో పిండప్రదానం చేశాను, ఇక ముందు చేస్తాను కూడా. ఎందుకంటే వాళ్లు జాతి సంపద కాబట్టి! పిండప్రదానం అనేది కేవలం కన్నవారికి మాత్రమే కాదు… మనం ఎవరెవరికి రుణపడి ఉన్నామో వారందరికీ చేయాలి అనే కథ చదివాక అలా చేయాలి అనిపించింది. నాకు మన ఆచారాలు, సంప్రదాయాలు అంటే ఇష్టం. అవి నిజమో కాదో తెలియదు కానీ  వాటిని ఆచరిస్తుంటే బాగుంటాయి. మామిడి తోరణాలు ఎందుకు కడతాం అనేదానికి చాలా కారణాలు వినిపించవచ్చు. అవి నిజం అయినా కాకపోయినా… తోరణాలు కడితే గుమ్మం అందంగా, ముచ్చటగా ఉంటుంది కదా!

మనసు మాట వినాలి

మనమేమిటో మనకు తెలియాలి. దానికోసం కష్టపడాలి, బతకాలి. నేనేమిటో నాకే తెలియకపోతే, నేను ఎందుకు బతకాలో, ఎలా బతకాలో తెలియదు కదా! ఎలాగొలా బతికేద్దాం అనే ఆప్షన్‌ అస్సలు ఉండకూడదు. నాలో రచయిత ఉన్నాడా, వ్యాపారస్తుడు ఉన్నాడా, క్రీడాకారుడు ఉన్నాడా… తెలిసినప్పుడు నేను అలాగే బతికేందుకు ప్రయత్నిస్తాను. ఇష్టం లేకుండా ఏం చేయకూడదు. మనం చేసే ప్రయాణం మనకు నచ్చకపోతే, ఎప్పుడు దిగిపోతామా అనిపిస్తాము. ఇది మన జీవితం, మన లక్ష్యం!

ముందు మన మనసు ఏం చెబుతుందో వినాలి. అలా కాకుండా బుద్ధికి తోచినట్టు చేస్తే కుదరదు. మన మనసు చెప్పే మాట మనం వింటే చాలు. మీరు చెప్పిన మాట కూడా మీరు వినకపోతే ఇంకెవరు వింటారు. సంపాదన కోసమో, లైఫ్‌ స్టైల్‌ కోసం ఎప్పుడూ లక్ష్యం పెట్టుకోకూడదు. అది మన మనసులోంచి పుట్టాలి. దాన్ని సాధించడం మన చేతిలో ఉన్నది అంతే! సంకల్పంలో ధర్మం, నిజాయీతీ ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. మనుషులు చేస్తారేమో కానీ లక్ష్యాలు మోసం చేయవు. ఆ మాటకు వస్తే మనుషులే లక్ష్యాన్ని మోసం చేస్తుంటారు.

నీకు నువ్వున్నావు కదా!

నేను చాలాసార్లు ఓడిపోయాను కానీ ఓటమికి నేను ఎప్పుడూ భయపడలేదు. నాకు నేనున్నాను అన్నదే నా ధైర్యం. ఓటమీ నాదే, గెలుపూ నాదే. నేను సంపాదించుకున్న ఓటమి అది. నేను చేసిన తప్పుల వల్ల వచ్చిందది. అవి సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా! అంతేకానీ ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు.

నేను రచయితగా ఇంకా రాయాల్సిన కథలు చాలా ఉన్నాయి. ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడిలోనూ ఓ రచయిత ఉంటాడు. నేను రాసిన కథ ఏదన్నా… నాలాగే చెప్పాలి అని బలంగా అనిపించినప్పుడు నేను దర్శకుడిగా కూడా మారతానేమో!

ఆకలి తీరుస్తూ… అండగా నిలుస్తూ!

ఇలా మొదలైంది!

అవి కొవిడ్‌ మొదలైన తొలి రోజులు. అందరిలా నేను కూడా ఓ మధ్యతరగతి మనిషిగా ఆలోచించి, నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుని… లాక్‌ డౌన్ నిబంధనలు పాటిస్తూ వచ్చాను. 2020, ఏప్రిల్‌ 13న మా చిన్నబ్బాయి పుట్టినరోజు కావడంతో… లాక్‌ డౌన్‌ తర్వాత మొట్టమొదటిసారి చికెన్‌ షాపు దగ్గరకు వెళ్లాను. అక్కడ ఒక కస్టమర్‌ చాలాసేపు లోపలే ఉండిపోయింది. నేను తను ఎందుకంత చికెన్‌ కొనుక్కుందా అని అడిగితే… ‘నేను వాచ్‌ మెన్‌ గా పనిచేస్తున్నాను. నేను పనిచేసే అపార్టుమెంటు ముందు, నిర్మాణంలో ఉన్న భవనంలో చాలామంది కార్మికులు ఆకలితో పస్తులుంటున్నారు. వాళ్లకి రోజూ నా కోడలు అన్నం పెడుతోంది. ఓ రెండు రోజుల నుంచి వాళ్లు సరిగా తినలేదు కాబట్టి… కాస్త ధైర్యం, బలం వస్తుందని చికెన్‌ కొనుక్కు వెళ్తున్నాను’ అని చెప్పింది. తన జీతం ఆరువేలు… చికెన్‌ బిల్లు రెండు వేలు. మరి ఎందుకంతగా సేవ చేస్తోందంటే… ‘నాకు భాష వస్తుంది. నేను ఎవరి దగ్గరకు వెల్లినా పని దొరుకుతుంది. అప్పు దొరుకుతుంది. వాళ్లను ఎవరూ నమ్మరు కదా. వాళ్లకు మన భాష కూడా రాదు.’ అని చెప్పింది ఆ మాట విని చెంప ఛెళ్లుమన్నట్టు అనిపించింది.

వెంటనే నా వంతుగా నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఎవరెవరు అవసరంలో ఉన్నారు? వాళ్ల వివరాలు, ఫోన్‌ నెంబర్లు ఏమిటి? అని జాబితా తయారుచేశాను. వాళ్లకు సాయపడేందుకు నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకున్నాను. లక్షన్నర ఉన్నాయి. వాటితో కొంతమందికైనా ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈలోగా పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. అందులో ఆరేడు లక్షలు వస్తాయి కాబట్టి వాటితో కార్‌ కొనుక్కోవడమో, లేకపోతే పిల్లలకు చదువుకు ఉపయోగించడమో అని ఒకప్పుడు కోరికగా ఉండేది. ఇప్పుడు లక్ష్యం మారింది. ఓ కిరాణా షాపు నుంచి ఎవరి ఆహార అలవాట్లను బట్టి వారు సరుకులు తీసుకోమని చెప్పి, బిల్లు నేనే చెల్లించేవాడిని. ఇలా 190 మందిని కొన్నాళ్లు గమనించుకుని, చివరకు వాళ్లను ప్రభుత్వ సాయంతో స్వస్థలాలకు పంపాము.

సొంత ఇంటి కలను కాదని…

జూన్‌ 2, 2020 నా పెళ్లి రోజు  కావడంతో అమ్మానాన్నలతో గడిపేందుకు ఊరికి వెళ్లాం. ఎప్పటి నుంచో మా పిల్లలు త్రిబుల్‌ బెడ్రూం ఫ్లాట్‌ అడుగుతున్నారు కాబట్టి ఊళ్లో నాకు ఉన్న రెండు ఎకరాలను అమ్మి… ఇల్లు కొనుక్కోవడానికి ఆ నలభై లక్షలు తెచ్చాను. మా ఎదురుగుండానే ఓ ఫ్లాట్‌ చూసుకున్నాము. దాని గురించే మాట్లాడుకుంటూ పడుకున్నాం. ఆ ఉదయం 5.30కే మా వాచ్‌ మెన్‌ ఫోన్‌! బయట 20-30 మంది మీ సాయం కోసం వచ్చి నిలబడ్డారు అని. మళ్లీ నా ప్రయాణం మొదలైంది. వాళ్ల కోసం అప్పుడో లక్ష, అప్పుడో యాభై వేలు అంటూ భార్య నుంచి తీసుకుంటూ… 170 రోజులు అయ్యాక చూసుకుంటే అయిపోయాయి. నా కుటుంబాన్ని కూర్చోబెట్టి ఇదంతా చెప్పుకొచ్చాను. వాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరమూ రాలేదు. కాకపోతే నా ఆరోగ్యం గురించే భయపడ్డారు.

వేలమందికి సాయం!

ఇప్పటివరకూ (మార్చ్‌ 2021) సుమారు 40 వేల కుటుంబాలకు సాయం చేయగలిగాము. ఎప్పటికప్పుడు మేము రైస్‌ ఏటీఎమ్‌ మూసి వేయాలని అనుకుంటున్నాం… ఎందుకంటే ప్రజలు మా దాకా రాకుండా వాళ్ల కాళ్ల మీద బతికే పరిస్థితి రావాలి అనుకుంటున్నాం కానీ… అందరికీ ఆ స్థితి ఒకేసారి రాదు కాబట్టి అవసరంలో ఉన్నవారికి సాయపడుతున్నాం. పాతవాళ్లనైతే రాకుండా చేయగలిగాం! డబ్బులు అయిపోయిన ప్రతిసారీ, సరిగ్గా ఎవరో ఎక్కడి నుంచో మా గురించి విని పంపే సాయం అందేది.

నా విజయ సూత్రం ఒకటే. నిబద్ధతతో పనిచేస్తున్నా, అపాత్ర దానం చేయడం లేదు. అంతటితో ఆగిపోకుండా ప్రాజెక్ట్‌ ప్రిష పేరుతో కష్టంలో ఉన్నవారు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి కావల్సిన సాయం చేయడమే దీని లక్ష్యం. కుట్టుమిషన్‌, బండి, కేటరింగ్‌, టీస్టాల్స్‌… ఇలా ప్రాజెక్ట్ ప్రిష ద్వారా 300 కుటుంబాలకు జీవనోపాధి కల్పించగలిగాం.

ఇంతింతై

మొదట్లో కరోనాకు భయపడి, నాతో పాటు ప్రయాణించేవారు కాదు. క్రమంగా ఒకొక్కరే తోడయ్యారు. నేనుండేది గేటెడ్‌ కమ్యూనిటీ అయినా, ఎవరూ అడ్డు చెప్పలేదు. నేస్తాలు కూడా మొదట్లో అపాత్రదానం చేస్తున్నవేమో అని హెచ్చరించారు కానీ… ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ధైర్యం ఇస్తున్నారు. మా సాయం అర్హత ఉన్నవారికే అందేందుకు ఓ స్క్రీనింగ్‌ ప్రాసెస్‌ ఏర్పాటు చేశాము. ప్రతి శని, ఆదివారాలు పూర్తిగా… ఎవరు అర్హులు, ఎవరికి ఏం ఇవ్వాలి అని తెలుసుకోవడానికే వెచ్చిస్తాం. ఈ రైస్‌ ఏటిఎమ్‌ లో ఇప్పుడు ఒకో విభాగాన్నీ ఒకొక్కరికీ అప్పచెప్పాం. అంతేకాకుండా… మా దగ్గరకు ఎంతో మంది కోటి ఆశలతో, వారి జీవితాలు మారతాయనే నమ్మకంతో వస్తారు. వారిని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు అప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. ఎవరన్నా గోప్యత కోరుకుంటే… వాళ్ల ఇంట్లోకూడా తెలియకుండా సెకండ్‌ ఏటీఎమ్‌ ద్వారా సాయం చేస్తాం. అక్కడ ఎలాంటి ఫోటోలు, మీడియాలు ఉండవు.

మాకు అండగా నిలబడేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్లు ఏ విధంగా మాకు సాయపడగలరు అని బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. వారిలో ఏ దురాలోచన ఉన్నా… ఇన్నాళ్ల మా శ్రమ వృధా అయిపోతుంది.

మొదటినుంచే!

ఎదుటిమనిషికి సాయం చేయడం అనే అలవాటు మొదటి నుంచే ఉండేది. అది మా పెద్దవాళ్ల నుంచే అలవడింది. నాకు పెళ్లయ్యి, నా భార్య అయిదో నెలలో ఉండగా… ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చాడని అనుకుని మరింతగా సేవ చేయడం మొదలుపెట్టాను. ప్రతి వారాంతంలోను హెల్మెట్‌, రోడ్‌ సేఫ్టీ, రక్తదానం, పర్యావరణం… లాంటి విషయాల కోసం కృషి చేసేవాడిని.

హెల్మెట్‌ గురించి అవగాహన కల్పిస్తున్నప్పుడు- Friends to Support అనే సంస్థ మొదలుపెట్టి రక్తదానానికి సాయపడ్డాం. దిల్‌ సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ల తర్వాత… మన భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు ఉండాలంటూ ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధులు అందరినీ కలిసి missed call movement మొదలుపెట్టాను. పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ సంచీల వాడకాన్ని తగ్గించాలని నినదిస్తూ టిఫిన్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ మొదలుపెట్టాను. నా జీతంలో యాభై శాతం పేదల కోసం ఖర్చు చేయడం అలవాటే కాబట్టి…. సాధారణ జీవితానికే అలవాటు పడ్డాను. అందుకనే ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేయడానికి పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు.

