
పుస్తకాలు, విద్యార్థులకు పాఠాలతో పాటు సామాజిక బాధ్యతను నేర్పుతాయి. జీవితంలో చేరుకోవాలనుకునే గమ్యాలకు మార్గాన్ని చూపిస్తాయి. అయితే అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే, అందుకు సమాధానం లేదనే చెప్పాలి. మారుమూల పల్లెల్లో… కొండకోనల్లో పిల్లలకు చదువుకోవాలని ఉన్నా, అందుకు తగ్గ సౌకర్యాలు ఉండవు. అలాంటివాళ్ల గురించి మంచి మనసుతో ఆలోచించారు ఉత్తరాఖాండ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హిమాన్షు. తాను చదువుకోవడానికి పడ్డ కష్టం ఇతర విద్యార్థులు పడకూడదని వివిధ గ్రామాల్లో 16 లైబ్రరీలను ఏర్పాటు చేశారాయన.
ఉత్తరాఖాండ్ లోని తుశ్రార్ గ్రామానికి చెందిన హిమాన్షు ఎంతో కష్టపడి చదువుకున్నారు. పర్వతాల మధ్య నివసించే ఆయన కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేది. అలా అన్నివిషయాల్లో సర్దుకుపోతూ, రోజూ నాలుగు కిలోమీటర్లు కొండలెక్కి దిగుతూ స్కూలుకు వెళ్లేవారు హిమాన్షు. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, తను కలలు కన్న ఐఏఎస్ సాధించారు. అయినా, తాను నడిచిన దారులను, గ్రామ పరిస్థితులను మర్చిపోలేదు. ప్రస్తుతం హిమాన్షు కర్ణప్రయాగ్ ప్రాంతంలో సబ్ డివిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.
‘‘పుస్తకాల విలువ నాకు బాగా తెలుసు. అందుకే 2020 నవంబర్ లో తానక్ పూర్ లో మొదటి లైబ్రరీని ఏర్పాటు చేశాను. తర్వాత బంబాసా, గ్యాన్ ఖేడా, ఉచోలీగోత్, సుఖిధాంగ్, తాలియాభాంజ్, ఫాగ్ పూర్… మొదలైన ప్రాంతాల్లో మొత్తం 16 లైబ్రరీలు ఏర్పాటు చేయడం నాకు సంతోషంగా ఉంది. నాలాగా, ఈ తరం పిల్లలు కష్టపడకూడదని, ఆయా లైబ్రరీల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పెట్టాను. దానివల్ల వాళ్లు ఆ పుస్తకాల కోసం నగరాలకు పరిగెత్తాల్సిన పని ఉండదు. తరచూ నేనూ ఆ లైబ్రరీలకు వెళ్లి విద్యార్థులతో సంభాషణ చేస్తుండటం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంద’’ని హిమాన్షు చెబుతున్నారు.
కేవలం లైబ్రరీలు ఏర్పాటు చేయడం, అందులో పుస్తకాలు సమకూర్చమే కాదు.. హిమాన్షు విద్యార్థుల కోసం రకరకాల సెమినార్లు కూడా ఇస్తుంటారు. అందులో ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన తన భార్య కూడా పాల్గొంటారు. ఇద్దరికీ ఆదర్శ భావాలు ఉండటంతో వివిధ కార్యక్రమాలకు నాంది పలకగలుగుతున్నారు. విద్యార్థుల కోసం శిక్షణ, నిపుణులతో లెక్చర్లు, పుస్తకాల పంపకం, చదువు ప్రాముఖ్యతను తెలిపే ప్రచార కార్యక్రమాలు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ లైబ్రరీల ఏర్పాటును తాను ఆపబోయేది లేదని, ఉత్తరాఖాండ్ లోని అన్ని గ్రామాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమన్న నమ్మకం హిమాన్షు లాంటి వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది.