
లాక్ డౌన్ తర్వాత చాలామంది జీవనశైలి, అలవాట్లు, వ్యాపకాల్లో మార్పులు వచ్చేశాయి. కొంతమంది తమలోని ప్రతిభకు పదునుపెట్టి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారారు. వీరిలో ఒకొక్కరు ఒకో అంశం, రంగాన్ని ఎంచుకోవడం చూస్తున్నాం. అలా ఇంటీరియర్ డెకర్ ముఖ్యంగా గ్రీన్ డెకర్ సబ్జెక్టుతో ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ అయ్యారు హైదరాబాదుకు చెందిన ఇంజినీర్ షగున్ సూద్.
ఇంటిని అలంకరించడాన్ని కొందరు అవసరంలా భావిస్తే, షగున్ లాంటి వాళ్లు ప్యాషన్ తో చేస్తారు. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే… దేవుడిని పూజించినట్టే అని భావిస్తారు షగున్ సూద్. అయితే రోజువారీ బిజీ షెడ్యూల్ వల్ల ఇంటిని తరచూ అలంకరించడానికి సమయం సరిపోయేది కాదనీ, కానీ లాక్ డౌన్ ఈ విషయంలో తనకెంతో మేలు చేసిందని చెబుతారు. దీంతోపాటు ఇంట్లో, బాల్కనీలో చిన్నచిన్న కుండీలు పెట్టడం, నచ్చిన పూల మొక్కలు, ఇంట్లోకి ఆకుకూరలు సాగు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. దీన్నంతటినీ ఎప్పటికప్పుడు వీడియో షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవారు. దాంతో ఇంటీరియర్ డెకర్, గ్రీనరీ, గార్డెనింగ్ ఆసక్తి ఉన్నవాళ్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలైంది. ఇలా రోజురోజుకీ మొక్కల పెంపకం, గ్రీన్ డెకర్ పై ఆమెకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పైగా ఫాలోవర్స్ పెరిగే కొద్దీ సలహాలు, సూచనలు కూడా చెప్తూ వీడియోలు తీయడం ప్రారంభించారు. అలా ఇప్పుడు ఆమె ‘మైహ్యాపీప్లేస్24’ ఇన్ స్టాగ్రామ్ అకౌంటుకు దాదాపు 53వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
‘‘లాక్ డౌన్ ముందు వరకు నాకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అందంగా సర్దుకోవడం మాత్రమే తెలుసు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండటంతో మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. తెలియకుండానే ఇంటిని ఆకుపచ్చగా మార్చడంపై నా మనసు మళ్లింది. దాంతో ఇండోర్ ప్లాంట్స్. గార్డెనింగ్ కు సంబంధించిన వీడియోలు చూడటం మొదలుపెట్టాను. బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు, డెకరేటివ్ ఐటమ్స్ కొనడం, ఇంట్లో సర్దడం చేశాను. ఆ సమయంలోనే నేను చేస్తున్న పనిని, పద్ధతులను వీడియోలా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే బాగుంటుందని అనుకున్నాను. అలా ఇన్ స్టాగ్రామ్ లో మైహ్యాపీప్లేస్ అనే అకౌంట్ తెరిచి, నాకు నచ్చిన వీడియోలను అప్ లోడ్ చేశాను. వాటిని చాలామంది ఇష్టపడేవారు. దాంతో నాకు తెలియకుండానే నేను ఇన్ ఫ్లుయెన్సర్ గా మారిపోయాన’’ని షగున్ అంటున్నారు.
ఈ విషయంలో ఆమెను తన భర్త, అమ్మ ఎక్కువగా ప్రోత్సహించేవారట. అంతేకాదు వాళ్లు కూడా రకరకాల ఐడియాలను సూచిస్తూ తోడ్పడేవారట. తనను చూసే చాలామంది ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించామని సందేశాలు పంపేవారని షాగున్ చెబుతున్నారు. అప్పుడు తనకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటారు. ఈ క్రమంలోనే తాను ఇంట్లో ఎక్కువగా పర్యావరణహిత వస్తువులు వాడటం ప్రారంభించానని చెబుతున్నారు. స్టీల్ బాటిల్స్, చెక్క దువ్వెనల నుంచి ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పూర్తి బట్టలతో చేసిన సంచులే వాడుతున్నారు.
‘‘ఒక్కసారి ప్రకృతి, పచ్చదనానికి అలవాటు పడితే, మనసు హాయిగా జీవితం సంతోషంగా ఉంటుంద’’న్నది షగున్ మాట. మంచి విషయాలు, మంచి మార్గాలు చెప్పే వారిని ఫాలో అవ్వడం చాలా మంచి విషయమే. ఇంజినీర్ నుంచి గ్రీన్ డెకర్ ఇన్ ఫ్లయెన్సర్ గా మారిన షగున్ కథ ఆసక్తిగా ఉంది కదూ!
#greendecor #touchalife #talradio #ShagunSood #interier #indoorplants #indoorplantsdecor