దాతలకు

చాలామందికి సాయం చేయాలి అని ఉంటుంది. అలాంటివారికి మేము మూడు రకాల మార్గాలు చూపిస్తాం. విద్య (ఉపకార వేతనాలు), ఉపాధి (ప్రిష), ఆహార పదార్థాలు (రైస్‌ ఎటిఎమ్‌)! మా తీరు పారదర్శకంగా ఉండేందుకు, దాతలకు తృప్తిగా ఉండేందుకు… మేలు పొందినవారి ద్వారా ఒక ధన్యవాదాలు అందచేస్తున్నాం. మన భారతీయులు చాలా దయార్ద్ర హృదయలు. కాకపోతే తమ సేవ అర్హత లేని వారికి వెళ్తున్నదేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి సందేహం లేకపోతే… తప్పకుండా ముందుకు వస్తారు.

ఓ ప్రయోగాల జీవితం

చాలామందికి నాయకత్వం మీద తరగతులు నిర్వహిస్తున్నప్పుడు నేను ఏం చెబుతానంటే… మీరు పెద్దయితే ఏమవుతారో కూడా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మాత్రం స్పష్టత ఉండాలి, దాన్నినిబద్ధతతో చేయాలి. అప్పుడు లోకమే మన కోసం తగిన భవితను ఏర్పరుస్తుంది. పెద్దలు చెప్పింది వింటూ, వాటిలో మన స్వభావానికి ఏది అనువుగా ఉంటుందో బేరీజు వేసుకునే ఆలోచనా శక్తి వస్తే మార్గం అదే కనిపిస్తుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ!

మా నాన్నగారు విద్యుత్ శాఖలో అకౌంటెంట్‌. హోమియోపతి ఆయన అభిరుచి. తన జీవితకాలం ఉచితంగా వైద్యం చేస్తూనే వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా ఎన్నో గుప్తదానాలు చేసేవాళ్లు. మా అమ్మ చాలా తెలివైనదే కాదు… ఎవరి గురించీ ఏనాడూ చెడుగా మాట్లాడని సంస్కారవంతురాలు.

అనూహ్యమైన మలుపులు!

హైస్కూల్‌ లో ఉన్నప్పుడు ఇంటర్‌ లో ఉన్నప్పుడు దేని మీదా పెద్దగా శ్రద్ధగా ఉండేది కాదు. దాంతో మంచి మార్కులు వచ్చేవి కాదు. తక్కువ మార్కుల వల్ల ఇంగ్లిష్‌ మీడియంలో కూడా సీట్‌ రాలేదు. బీఎస్సీ తెలుగు మీడియంలో ఉండేవారం. అందరూ ‘మీరేంటి… అంత తెలివి ఉండీ పనికిరాకుండా అయ్యారు’ అనేవారు. దాంతో సిగ్గుపడి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. దానికితోడు కొంతమంది మంచి ఉపాధ్యాయులు మాకు ప్రత్యేకమైన శ్రద్ధతో చెప్పేవారు. నాకే నమ్మశక్యం కాని విధంగా ఫస్ట్‌ క్లాస్‌ వచ్చింది. దాంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చేశాను. యూనివర్శిటీ ర్యాంక్‌ కూడా వచ్చింది.

ఆ విజయంతో అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేయాలనిపించేది. ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉండటంతో ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అమెరికాలో ఉంటున్న బంధువు నా చదువుకు సాయం చేస్తానని చెప్పడంతో… అటువెళ్లాలనే ఊగిసలాట. ఈలోగా అనుకోకుండా ఐఐటి మద్రాసులో సీటు రావడంతో అందులో చేరాను. అక్కడ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తయిన వెంటనే వరంగల్‌ లో Kakatiya Institute of Technology లో Physics Head of the Department హోదా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అదే సమయంలో ONGC ఉద్యోగమూ వచ్చింది. అప్పటి అభిప్రాయాల ప్రకారం, సహజంగానే నేను ప్రభుత్వం ఉద్యోగం అయిన ఒఎన్‌జిసి వైపు మొగ్గు చూపించాను. కానీ ఈలోగా అమెరికాలో చదువకునేందుకు స్కాలర్‌ షిప్‌ కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నాను.

అమెరికా ప్ర..యాణం

చాలా రోజుల పాటు వేచి చూసిన తర్వాత, ఇక ఒఎన్‌జిసిలో చేరదామని, రైల్వే స్టేషన్‌ను వెల్లిపోయాక అమెరికా నుంచి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ దొరికినట్టు ఉత్తరం వచ్చింది. అది అసోంలో ఉన్న నన్ను చేరుకోవడానికి 20 రోజులు పట్టింది. ఆ పాటికి నేను అక్కడ పూర్తిగా కుదురుకుపోయాను. అక్కడి నుంచి ఫోన్‌ చేయాలి అంటే 40 మైళ్లు వెళ్లి… ఆఫీసులో ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి 18 గంటలు వేచి చూస్తేనే ఫోన్‌ చేసే అవకాశం వస్తుంది. అలా ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి.. మా ప్రొఫెసరుతో మాట్లాడితే… మరో 15 రోజుల్లో రాగలిగితే, సీటు దక్కుతుందని చెప్పారు. అక్కడి నుంచి మద్రాసుకు వెళ్లడానికే రెండున్నర రోజులు పట్టింది. అదృష్టవశాత్తు వీసా వచ్చింది కానీ, టికెట్‌ కోసం పదివేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంట్లో అవీఇవీ అన్నీ అమ్ముకుని… ఎలాగొలా టికెట్‌ డబ్బులు సేకరించాను. చివరికి అమెరికాలో ఇరవై డాలర్లతో ఓ చిన్న సూట్‌ కేసుతో దిగాను.

‘మనం చేసే ప్రయత్నం చేయాలి. అదే లేకపోతే దేవుడు సాయం చేసినా, సమాజం తోడు వచ్చినా ఉపయోగం ఉండదు. కర్మణ్యే… అంటూ గీతలో చెప్పిన మాట సారాంశం కూడా ఇదే!’

అనూహ్యమైన అవకాశాలు

మనం రకరకాల పనులు చేయవచ్చు. కానీ ఏం చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టగలగాలి. అలా కాకుండా రకరకాల పనులు మీద ఒకేసారి దృష్టి నిలిపే ప్రయత్నం చేస్తే… దేని మీద ఏకాగ్రత చూపించలేను. అందుకే నేను అమెరికా వచ్చాక తర్వాత ఫిజక్స్‌ నుంచి కంప్యూటరుకు మారినా ఇబ్బంది పడలేదు. దాంతో కంప్యూటర్‌ విప్లవాన్ని అందుకోగలిగాను. నా చేతికి అందిన ఓ పర్సనల్‌ కంప్యూటర్‌ మీద ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. దాని మీద ఒక అవగాహన సాధించి… కంప్యూటర్‌ మీద ఎన్నో వ్యాసాలు రాస్తూ జర్నలిస్టుగా కూడా మారాను. అవి చూసిన యాపిల్‌ సంస్థ వారు, నన్ను వేర్వేరు సమావేశాలకు పిలిచి… నా అనుభవాలు, పరిశీలనలు చెప్పించడం మొదలుపెట్టారు. వాటికి వేల మంది హాజరయ్యేవారు. మా ఫిజిక్స్‌ ల్యాబ్‌ ఇన్‌ చార్జికి ఇదంతా నచ్చేది కాదు. ఫిజిక్స్‌, కంప్యూటర్ల మధ్య ఏదో ఒకటి నిర్ణయించుకో అని చెప్పేశారు. దాంతో కోపం వచ్చేసి మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాను.

ఆశ్చర్యంగా యుటా విశ్వవిద్యాలయం నుంచి ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీ ప్రారంభించడానికి పదిలక్షల డాలర్ల గ్రాంట్‌ లభించింది. అదే సమయంలో యాపిల్‌ నుంచి కూడా ఉద్యోగంలో చేరమంటూ ఆహ్వానం వచ్చింది. ఎలాగొలా ఆ ఉద్యోగాన్ని వదిలించుకుందామని నాకు యూనివర్సిటీలో ఇచ్చేదానికంటే రెట్టింపు ఇస్తే చేరతా అన్నాను. ఆశ్చర్యంగా వాళ్లు మూడు రెట్లు ఆఫర్‌ చేశారు. అక్కడ నేను ఏం చేయగలనో ఆలోచించి, దానికి అనుగుణంగా శ్రమించాను. మంచి వృద్ధి సాధించాను! బిల్‌ ఆట్కిన్‌ సన్‌, ఆలన్‌ కే లాంటి ఎంతోమంది ప్రతిభావంతులతోనూ పరిచయం ఏర్పడేందుకు, లోకం అంతా తిరిగేందుకు… అక్కడ అవకాశం ఏర్పడింది.

వేదాంతం… వ్యక్తిత్వ వికాసం!

సాఫ్ట్‌ వేర్లు, కంప్యూటర్‌ చిప్స్‌ రూపొందించడం కోసం, అసలు మన మెదడు ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలుస్తున్న దశలో… ‘వీటి సంగతి సరే ముందు మీ సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేయమని’ సూచించారు కొందరు శాస్త్రవేత్తలు. నీకు సంస్కృతం తెలుసు కాబట్టి.. మీ జ్ఞానాన్ని నువ్వు అనువదించి నేటి జీవితానికి అన్వయించగలిగితే బాగుంటుందని అని సూచించారు. అదే సమయంలో నాకు ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం దొరికింది. ఎంతో ఆలోచన తర్వాత… నేను ఇప్పటి వరకూ తెలుసుకున్న విషయాలన్నీ మన భారతీయ జ్ఞానంతో సమన్వయం చేయాలనే ఉద్దేశంతో యాపిల్‌ వదిలేశాను. నా నిర్ణయం విని అందరూ ‘మంచి జీతం, స్థాయిలో ఉన్న నువ్వు ఇదంతా వదిలేసి… వేదాంతాలు, వ్యక్తిత్వ వికాసం అంటావేమిటి’ అని నిరసించారు.

ఆ నిర్ణయం తీసుకున్నాక కొన్నాళ్లపాటు, వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ, దానికి నా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్నీ, శాస్త్రవేత్తలతో సాగిన సంభాషణలనీ జోడిస్తూ…  Mitya Institute of Learning and Architecture సంస్థను నెలకొల్పాను. ఓ 30 ఏళ్లుగా దాదాపు 70 వేల మంది నా కార్యక్రమాలు, ఉపన్యాసాలకు హాజరై ఉంటారు. ISB, సేబ్రూక్‌ విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. సంస్కృత భారతి డైరక్టరుగా, నార్త్ సౌత్‌ ఫౌండేషన్‌ ద్వారా పిల్లలకు స్పెల్లింగ్‌ బీ శిక్షణ అందిస్తూ… ఇలా రకరకాలుగా పనిచేస్తున్నాను.

ఇదే విజయానికి రహస్యం!

మీకు ఏం చేయాలనుకుంటే, ఎక్కడ శక్తి ఉందనుకుంటే… అందులోకి భయపడకుండా వెల్లిపోవాలి. నేను అలాగే ప్రయాణించాను. చేసేది మొదటి నుంచీ చేయి. లేకపోతే మన నమ్మకాలు, అనుభవాలు… భయాలు, అనుమానాలు కలిగిస్తాయి. ఇవన్నీ వదిలేసి… చిన్నపిల్లలు ఎలా నడవడానికి, మాట్లాడటానికి నేర్చుకుంటారో అలా ప్రయత్నించాలి.

మన పిల్లలు కూడా ఒక మూసలో ఇమిడిపోవాలి అనుకోకూడదు. ఏది మనసులో ఉంటే, దేని మీద అభిరుచి ఉంటే… ఆ దిశగా వెళ్లడానికి స్వేచ్ఛనివ్వాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఏ కోర్సు చేయాలన్నా, ఏ నైపుణ్యం కావాలన్నా పొందే సదుపాయాలు ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్లవచ్చు… అనుకునేందుకు అనువైన సమయం ఇది!

ఆనందో బ్రహ్మ!

ఒకప్పటిలాగా శరీరంలోకి చొచ్చుకువెళ్లకుండానే, fMRI, MRI స్కానింగ్‌ తో మెదడులో జరిగే పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి వల్ల అర్థం అవుతోంది ఏమిటంటే.. మన ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో, ఎప్పుడైతే ఆసక్తితో పనిచేస్తున్నామో, వేటినైనా ఆస్వాదిస్తున్నామో… అప్పుడే మనం ఎదుగుతున్నాం అని తెలుస్తోంది. ఇలాంటి పరిశోధనల వల్లే పాజిటివ్‌ సైకాలజీ లాంటి విభాగాలు వస్తున్నాయి.

ఆ మాటకు వస్తే అసలు మనం ఆనందం నుంచే మనం ఉద్భవిస్తాం. మన పిల్లలను కూడా ఆనందంగా, ప్రశాంతంగా చూస్తున్నప్పుడే వారి వ్యక్తిత్వం ఎదుగుతుంది. మన మెదడు సైతం బాధాకరమైన అనుభూతులను త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఏదన్నా సంతోషంగా నేర్చుకుంటేనే దాని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుంది.

మన శరీరంలో అలవాట్లను నియంత్రించే ప్రిమిటివ్‌ బ్రెయిన్‌, భావోద్వేగాలను ప్రభావితం చేసే లింబిక్‌ బ్రెయిన్‌, విశ్లేషణ, ప్రణాళిక సాగించే కాగ్నినివ్‌ బ్రెయిన్‌ లాంటి ఎన్నో విభాగాలు ఉంటాయి. మన మెదడు పరిశోధన పరంగా ఒకలా, మనసత్త్వపరంగా ఒకలా, ఆధ్యాత్మికపరంగా ఒకలా కనిపిస్తుంది. కానీ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమైనవే! పానిక్‌ అటాక్స్‌, పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ, కుంగుబాటు… ఇలాంటివన్నీ వైద్య పరిభాషలో కనిపించినా మానసికమైనవే!

విజయాలను పంచుకుంటూ… పెంచుకుంటూ!

మానాన్న విద్యారంగంలో ఉండేవారు. మొదటి నుంచి ఆయనకు సాయం చేసే అలవాటు ఉండేది. పేద పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పేవారు. చాలా మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. ఎందరికో సీట్లు ఇప్పించారు! వీటితో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలూ చేస్తుండేవారు. ఆయన స్ఫూర్తితో నేను 7 ఏళ్ల క్రితం మదాల ఛారిటబుల్‌ ట్రస్టు స్థాపించాను. మీ కోసం ఏం కావాలి అని మా ఊరివాళ్లను అడిగినప్పుడు, ఒక కమ్యూనిటీ సెంటర్ ఉంటే బావుంటుందని చెప్పారు. అందుకని దాదాపు 42 వేల చదరపు అడుగుల సెంటర్‌ నిర్మాణం చేశాం.

ఈ కమ్యూనిటీ సెంటర్ ఎందుకంటే

ఇప్పటికీ చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. మహిళలు, పిల్లలు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలి అనుకున్నా ఎలాంటి వేదికలు లేవు. ఇవే కాకుండా… తాగునీరు, విద్య, రహదారులు, ఉపాధి, వైద్యం, రుణాలు లాంటి చాలా విషయాల్లో సమస్యలు ఉంటాయి. ఏ ఒక్క సంస్థా వాటన్నింటికీ పరిష్కారం చూపలేకపోవచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటాయి. అలాంటి వాటిన్నింటికీ ఈ కమ్యూనిటీ సెంటర్‌ వేదికగా ఒక తాటి మీదకు తెచ్చి, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. సమస్యల పరిష్కారం కోసం మౌలిక సదుపాయాలు కావాలి. అలాగే ప్రారంభదశలో చొరవ తీసుకునేవారు కావాలి. ఈ రెండూ మేం అందించాలని ఈ కమ్యూనిటీ సెంటర్ నెలకొల్పాం.

ఉన్నఊళ్లోనే.. ఉపాధి దిశగా!

మేం ఓ వారధిలా… ఉండేందుకు ఈ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ఏర్పాటు చేశాక చాలా స్వచ్ఛంద సంస్థలు తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 2 వేల మంది హైస్కూల్, కాలేజ్ డ్రాపవుట్ విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణలు ఇచ్చి ఉపాధి లభించేలా చేశాం. ఇంకా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించేలా చేశాం.

మారుమూల ప్రాంతంలో నగర సౌకర్యాలు

ఐదారేళ్లుగా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించాం. నగరాల నుంచి ప్రత్యేక వైద్యులను రప్పించి మహిళలకు క్యాన్సర్ సంబంధింత వైద్య పరీక్షలు నిర్వహించాం. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 15 వేల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాం. వీటితో పాటు కమ్యూనిటీ సెంటర్‌లోనే యోగా క్లాసులు, షటిల్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్‌ క్రీడలు నిర్వహిస్తుంటాం. మహిళలు యోగా క్లాసులకు బాగా వస్తున్నారు. దాదాపు నగరాల్లోని సదుపాయాలన్నీ ఇక్కడ కల్పిస్తున్నాం.

నిరుపేదల విజయ గాధలతో సంతృప్తి..

కమ్యూనిటీ సెంటర్ ఉన్నా కొందరు పట్టించుకోరు. కొందరు మాత్రం బాగా ఉపయోగించుకుంటారు. పది, ఇంటర్ పాసైన తర్వాత చదువుకోలేకపోయిన వాళ్లు; ఇంటర్ ఫెయిలై ఎందుకూ పనికిరారు అనుకున్నవాళ్లు శిక్షణ తర్వాత ఉద్యోగం సంపాదించుకుని ఇంట్లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇలాంటి విజయగాధలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మేం మొదట్లో ఇవన్నీ ఊహించలేదు. కానీ… ఇప్పుడు ఇవన్నీ తలచుకుంటే కలిగే ఆనందం అమూల్యం.

ఆ భార్యలు, భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు

గతంలో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలు కూడా మా దగ్గర ట్రైనింగ్‌ తీసుకుని భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వీళ్ల గాధలు వింటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఫౌండేషన్‌ విషయంలో మా ఇంట్లో అందరూ సహకరించారు. ఇలాంటి కమ్యూనిటీ సెంటర్లు ఎవరైనా ప్రారంభించొచ్చు. మా చారిటబుల్ ట్రస్ట్ కు ఫేస్‌బుక్ పేజ్ ఉంది. దాని ద్వారా ఎవరైనా ఎన్జీవోలు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సెంటర్‌ కార్యకలాపాలు పది మైళ్ల విస్తీర్ణంలోని గ్రామాల వారందరికీ అందిస్తున్నాం.

లా చేస్తే ఎంతో తృప్తి

మా అమ్మ నాకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోయారు. నాన్న ఆరోజుల్లోనే హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఆయనకు ఎన్నో అవకాశాలు ఉన్నా, ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నారు. విద్యాశాఖ అధికారిగానూ పని చేశారు. తన జీవిత కాలంలో ఎందరికో ఎన్నో ఇచ్చారు. ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి దారి చూపారు. నాన్న తన కోసం ఎప్పుడూ ఏదీ ఆశించలేదు. ఆయన కోసమే ఈ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేశాను. చాలా మంది ఎన్నారైలకు కూడా ఇదే సలహా ఇస్తాను. మీరు విదేశాల్లో మంచి స్థితిలో ఉంటే.. మీ గ్రామాల్లో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. అది మీకు చాలా తృప్తి ఇస్తుంది.

అమ్మానాన్నలకి మనం ఏం ఇచ్చినా తక్కువే! కాబట్టి, వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలబడేలా ఒక మంచి పని చేస్తే ఎంతో సంతోషిస్తారు కదా అని అనిపిస్తుంది. మా నాన్నగారికి పెద్ద విల్లా కట్టించి ఇచ్చినా ఆయన ఇంత సంతోష పడేవారు కాదేమో! ఈ కమ్యూనిటీ సెంటర్ చూసి ఆయన చాలా ఆనందిస్తారు. మా తాత, నాయనమ్మ తిరిగిన ఈ నేల మీద ఎప్పటికి వారి పేరు నిలిచేలా చేయగలిగినందుకు సంతోషంగా వుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి! కుటుంబం అంతా కలసి ఆనందించటానికి ఎన్నో సందర్భాలు సృష్టించుకుంటాం. సేవా కార్యక్రమాలను కూడా అలాగే, కుటుంబం అంతా కలసి చేస్తే… అందరి మధ్య అనుభందం కూడా బలపడుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి!

