
నేటి బాలలే రేపటి పౌరులు. ఈ సంగతి అందరికీ తెలిసినా, అందరూ వింటూనే ఉన్నా… చాలాచోట్లా పిల్లలు చదువుకోలేకపోవడమో, చదువుతూ మధ్యలో మానేయడమో జరుగుతూ ఉంటుంది. ఇందుకు ముఖ్య కారణం కుటుంబ ఆర్థిక ఇబ్బందులే! అలాంటి పిల్లలు బడికి వెళ్లాలంటే, ఆర్థికంగా తోడ్పాటు ఉండాలి. ఆ పని చేస్తోంది గుజరాత్ కు చెందిన ‘మానవ్ సాధన’ అనే స్వచ్ఛంద సంస్థ. ‘ఎర్న్ ఎన్ లర్న్’ పేరుతో స్కూల్ అయిపోయాక మూడు, నాలుగు గంటలు ఆ పిల్లలకు రకరకాల పనులు నేర్పిస్తోందీ సంస్థ.
కొంతమంది పిల్లలు ప్రభుత్వ బడులకు వెళ్లినా, కొన్నిరోజులకే ఆసక్తి చూపించక మానేస్తుంటారు. తల్లిదండ్రులు తిట్టినా, కొట్టినా చదువుకోమని, బడికి వెళ్లమని మారాం చేస్తారు. కానీ ఎప్పుడైతే మానవ్ సాధన సంస్థ, ఎర్న్ ఎన్ లర్న్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందో… పిల్లలు ఒక్కరోజు కూడా బడికి డుమ్మా కొట్టకుండా వెళ్తున్నారట. కారణం, బడి ఆఖరి గంట కొట్టగానే, ఆసక్తికరమైన పనులు నేర్పిస్తూ వాళ్లలో కొత్తకొత్త నైపుణ్యాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మొదటి దశలో పిల్లలకు న్యూస్ కాగితాలతో బ్యాగ్స్ తయారీ నేర్పిస్తారు. వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను ఆయా విద్యార్థుల కోసమే ఖర్చు చేస్తారు.
‘‘ఈ ఎర్న్ ఎన్ లర్న్ ప్రోగ్రామ్ లో మేము స్కూల్ అయిపోయాక కొన్ని గంటలు, పిల్లలకు కొన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుంటాం. అంటే సాయంత్రం ఆరు గంటల వరకు తరచూ క్లాసులు తీసుకుంటాం. అందులో డ్యాన్స్, తబలా, క్రీడలు, పేపర్ బ్యాగ్ తయారీతో పాటు మరికొన్ని క్రాప్టింగ్ పనులు నేర్పిస్తాం. వాటికోసం ఉపయోగించే మెటీరియల్స్ మేమే సమకూర్చుతాం. పేపర్ బ్యాగ్స్ కు ఆర్డర్లు వస్తుంటాయి. ఆ వచ్చిన డబ్బుతో అవసరంలో ఉన్న పిల్లలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు… పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందిస్తాం’’ అని చెబుతున్నారు మానవ్ సాధనలో కీలక పాత్ర పోషించే నీతాబెన్.
ఈ సంస్థ తాము ఎంచుకున్న స్కూళ్ల విద్యార్థులను ఏడాదికి రెండు, మూడుసార్లు విహార యాత్రలకు తీసుకెళ్తుంది. ఆ పిల్లలంతా ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వయసు మధ్య వారే ఉంటారు. వీళ్లంతా పేపర్ బ్యాగ్స్, గ్రీటింగ్ కార్డ్ తయారీ నుంచి మట్టి ప్రమిదల తయారీ వరకు అన్నింట్లోనే ఉత్సాహంగా పాల్గొంటారని నీతాబెన్ చెప్తున్నారు. ఈ పిల్లలకు రెగ్యులర్ గా పోషకాహారం అందిస్తూ, పరిశుభ్రత గురించి అవగాహన కూడా కల్పిస్తారు. ఈ మానవ్ సాధన సంస్థ గత 30 ఏళ్లుగా గాంధీ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నేటి బాలలను రేపటికి బాధ్యత, సమర్థత గల పౌరులుగా తయారు చేసేందుకు ఈ కృషి చేస్తోంది.