
కళలకు పెట్టింది పేరు మన దేశం. ముఖ్యంగా చేనేత కళలలకు ప్రసిద్ధి. ప్రతీ రాష్ట్రంలోనూ వివిధరకాల కళలు అనాదిగా ప్రాచుర్యం పొందాయి. అయితే మారుతున్న జీవన విధానం లాంటి కారణాల వల్ల కొన్ని కళలు మరుగున పడుతున్నాయి. కాకపోతే కళలను ప్రేమించే కొందరు వాటిని బతికించేందుకు నడుం బిగిస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే బిహార్ పాట్నాకు చెందిన 43 ఏళ్ల సుమతీ జాలన్. ‘బిహార్ట్’ పేరుతో జీరో వేస్ట్ క్లాతింగ్ బ్రాండ్ మొదలుపెట్టి బిహార్ రాష్ట్ర ప్రత్యేక చేనేత కళలకు ప్రాణం పోస్తున్నారామె.
విద్య, ఉద్యోగాలపరంగా బిహార్ రాష్ట్రం వెనుకపడిందని ఎన్నో నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్లే ఆ రాష్ట్రం నుంచి యువత చదువు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ఎక్కువగా చూస్తుంటాం. అదే విధంగా సుమతీ జాలన్ కూడా ఉన్నత విద్య కోసం రాష్ట్రాన్ని వదిలి వెళ్లారు. కొన్నాళ్లకు ఆమెకు, తమ రాష్ట్ర చేనేత కళలపై ఆసక్తి పెరిగింది. మరుగున పడుతున్న కొన్ని కళలలను తిరిగి వెలుగులోకి తీసుకురావాలన్న సంకల్పం బలంగా నాటుకుంది. దాంతో తిరిగి బిహార్ కే వెళ్లి బిహార్ట్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెట్టి అక్కడే స్థిరపడిపోయారు.
‘‘చాలామంది బిహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లమని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను నేను. ఆర్థికంగా తమ రాష్ట్రం వేరేవాటితో అంతలా పోటీ పడకపోయినా, మా దగ్గర చేనేత కళలకు కొదవ లేదు. కాకపోతే ప్రజలు వాటిపై ఆధారపడి బతికే పరిస్థితి లేకపోవడంతో ఇతర పనులు చేసుకుంటున్నారు. నా బిహార్ట్ బ్రాండ్ ద్వారా రకరకాల కళలను బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. మల్ బరీ సిల్క్ శారీస్ నుంచి కుర్తీ, క్రాప్ టాప్స్, టోట్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ సుజనీ డాల్స్ మొదలైనవన్నీ పూర్వ పద్ధతుల్లో తయారు చేస్తున్నాం. రోజురోజుకూ ప్రజల్లో కూడా పూర్వ కళలపై ఆసక్తి పెరుగుతోంది. యువతలో కూడా మార్పు కనిపించడం ఆనందంగా ఉంద’’ని సుమతీ చెబుతున్నారు.
బిహార్ అనగానే ఎక్కువ మధుబానీ పెయింటింగ్స్ గుర్తుకొస్తాయి. అలాగే భంగల్పూర్ టుస్సార్ సిల్క్ కూడా మార్కెట్లో వినిపిస్తుంటుంది. వీటితో పాటు సుజనీ, మంజూషా, సిక్కీ, చింగారీ, ఫిష్ నెట్, జర్నా మొదలైన ఎన్నోరకాల నేతలు బిహార్ ప్రత్యేకతలుగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. వీటన్నింటికీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని కూడా అంటున్నారు.
‘‘నాకు ఎలాంటి ఫ్యాబ్రిక్ ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చేనేత కార్మికులు ఎంతో కష్టపడితే కానీ ఆ బట్ట తయారుకాదు. అందుకే మిగిలిన ఫ్యాబ్రిక్ ముక్కలతో రకరకాల బొమ్మలు, బ్యాగ్స్ తయారు చేస్తుంటాం. వాటి మీద స్థానిక నేత ఎంబ్రాయిడరీ చేయించి, వాటితో క్రాప్ టాప్స్ తయారు చేస్తాం. వాటిని యువత ఈమధ్య బాగా ఇష్టపడుతోంది. అందుకే మాది జీరో వేస్ట్ కంపెనీ అని బలంగా చెప్పగలం. 2020లో రాష్ట్రవ్యాప్తంగా మా ఉత్పత్తులను మార్కెటింగ్ చేశాం. ప్రస్తుతం గోవా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, రిషికేష్, ఉదయ్ పూర్, ముంబై, పుణె, చెన్నై మొదలైన ప్రాంతాల్లో మా శ ఉన్నాయ’’ని తెలిపారామె.
ఇలా ఒక మంచి ఆలోచన, ఉద్దేశంతో మొదలుపెట్టిన వ్యాపారం ప్రస్తుతం ఎంతోమంది చేనేత కళాకారుల జీవితాలకు భరోసా ఇస్తోంది. బిహార్ కళలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్న సుమతీలాంటి వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.