మనసు మాట వినండి

నాన్న నుంచే అలవాటు!

నాన్నకి సినిమా అంటే చాలా ఇష్టం. కానీ ఆయన దర్శకుడు కాలేకపోయారు. ఆ కలలన్నీ నాకు ఇచ్చారు కాబట్టి… ఇవాళ మీరు నన్ను దర్శకురాలిగా చూస్తున్నారు. అలాగని ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా నువ్వు దర్శకురాలివి కావాలి అని చెప్పలేదు. కానీ కలిసి సినిమా చూసేటప్పుడు, వాటి గురించి సాంకేతిక అంశాలెన్నో చెప్పేవారు. వాటి గురించి పుస్తకాలు, పత్రికలు చదివి చెప్పేవారు. నేను ఆయన కళ్లలోంచి సినిమాను చూసేదాన్ని. అప్పుడు కథ వెనుక మరో కథ కనిపించేది.

మాటలు వింటాను కానీ…

సినిమా రంగంలోకి ప్రవేశించిన అమ్మాయిగా ఇప్పటికీ రకరకాల మాటలు వింటూనే వస్తున్నాను. ఇవన్నీ కాస్త బాధపెట్టినా, సినిమాల మీద ఉన్న అభిరుచితో తట్టుకుని నిలదొక్కుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఆ చెప్పే సలహాల వెనుక ప్రేమ కూడా ఉంటుంది. కానీ వాళ్లకి అర్థంకాని విషయం ఏమిటంటే… నేను బయట ఎంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నా, దాంతో అది తృప్తి కలగదు. ఈ రంగంలో తిండీనిద్రా మానేసి 24 గంటలూ పనిచేసినా సంతోషంగా ఉంటుంది. ఇది కేవలం సినిమాలకే కాదు… సాధారణ జీవనశైలికి విరుద్ధంగా ఉండే ప్రతి రంగానికీ వర్తిస్తుంది.

గుస్సాడీ పరిచయం

మొదట్లో నాకు గుస్సాడీ గురించి తెలియదు. 2014లో మొదటిసారి ఆదిలాబాద్‌ వెళ్లినప్పుడు, అక్కడ వాళ్లు ఆ నృత్యం చేయడం చూశాను. అది ఏమిటి అని అర్థం కావడానికి కొన్నేళ్లు పట్టింది. అలాగే నా మీద వాళ్లకు నమ్మకం రావడానికి, బంధం బలపడటానికి చాలా సమయం పట్టింది. ఆ నృత్యాన్ని ఎలాగైనా లోకానికి తెలియచేయాలి అనే కోరిక మొదలైంది. డిస్కవరీ లాంటి చానల్స్ లో ఎక్కడెక్కడి సంగతులో కనిపిస్తాయి కాబట్టి మనవి మాత్రం ఉండవు. దాని గురించి బాధపడే కన్నా మనమే ముందడుగు వేస్తే మంచిది కదా అనిపించింది. అలాగని ఓ డాక్యుమెంటరీ తీస్తే సరిపోదు. వాటిని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపాలి. పైగా వాటి మీద డబ్బు పెద్దగ రాదు! కాబట్టి నేను బయట ప్రకటనలు చేసుకుంటూ, వాటి మీద వచ్చే ఆదాయం పొదుపు చేస్తూ దీన్ని కొనసాగించాను. చాలామంది సాంకేతిక నిపుణులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పని చేసేందుకు ముందుకు వచ్చారు. క్రౌడ్‌ ఫండింగ్‌ కూడా చేశాము. ప్రభుత్వం వైపు నుంచీ కొంత సహకారం లభించింది. మంచి పని చేస్తే ఎన్నో మార్గాల నుంచి సాయం లభిస్తుందని నేను ఈ స్వానుభవంతో తెలుసుకున్నాను.

ఇదీ గుస్సాడి చరిత్ర!

గుస్సాడీ ప్రస్తావన 2,500 ఏళ్ల నాటి సుత్తనిపాదలో కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్‌ లోని ఆదివాసులు… దీపావళి సమయంలో దండారీ అనే పండుగ చేసుకుంటారు. ఆ సందర్భంగా 9 రోజుల దీక్ష తీసుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్లను ఊరిపెద్దలే ఎంపిక చేస్తారు. అదే గుస్సాడి. ఒకసారి గుస్సాడీ అయితే కనీసం మూడేళ్లు కొనసాగించాలి. దాని కోసం ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. వారి వేషధారణ శివుని పోలి ఉటుంది. ఆ తొమ్మిది రోజులూ వాళ్ల శరీరం మీద బూడిద పూసి ఉంటుంది. ఒక ఊరి గుస్సాడీలు మరొకరి ఊరుకు వెళ్తారు. దాని వల్ల రకరకాల బంధాలు ఏర్పడతాయి. వారి చరిత్రను నృత్యం ద్వారా, పాటల ద్వారా పంచుకుంటారు. ఈ తొమ్మిది రోజులూ వారిని సాక్షాత్తు దేవునిగా భావిస్తారు. వారి కాళ్ల మీద పడి ఆశీస్సులు తీసుకుంటారు. వాళ్లు మన ఇంటికి వస్తే పావనం అయిపోతాం, ముట్టుకుంటే బాధలు తీరిపోతాయి, పెళ్లిళ్లు అవుతాయి, పిల్లలు పుడతారు… అనేంతగా నమ్ముతారు. ఆ గుస్సాడీలు ఎగురుతుంటే కలిగే స్పందన అద్భుతం. వాళ్లు నడుచుకుంటూ వెళ్తున్నా… ఆ గజ్జల చప్పుడు… ఎంతో దూరానికి వినిపిస్తుంది.

