
మనదేశంలో రైతులు పడుతున్న కష్టాల గురించి, ఎదుర్కొంటున్న నష్టాల గురించి ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తోంది. కానీ ‘సామాన్యులుగా మనం చేయగలం’ అనే భావనతోనే చాలామంది ఉన్నారు. కానీ ఒడిశాకు చెందిన రమేశ్ మాత్రం ఊరికే కూర్చోలేదు. విదేశాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి, ఇక్కడి రైతుల కోసం పాటుపడుతూ వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాడు. విల్లా మార్ట్ పేరుతో రైతులు పండించిన పంటను ఎప్పటికప్పుడు తీసుకెళ్లి మొబైల్ బండిపై రాష్ట్రంలోని ఎన్నో గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. దానిద్వారా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ, పండిన పంటను వృథా కాకుండా చేస్తున్నాడు ఐఐటీయన్ రమేశ్.
2016లో రమేశ్ అమెరికాలో మెటీరియల్ సైన్స్ లో పోస్ట్ డాక్టోరియల్ స్టడీస్ చేస్తున్న సమయంలో భారతీయ రైతుల ఆత్మహత్యల వార్తలు కనిపించాయి. ఇంట్లో వాళ్లతో మాట్లాడినప్పుడు ఈ సమస్య గురించి మరింత లోతుగా తెలుసుకున్నాడు. అమెరికాలోనూ రైతులున్నారు కానీ వాళ్లు ఇన్ని చిక్కుల్లో లేరని తెలుసుకున్నాడు. దానికి కారణం మన రైతులు టెక్నాలజీని ఉపయోగించుకోకపోవడమే అనుకున్నాడు. ఇంత చదువుకుని ఏం ఉపయోగం? వాళ్లకేదైనా చేస్తేనే తనకు సంతోషం! అనిపించింది. దాంతో 2016లోనే భారతదేశానికి తిరిగి వచ్చేశాడు.
‘‘మా నాన్న కూడా రైతే. ఎన్నోకష్టాలు పడి మమ్మల్ని ఇంతస్థాయికి తీసుకొచ్చాడు. అలా రైతుల కష్టం నాకు తెలిసొచ్చింది. ఎంతోమంది రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక, బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే నా డిగ్రీలను, తెలివితేటలను నా దేశానికి ఉపయోగించాలని వచ్చేశాను. మా గ్రామంలో నాలాగే ఆలోచించే వ్యక్తులను కలిసి ఒక బృందంగా ఏర్పాటు చేశాను. రైతుల కోసం కచ్చితంగా ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాం. అయితే అది కొత్తగా, ఖర్చు తక్కువగా ఉండాలి అనుకున్నాం. అప్పడే రైతులు ఎక్కడికో వెళ్లి తమ పంటను అమ్ముకోకుండా.. మంచి గిట్టుబాటు ధరతో ఒకేదగ్గర అది కూడా తమ పొలంలో విక్రయిస్తే బాగుంటుందని అనుకున్నాం. అలా 2017లో మొదలైందే.. ‘విల్లా మార్ట్’. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు అన్నీ కొని, వాటిని గ్రామాలకు తిరుగుతూ మేము విక్రయిస్తున్నామ’’ని ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన రమేశ్ చెప్తున్నాడు.
అమెరికా మోడల్ అయిన వాల్ మార్ట్ విజయాన్ని ప్రేరణగా తీసుకుని రమేశ్ ఈ విల్లామార్ట్ ని ప్రారంభించాడు. అయితే ఆఫ్ లైన్ స్టోర్ గా పెడితే.. ప్రజలంతా అక్కడికి వచ్చే కొనాల్సి ఉంటుంది. అందుకే మొబైల్ మండిని ప్రవేశపెట్టాడు. ఒక బండిని ప్రత్యేకంగా తయారు చేయించి, ఊరూరా తిప్పుతూ కూరగాయలు, ధాన్యాలు, పండ్లను అమ్ముతోంది విల్లా మార్ట్ టీమ్. ఆయా వస్తువులను వివిధ గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు స్థిరంగా కొంటున్నారు.
మొదట 2017లో ఒకే ఒక్క వ్యాన్ తో మొదలై ఇఫ్పుడు ఏడు వ్యాన్లతో బిజినెస్ నడుస్తోంది. ప్రస్తుతం విల్లా మార్ట్ తో ఒడిశా వ్యాప్తంగా 3వేల మంది రైతులు కలిసి పని చేస్తున్నారు. అలాగే రైతుల పంటను 110 గ్రామాల్లోని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రమేశ్ AI టెక్నాలజీని ఉపయోగించి, రైతుల పంటను గ్రేడ్ల వారీగా వేరు చేసి, అవసరమైన వాటిని నిల్వ చేస్తున్నాడు. త్వరలోనే పెద్ద ఎత్తున మండి (మార్కెట్)ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రమేశ్ అంటున్నారు. గతేడాది నాలుగు కోట్ల టర్నోవర్ తో విల్లా మార్ట్ విజయవంతంగా నడిచింది. రైతుల బాగుకోసం, వాళ్ల జీవితాలను కాపాడాలన్న ఉద్దేశంతో కొత్త ఆవిష్కరణలను మొదలుపెట్టిన రమేశ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
#villamart #walmart #farmers #organicfarming #touchalife #talradio #talblogs