
లాక్ డౌన్, ఐసొలేషన్, క్వారంటైన్… ఇలాంటి మాటలు వింటే ఎంతో కష్టంగా ఉంటుంది. అనవసరంగా బయట తిరగొద్దు, అత్యవసరం అయితే తప్ప గుంపుని పొగుచేయవద్దు… లాంటి సూచనలు వింటే ఎవరి మీదో తెలియని కోపం వస్తుంది. ఎందుకంటే చాలామంది దృష్టిలో ఇంట్లోనే ఉండాల్సి రావడం అసంభవం. కుటుంబంతో కలిసి ఉన్నా, టీవీ మొబైల్ అందుబాటులో ఉన్నా భరించలేని వెలితి. ఎక్కడికో ఎగిరిపోవాలనే ఉక్కపోత. నిజంగా మనిషి నాలుగు గోడల మధ్య ఉండలేడా? ఇదే అనుమానం వచ్చింది కొంతమంది ఫ్రాన్స్ పరిశోధకులకి.
ఫ్రాన్స్ లోని ‘హ్యూమన్ అడాప్షన్ ఇన్ స్టిట్యూట్’ ఓ చిత్రమైన ప్రయోగం చేసింది. ప్రపంచానికి దూరంగా, సమయానికి అతీతంగా ఉంటే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలనుకుంది. అందుకోసం ఓ 15 మందిని వెలుతురే రాని ఓ గుహలోకి పంపింది. అక్కడ టీవీలు, ఫోన్లతో సహా ఎలాంటి సాంకేతిక పరికరాలూ లేవు. వెలుతురు రావాలంటే మన పెద్దలు వాడినట్టు… ఓ సైకిల్ కి తగిలించిన డైనమోని తిప్పాల్సిందే, నీళ్లు కావాలంటే 150 అడుగుల లోతు ఉన్న బావి నుంచి తోడుకోవాల్సిందే! ఈ ప్రాజెక్టుకి డీప్ టైమ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు.

ఊహించనట్టుగానే కొన్నాళ్లకి ఆ గుహలో ఉన్నవారికి సమయం గురించి సోయ పోయింది. వాళ్ల శరీరాలే గడియారాలుగా మారిపోయాయి. అది సూచించిన సమయానికి తగినంత నిద్రపోవడం, అది గంట కొట్టినప్పుడు ఆహారం తీసుకోవడం. ఇంతకుమించి మరి ఎలాంటి విచిత్రమూ జరగలేదు. గడువు పూర్తయిన తర్వాత వాళ్లందరినీ బయట ప్రపంచానికి తీసుకువచ్చారు. ఆశ్చర్యంగా… వాళ్లు నవ్వుతూ సంతోషంగా బయటకి వచ్చారు. కాకపోతే సూర్యకాంతిని భరించడానికి కాసేపు నల్లకళ్లద్దాలు కావల్సి వచ్చాయి అంతే! వాళ్లలో చాలామంది ‘అప్పుడే 40 రోజులూ పూర్తి అయిపోయాయా’ అని ఆశ్చర్యపోయారు. పదిమందికి పైగా ఆ గుహలో ఇంకొన్నాళ్లు ఉండాలని ఉందని చెప్పారు.
మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ లోనే ఉన్నారు. అదృష్టవశాత్తు మన కుటుంబసభ్యలు మనతోనే ఉన్నారు, మనకి ఇష్టమైన సినిమాలు, నచ్చిన గాడ్జట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మరీ బోర్ కొడితే నాలుగడుగులు వేసే అవకాశమూ ఉంది. పైగా మన ప్రాజెక్టుకి ఓ లక్ష్యం కూడా ఉంది… అది మనల్నీ, చుట్టుపక్కల వారినీ ఓ మహమ్మారి నుంచి రక్షించుకోవడమే! ఇంత గొప్ప సాహసాన్ని ఎలా దూరం చేసుకోగలం.

#covid2019 #isolation #socialdistancing #talradio #touchalife #talstories #talfb