అదో కొత్త లోకం

వాళ్లతో ఉన్న సమయంలో నాకు అర్థం అయింది ఏమిటంటే… నగరాల్లో ఏ పని ఉన్నా లేకపోయినా చాలా బిజీగా ఉంటాం. కానీ అక్కడ జీవితానికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్లలో అత్యాశ అనేదే కనిపించదు. ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడం అక్కడ కనిపిస్తుంది. దాంతో సహనం కూడా చాలా పెరుగుతుంది. ఇండ్రియాలు స్తబ్దుగా మారిపోతాయి. మీరు సెల్‌ ఫోన్లకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటారు. నా జీవితంలో చూసిన అద్భుతమైన సూర్యాస్తమయాలు అక్కడివే! వాళ్ల దగ్గర నుంచి లభించే గౌరవం, ప్రేమలకు నేను చాలా రుణపడిపోయాను. అందుకే డాక్యుమెంటరీ కొసం ఇన్నాళ్లపాటు కష్టపడగలిగాము. దాని మీద ఓ డాక్యుమెంటరీతో పాటుగా కాఫీ టేబుల్‌ బుక్‌ కూడా రూపొందించగలిగాం. ఆ గుస్సాడీ పుస్తకం ద్వారా వచ్చే డబ్బులన్నీ ఆదివాసీల సంక్షేమ శాఖకు వెళ్తాయి.

ఎందుకు తెలుసుకోవాలి!

ఇలాంటి ఆచారాలు మన మూలాలు. మనం ఎంత సాధించినా ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే ఎలా! చాలా దేశాలు ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించి ఉండవచ్చు. దురదృష్టవశాత్తు… వాళ్లకు అంత గొప్ప సంస్కృతి లేదు. మన దగ్గర ఇంత గొప్ప సంస్కృతి ఉండటం ఎంత గర్వకారణమో కదా! కానీ అక్కడా చిన్నచిన్న మార్పులు వస్తున్నాయి. సెల్‌ పోన్ల దగ్గర నుంచీ వేషధారణ వరకు మారుతోంది. వాళ్ల మూలాలు చెరుగుతున్నాయి. మున్ముందు ఎవరన్నా… నా ఉనికి ఏమిటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లకు తెలియచేసేందుకు గుస్సాడీ డాక్యుమెంటరీ ఉండాలన్నది నా ఆశ!

కేన్స్‌ వరకూ వెళ్లిన షార్ట్‌ ఫిల్మ్‌

ఓసారి ‘గోవాలో ఓ డ్రైవర్‌ విదేశీ పర్యటకురాలిని కాపాడే ప్రయత్నం చేస్తూ చనిపోయాడు’ అని ఎక్కడో చిన్న వార్తగా వచ్చింది. ‘భారతదేశం సురక్షితం కాదు’ అనే శీర్షకలేమో మొదటి పేజీలో ఉండేవి. అతిథిదేవో భవ అని నమ్మే మన దేశంలో ఇలాంటి సందర్భాన్ని ఎలా మర్చిపోగలం. అందుకే దాని గురించే ఆలోచిస్తూ, చిన్నచిన్నగా ఓ కథను అల్లుకున్నాను. ఉదయాన్నే లేచి పేపరు చూడగానే… అన్నీ ప్రతికూలమైన వార్తలే కనిపిస్తే మనలో నిరాశ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇలాంటి మంచి విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ లఘుచిత్రం తీశాను.

టేకోవర్‌ అనే మరో డాక్యుమెంటరీ కోసం మణిరత్నం లాంటి ఎందరో ప్రతిభావంతులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్లందరిలో కనిపించిన ఓ ముఖ్యమైన అంశం, సినిమా పట్ల వారి అభినివేశం. కథలు చెప్పాలి, ఎవరన్నా సినిమా ద్వారా కథ చెబుతుంటే వారికి తమ నైపుణ్యం సాయపడాలి అన్న తపన వాళ్ల కళ్లలో, అనుభవాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

2017లో నా మొదటి తెలుగు సినిమా కోసం ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాను. ఆసియా నుంచి అక్కడికి వెళ్లిన తొలి మహిళా దర్శకురాలిని నేనేనేమో! అప్పటికే అక్కడ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ‘సినిమా తీస్తూ తీస్తూ పోయినా ఫర్వాలేదులే’ అనే మొండి ధైర్యంతో వెళ్లిపోయాను. ఆ సమయంలో శాంతిభద్రతల సమస్య రావడంతో కొంత షూట్‌ తర్వాత వెనక్కి రావాల్సి వచ్చింది. ఇవాళ మళ్లీ అవకాశం వచ్చినా, నేను మళ్లీ వెళ్తాను.

నా ప్రయాణంలో నేను తెలుసుకున్నాదా… మీ మనసు చెప్పేది వినండి. అది గట్టిగా కోరుకునే దిశలో ప్రయాణించండి!

ఆ ప్రతిభ అనంతం

ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో చదువంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఓ మాదిరిగా చదివేవాడు అంటే ఉపాధ్యాయులకు ఆసక్తి ఉండదు. అల్లరి చేయకుండా ఉంటే అమ్మాయికు ఆసక్తి ఉండదు. అలా ఒంటరిగా ఉంటున్న సమయంలో బాపట్ల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్‌ కు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లేవాడిని. అలా వెళ్తూవస్తూ ఉన్న సమయంలో… ఎప్పుడో నా మిత్రుడు అన్న మాటలు గుర్తుకువచ్చాయి. ‘నువ్వు బోర్‌ కొడతావు. అందుకే నీతో ఎవరూ మాట్లాడరు. మాట్లాడితే భక్తి లేదా దేశభక్తి పాటలు అంటావు కానీ పాటలు అంటే రొమాంటిక్‌ గా ఉండాలి పాటలు. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పాట ‘పూతవేసిన లేతమావిని’. నా తొలి ప్రణయ గీతం అది.

ఎప్పుడైనా ప్రకృతిని గుర్తుచేసుకున్నప్పుడు మన బాల్యంలో అంతర్లీనంగా చూసిన దృశ్యాలే గుర్తుకువస్తాయి. మీరు ఎన్ని దేశాలు తిరిగినా… సూర్యోదయం అనగానే మీ చిన్నప్పుడు పొద్దునే లేచినప్పుడు కనిపించిన సూర్యోదయమే గుర్తుకువస్తుంది. కాకపోతే  దాన్ని వర్ణించేందుకు అప్పుడు పదాలు లేకపోవచ్చు. కానీ పదాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశమే గుర్తుకుస్తుంది.

పాట.. అందరి బాట!

ఒక కథని దృశ్యకావ్యంగా మలచడం, ఆ సినిమాలో ఉన్న 24 విభాగాల బాధ్యత. ఒక పాత్రకు ఎలాంటి సంగీతం కావాలి అని దర్శకుడు తన కీబోర్డు ద్వారా వినిపిస్తారు. దానికి కావల్సిన లైటింగ్‌, నృత్యం, ఆహార్యం… ఇలా ప్రతి సాంకేతిక నిపుణుడూ ఆ సన్నివేశాన్ని సొంతం చేసుకుని, తనకు వచ్చిన భావంతో దాన్ని చూపిస్తాడు. అలాగే రచయిత కూడా తనకు వచ్చిన భాషతో దానికి కావల్సిన పాటలు ఇస్తాడు. హీరో ఎలా అయితే కన్నుతో నటిస్తాడో, రచయిత పెన్నుతో నటిస్తాడు.

