
పిల్లలను స్కూల్లో చేర్పించేకంటే ముందే ప్లే స్కూళ్లకు, అంగన్ వాడీలకు పంపించడం చూస్తుంటాం. ఈ పిల్లలకు ఏం నేర్పిస్తే బాగుంటుంది… వాళ్లకు ఏది అవసరమో గమనించి ఒక మంచి ప్రణాళికతో ముందుకొచ్చింది దిల్లీకి చెందిన రాకెట్ లర్నింగ్ అనే ఎడ్ టెక్ సంస్థ. అంగన్ వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులకు మంచి కంటెంట్ తో తయారు చేసిన వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించడంవల్ల అది ఎంతోమందిపై ప్రభావం చూపిస్తున్నట్లు రాకెట్ లర్నింగ్ టీమ్ చెప్తోంది.
నిస్వార్థంగా పనిచేస్తున్న ఈ రాకెట్ లెర్నింగ్ రెండు నిమిషాల నిడివి గల వీడియోలను తయారు చేస్తోంది. దాని సైజు కూడా 5ఎంబీ లోపలే ఉండేలా చూస్తుంది. దానివల్ల టీచర్లు, తల్లిదండ్రులు సులువుగా వాట్సాప్ ద్వారా వీడియోను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. ఈ సంస్థ దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పని చేస్తోంది. ఆ రాష్ట్రాల్లోని అంగవాడీలను కలిసి టీచర్లు, అక్కడి పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లను సేకరించడంతో వీళ్ల పని మొదలైంది. పిల్లలకు డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్, ఆటపాటలతో కొత్త విషయాలు చెప్పడం అవసరమని గ్రహించిన రాకెట్ లర్నింగ్ ఆ దిశగానే వీడియోలను తయారు చేస్తోంది.
మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ మొదట ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ అనే ఆలోచనతో ముందుకొచ్చింది. ఇదంతా కూడా కరోనా మొదటి లాక్ డౌన్ లో మొదలైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు అనుసంధానంగా పని చేస్తూ వస్తోందిది. అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లలకు కేవలం పౌష్టికాహారం ఇస్తూ ఓనమాలు నేర్పిస్తే సరిపోదని, పిల్లల మేధో వికాసం కోసం కొన్నిరకాల విద్యావిధానాలు అవసరమని ప్రభుత్వాలకు చెప్పడంతో, వాళ్లూ సరేనన్నారు. అలా పిల్లలకు రంగులు గుర్తించడం, పండ్లు, కూరగాయాల గురించి చెప్పడం వంటి రకరకాల అంశాలపై టీచర్లకు అవగాహన కల్పించడం… అందుకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతోంది. వీళ్ల సేవలు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, దిల్లి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.
‘‘మేం ఈ సంస్థను పిల్లల భవిష్యత్తు మంచి పునాదితో మొదలవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించాం. లాక్డౌన్ లో పేదపిల్లలకే ఎక్కువ నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలకు పనిలేక తినడానికే కష్టమైంది. అలాంటివాళ్ల పిల్లల పరిస్థితి ఏమిటని ఆలోచించి ఈ కార్యక్రమం ప్రారంభించాం. పిల్లలందరికీ ఆరోగ్యంగా ఎదుగుతూ చదువుకునే హక్కు ఉంటుంది. అలావాళ్ల కోసం నిపుణులతో వీడియోలు తయారు చేయించడం, పీడీఎఫ్ పుస్తకాలను స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసి పేదలకు అందేలా చూశాం. ఇప్పుడు అంగన్ వాడీ టీచర్ల దగ్గర ఎలాగూ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి, వాళ్ల ద్వారా చిన్నపిల్లలకు వయసుకు తగ్గట్లు నేర్పించాల్సిన విషయాలను తెలియజేస్తున్నామ’’ని చెప్తున్నాడు సంస్థ కో-ఫౌండర్ విశాల్ సునిల్. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ, రేపటి పౌరుల మంచి భవిష్యత్తుకు బాటవేస్తోంది ఈ రాకెట్ లర్నింగ్ సంస్థ.