
నేడే ప్రపంచ ధరిత్రి దినోత్సవం. వరల్డ్ ఎర్త్ డే. మొదటిసారి ఈ ధరిత్రి దినోత్సవం 1970లో జరిగింది. భూమిని కాపాడుకోవాలన్నఉద్దేశ్యం ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచమంతా జరుపుకుంటోంది. అయితే ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ ఉంటుంది. ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం థీమ్ – ‘ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్’. భూమి గురించి, కాలుష్యం వల్ల ప్రకృతి ఎంత నాశనమవుతుందని మాట్లాడుకోవడం కాకుండా… దాన్ని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలన్న దానిగురించి మాట్లాడుకోవాలనే సూచన ఇది!
ముఖ్యంగా పిల్లలు, యువత ఈ కార్యక్రమంలో భాగమయినప్పుడే పూర్తిస్థాయిలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా స్కూళ్లు, కాలేజీల్లో రీసైక్లింగ్, రీయూజ్, రెడ్యూస్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున పిల్లలను ఇందులో ఎలా భాగస్వాములు చేయవచ్చో తెలుసుకుందాం.
గుర్తుండిపోయేలా
విద్యార్థులతో ఈరోజున కొన్ని ప్రతిజ్ఞలు చేయించాలి. ఉదాహరణకు తాము బట్టలు వీలైనంత ఎక్కువ రీయూజ్ చేస్తామని, అనవసరంగా భూమికి హాని చేసే వస్తువుల వాడకాన్ని తగ్గిస్తామని ఒక పేపర్ పై రాయించాలి. అంతేకాదు, ఆ పేపర్లను క్లాస్ రూమ్స్ లేదా ఇంట్లో గోడలకు అతికించేలా చూడాలి. అప్పుడు వాళ్లు వాటిని తరచూ చూడటం వల్ల ఆచరణలో పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు.
ఆసక్తి కలిగేలా
పిల్లల్లో ఆసక్తిని పెంచినప్పుడే వాళ్లు ఎంతటి గొప్ప కార్యక్రమాలనైనా సులువుగా, ఇష్టంగా చేస్తారు. అందువల్ల ఎర్త్ డే సందర్భంగా కూడా వాళ్లతో టీచర్లు లేదా తల్లిదండ్రులు పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయించాలి. ఇప్పుడు సెలవులు మొదలైనా కూడా, హాలీడే ప్రాజెక్ట్స్ లాగా వాళ్లతో చేయించొచ్చు. ముఖ్యంగా కాలుష్యాలు, ప్లాస్టిక్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కు సంబంధించి చిన్నచిన్న యాక్టివిటీస్ విద్యార్థులతో తప్పకుండా చేయించవచ్చు.
సైన్ బోర్డ్స్..
మంచి అలవాట్లు నేర్పించాలంటే కేవలం చెబితే సరిపోదు. విద్యార్థులకు ఆయా అలవాట్ల వల్ల కలిగే లాభాలేంటో, ఎలా అలవాటు చేసుకోవాలో తెలియజేయాలి. అందుకోసం సైన్ బోర్డ్స్ బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు స్కూల్, ఇళ్లలో స్విచ్ బోర్డ్స్ దగ్గర పిల్లలతో ఒక చార్ట్ మీద ‘అనవసరంగా లైట్లు, ఫ్యాన్స్ ఆన్ లో ఉంచొద్దు’, ‘రూమ్ లోంచి బయటికి వెళ్లేటప్పుడు మర్చిపోకుండా లైట్లు, ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి’ అని రాయించి అతికించాలి.
మొక్కలు నాటించాలి..
ఈ ఎర్త్ డే సందర్భంగా పిల్లలతో మొక్కలు నాటించాలి. అలాగే వాటిని పర్యవేక్షించే బాధ్యతను పిల్లలకే అప్పగించాలి. రోజూ నీళ్లు పోయమని చెప్పాలి. అంతేకాదు, పిల్లలతో చెట్ల ప్రాముఖ్యం గురించి, పర్యావరణానికి చెట్లకున్న సంబంధం గురించి వివరంగా తెలియజేయాలి.
అవగాహన
పర్యావరణం కలుషితం అవ్వడానికి కారణమవుతున్న వాటిగురించి విద్యార్థులకు చెప్పాలి. గాలి, నీరు, శబ్దం మొదలైనవి ఎలా కలుషితం అవుతున్నాయో వివరించాలి. అలా కాకుండా భూమిని రక్షించడం కోసం తమ వంతు బాధ్యతగా ఏం చేయాలో తెలపాలి. వీటికి సంబంధించి పిల్లలకు చిన్నచిన్న ప్రాజెక్ట్స్ లాంటివి ఇవ్వవచ్చు.
వేస్ట్ కలెక్షన్ డ్రైవ్..
విద్యార్థుల్లో వేస్ట్ కు సంబంధించి కలెక్షన్ డ్రైవ్ అనేది స్కూళ్లలో నిర్వహించాలి. వేస్ట్ పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు మొదలైనవి ఇంట్లోంచి తీసుకురావాలని పిల్లలకు చెప్పాలి. అలా తెచ్చినవాళ్లకు రిటర్న్ గిఫ్ట్స్ గా స్టేషనరీ లాంటివి ఇవ్వొచ్చు. అలాగే ఆ వేస్ట్ తో రీసైక్లింగ్ చేయొచ్చని, చేసే పద్ధతులను వివరంగా విద్యార్థులకు తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో కచ్చితంగా మంచి అవగాహన లభిస్తుంది.
ఈ సూచనలు కేవలం ఎర్త్ డే కు మాత్రమే పరిమితం కాదు. నిరంతరం విద్యార్థులకు, ఇంట్లో పిల్లలను ఇలాంటి కార్యక్రమాల్లో కుదిరినంతవరకూ భాగస్వాములుగా చేసిన రోజున పుడమి భవితకు ఢోకా ఉండదు!