ఎలా రాస్తానంటే!

ఇక కవిగా చూస్తే.. మనకు రెండు పార్శ్వాలు ఉంటాయి. మన మెదడులోనూ కుడివైపు సృజన, భావోద్వేగాలకు స్థానమనీ…. ఎడమ వైపు తర్కానికీ, విశ్లేషణకూ స్థానం అని చెబుతారు. మనం లింగ బేధం అనుకునేది కూడా కేవలం మన కండరాలతోనే సరి. ప్రతి మనిషిలోనూ స్త్రీ,పురుషులు ఇద్దరూ ఉంటారు. మన కుడివైపు మెదడు స్త్రీత్వంను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దాన్ని మేల్కొలిపితే కవిత్వం, ముఖ్యంగా అమ్మాయి మనసు ఉన్న కవిత్వం వస్తుంది. యోగభాషలో ఇడపింగళ నాడులు అంటారు. అసలు యోగం అంటే కలయిక కదా! మెదడులోని ఈ కుడి, ఎడమ పార్శ్వాలను అనుసంధానం చేసుకుంటూ ఓ సమన్వయం చేసుకోగలిగితే… సుషుమ్న నాడిని చేరుకోగలం. ఆ సమతను చేరుకున్నాడు కాబట్టే శివుని, అర్ధనారీశ్వరుడు అంటారు.

ఇంకేమింకేం కావాలే… వెనుక ఓ సరదా కథ

ఈ బాణీకి ఎలా రాయొచ్చా అని రెండు మూడు పదాలు అనుకుంటాం కదా! అలా రెండు మూడు పదాలు రాసిన తర్వాత అవి సరిపోవు, ఇంకా ఏమన్నా రాద్దామా అనుకుంటూ… ఇంకేమింకేం కావాలే అని వచ్చేసింది. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలాకాలంగా మన పాటలు ఒక పల్లవి, రెండు చరణాలు అనే నిర్మాణంలో ఉండేవి. ఈ మధ్య హుక్‌ లైన్ మోజులో పడి ఈ సంప్రదాయాన్ని మర్చిపోయారు. తెలుగు పాట ఈ ఫార్మాట్‌ వదలకూడదు అనే సందేశాన్ని కూడా ఈ పాట ఇస్తుంది. భవిష్యత్తులో వచ్చే స్వరకర్తలకు కూడా నా విన్నపం ఇదే.

ఇళయరాజాతో…

నా సంగీత ప్రయాణంలో ఎంతో గొప్ప సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్లలో ఇళయరాజా ఒకరు. ఆయనతో పనిచేయక ముందు చాలామంది, ఆయనకు కోపం ఎక్కువ అంటూ భయపెట్టారు. తీరా నేను అక్కడికి వెళ్లేసరికి… నన్ను ఓ కొడుకునో, మనవడినో చూసినంత గారంగా చూశారు. తప్పు ఉన్నా… ప్రేమగా సరిదిద్దారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నవాటిలో ముఖ్యమైంది- వేగం! ‘ఏ మాయ చేశావే’ సినిమాకు రెండు రోజుల్లో రోజుకు గంట కూర్చుని ఎనిమిది ట్యూన్లు ఇచ్చారు. మళ్లీ వారానికి రికార్డింగ్‌ అన్నారు. పాటకు ఒక్క రోజు కూడా సమయం లేదు. ఆ చిత్ర దర్శకుడు గౌతం మీనన్‌ కూడా ఏమీ చేయలేనని చెప్పేశారు. దాంతో రోజూ బీచ్‌ లో కూర్చుని ఎనిమిది రోజులూ ఎనిమిది పాటలు రాశాను. అవన్నీ కూడా ప్రజాదరణ పొందడం విశేషం.

జీవితాన్ని ఎలా చూడాలి!

నేను ఒకసారి సంక్లిష్టమైన సంస్కృత భాషలో ఓ పద్యం రాసి మిత్రులకు పంపాను. దాని అర్థం ఏమిటి అని అడిగితే… ‘దానికి అర్థం ఏమీ లేదు. నాకు గుర్తుకువచ్చిన సంస్కృత పదాలన్నీ ఒక చోటకు చేర్చి పంపాను. జీవితం కూడా ఇంతే! ఉన్న జీవితాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత ఆస్వాదించాలి’ అని చెప్పాను. జీవితాన్ని ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా బాధే మిగులుతుంది. ఎందుకంటే చదవడానికి జీవితం ఓ గ్రంథం కాదు… అది ఓ అనుభవం. కాకపోతే అది లయబద్ధంగా ఉండాలి. దేవుడి సృష్టి ఎలాగైతే చీకటి నుంచి వెలుగు వరకూ లయబద్ధంగా నడుస్తుందో, అలాగే మన జీవనవిధానంలో కూడా ఓ లయ ఉండాలి.

సినిమానే ఆశ, శ్వాస!

నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఓ సంభాషణ గుర్తుకువస్తుంది. ‘నాకు చదువంటే ఇష్టం లేదు, సినిమాల్లోకి వెళ్తాను’ అంటే నువ్వు ఎలా వెళ్తావు అని అడిగారు. దానికి నేను ‘నాకు రెహ్మాన్‌, కీరవాణి… ఇలా అందరి ఇళ్లకు వెళ్లి కాళ్లు నొక్కే పని ఇమ్మని అడుగుతాను. ఆ సమయంలో ఓ పదమో, పాటో ఏదో ఒకటి పాడితే… చిన్నపాటి అవకాశం ఇస్తారేమో. దానికి పెద్ద దారి ఏముంది’ అని జవాబిచ్చాను. నాకు అంత భక్తిభావం ఉంది కాబట్టి… వాళ్లను గౌరవించడానికి నేను ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన పనిలేదు. ఆ భావం మన నడవడిలో తెలుస్తుంది కాబట్టి, వాళ్లకూ మనం అంటే అభిమానం ఏర్పడుతుంది.

కొన్ని మాటలు…

– మనిషి ఎంత గొప్పవాడైతే, ఆయనతో పని చేయడం అంత సులభం అని రెహ్మాన్‌ గారి దగ్గర నేర్చుకున్నాను.

– అనువాద చిత్రాలకు పనిచేసినా, సొంతగా పాటలు రాసే ప్రయత్నం చేస్తాను. ఏం మాయ చేశావే విషయంలో తమిళంతో పని లేకుండా నా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

– నేను వచ్చినప్పుడు కేసెట్లో ట్యూన్స్‌ ఇచ్చేవారు, తర్వాత మెయిల్స్, తర్వాత వాట్సాప్… ఇలా అన్నిరకాల అనుభవాలూ చూడగలగడం అదృష్టంగానే భావిస్తున్నాను.