
ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పిల్లలు కొద్దిసేపు కళ్లముందు కనిపించకపోతేనే తల్లడిల్లిపోతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది మనదేశంలో ప్రతిరోజూ ఎంతోమంది పిల్లలు తప్పిపోయి కన్నవాళ్లకు కడుపుకోతని మిగుల్చుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మన దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నారట. దీనికి పరిష్కారంగా ఒక స్మార్ట్ వాచ్ ని తయారు చేశారు దిల్లీకి చెందిన గోయల్ దంపతులు.
సేక్యో అనే స్టార్టప్ ద్వారా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రుల బాధ, భయాన్ని దూరం చేసే వాచ్ లను తయారు చేస్తున్నారు. వాటి ద్వారా తమ పిల్లలు ఎప్పుడు, ఎక్కడ ఉన్నారన్న సంగతిని తల్లిదండ్రులు ఎఫ్పటికప్పుడు ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్టార్టప్ ఆలోచన వెనకాల ఓ చేదు అనుభవం ఉంది.
కొన్నేళ్ల క్రితం స్మ్రిధి గోయల్ తన కూతురితో పాటు దిల్లీలోని ఒక కార్నివాల్ కు వెళ్లారు. అక్కడ తన కూతురు కొద్దిసేపు కనిపించకుండా పోయింది. ఆ కొద్ది నిమిషాలపాటు ఆ తల్లికి ప్రపంచమే తలకిందులైన్నట్టు అయ్యింది. అప్పుడే భర్తతో కలిసి తమలాంటి తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలనుకుంది. ఇద్దరూ కలిసి పిల్లల రక్షణకు సంబంధించి ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలను క్షుణ్నంగా పరిశీలించారు. అలా 2019లో సేక్యో అనే స్టార్టప్ ను మొదలుపెట్టి జీపీఎస్, లోకేషన్ బేస్డ్ ట్రాకింగ్ ఆప్షన్ల తో స్మార్ట్ వాచీలను తయారు చేయడం ప్రారంభించారు.
‘‘ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులుగా మాకు ఎప్పుడూ వాళ్ల రక్షణ గురించి కంగారుగా ఉండేది. అందుకే పిల్లల రక్షణ కోసం ఏధైనా సురక్షితమైన టెక్నాలజీ ఉంటే బాగుంటుందని అనిపించింది. అప్పుడే మేమిద్దరం కలిసి సేక్యో అనే కంపెనీ మొదలుపెట్టాం. సాధారణంగా ఇతర స్మార్ట్ వాచీలలోని ఆప్షన్లకు అదనం మేము మరికొన్ని ఫీచర్లను చేర్చాం. ముఖ్యంగా వాచీ ద్వారా తెలియని నంబర్ల ద్వారా వాయిస్, వీడియో కాల్స్ రాకుండా నిరోధించొచ్చు. స్కూల్ మోడ్, ఎమర్జెన్సీ డయల్, హెల్త్ మానిటరింగ్ మా ప్రత్యేకతలు. అలాగే తల్లిదండ్రులు తమ ఫోన్లలోని యాప్ ద్వారా పిల్లల వాచీని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి పలు ఆప్షన్ల ద్వారా పిల్లల రక్షణ పెద్దల చేతుల్లోకి తీసుకొచ్చాం. సేక్యోలో మొత్తం ఏడు ఎస్ కే యూలు ఉన్నాయి. అందులో మూడు వేరియంట్లను తీసుకొచ్చాం’’ అని చెబుతున్నారు గోయల్ దంపతులు.
సేక్యో వాచీలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ దంపతులు 35 వేల వాచీలను విక్రయించారు. ఇలాంటి సరికొత్త ఆలోచన, తల్లిదండ్రులకు భరోసానిచ్చే పరికరంతో ముందుకొచ్చిన గోయల్ దంపతులను తప్పకుండా అభినందించాల్సిందే.
#talradiotelugu #touchalife #smartwatch #gpstracker #childsafety