
మన దేశంలోని యువత రోజురోజుకీ ఉన్నతస్థాయికి చేరుతోంది. చిన్న వయసులో గొప్ప ఆవిష్కరణలు చేస్తూ అందరి అభినందనలు చూరగొంటోంది. అంతేకాదు! పర్యావరణ కాలుష్యం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై యువతలో అవగాహన బాగా పెరుగుతోంది. దాంతో వాళ్లు తీసుకొస్తున్న ఆవిష్కరణలు వినూత్నంగా, ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా గుజరాత్ కు చెందిన 18 ఏళ్ల నీల్ షా గురించి చెప్పుకోవచ్చు. సైన్స్ పై ఉన్న ఆసక్తి, జనాలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలన్న ఉత్సుకతతో నీల్, ఒక పాత సైకిల్ ను సోలార్ బైక్ గా మార్చి శెభాష్ అనిపించుకున్నాడు.
వడోదరలోని జెనిత్ హై స్కూల్ లో చదువుతున్న సైన్స్ స్టూడెంట్ నీల్ షాకు సోలార్ ఎనర్జీపై ఆసక్తి ఎక్కువ. దాని గురించి సైన్స్ టీచర్ ని రకరకాల ప్రశ్నలు అడిగేవాడు. కొత్తకొత్త విషయాలు తెలుసుకుని ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపించేవాడు. అలా సోలార్ పవర్, డైనమో ఆల్టర్నేటర్ తో ఒక బైక్ తయారు చేశాడు. దాన్ని ఓ స్కూల్ ప్రాజెక్ట్ గా మొదలుపెట్టినా, మరింత ఆసక్తితో దాన్ని ఇంకా వృద్ధి చేసి ప్రస్తుతం తానే దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక్కసారి ఫుల్ చార్జి తో 25-30కిలో మీటర్ల మైలేజ్ వస్తుందంటున్నాడు నీల్.
‘‘బాల్యం నుంచే నాకు భౌతిక శాస్త్ర సిద్ధాంతాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రజలకు సైన్స్ ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించేవాణ్ని. ఆ ఆసక్తితోనే ఏడో తరగతిలోనే ‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ’లో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్లు, వేస్ట్ కార్డ్ బోర్డ్ తో హెలికాఫ్టర్ తయారు చేశాను. మా ఫిజిక్స్ టీచర్ సంతోశ్ కౌశిక్ నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆయనే నా ఆసక్తిని తెలుసుకుని ప్రాజెక్ట్ లో సోలార్ ఎనర్జీ టాపిక్ ఇచ్చారు. దాంతో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను దృష్టిలో పెట్టుకుని సోలార్ ఎనర్జీతో వాహనాలు నడిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ఈ సోలార్ బైక్ ని తయారు చేశాన’’ని నీల్ ఎంతో సంతోషంగా చెప్తున్నాడు.
సోలార్ బైక్ తయారీలో ఒక పాత సైకిల్, 10 వాట్ల సోలార్ ప్యానెల్స్, రెండు జతల 2 వోల్ట్ బ్యాటరీలు, ఒక డైనమో ఆల్టర్నేటర్ ని నీల్ ఉపయోగించాడు. ఈ సైకిల్, రిలే చార్జింగ్ సిస్టమ్ ఆధారంగా నడుస్తుంది. బైక్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 8 గంటలు పడుతుందని నీల్ అంటున్నాడు. మైలేజీ పెరగాలంటే ఎక్కువ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే సరిపోతుందంటున్నాడు. ఫిజిక్స్ లో PHD చేయాలన్నది తన కోరికని, అలాగే ప్రజలకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్న నీల్ ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం.
#talradio #talradiotelugu #touchalife #talblogs #younginnovators