
చదువు, ఉద్యోగం, సంపాదన బాగున్నప్పుడు జీవితం సంతోషంగా అనిపిస్తుంది. రోజూ నచ్చిన ఆహారాన్ని తినే స్తోమత ఉన్నప్పుడు జీవితం తృప్తిగా ఉంటుంది. కానీ ఆ చదువు, ఉన్నత కుటుంబం, మంచి జీతం, భరోసానిచ్చే ఉద్యోగం… ఇవేమీ వికాస్ ప్రచండకు సంతృప్తిని ఇవ్వలేదు. పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు కడుపునింపడంతో అతనిలో అసంతృప్తి తొలగిపోయింది. లక్షల మందికి అన్నదానం చేయాలన్న ఆశయంతో ‘అక్షయ చైతన్య’ అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాడు వికాస్.
‘‘నేను చదువుకునే రోజుల్లో… తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ముంబై అంటే ధనిక, ఆనందకరమైన నగరంగా భావించేవాణ్ని. ఇక్కడ అందరూ సుఖసంతోషాలతో జీవితాన్ని అందంగా గడుపుతున్నారు అనుకునేవాణ్ని. కానీ ఎప్పుడైతే నాకు ముంబైలో మొదటి ఉద్యోగం వచ్చిందో, అప్పుడే కొన్ని సంఘటనలు నన్ను బాధపెట్టాయి. రోజూ ఆఫీసు కిటికీలోంచి చూస్తే, ఆకలితో అలమటిస్తున్న వాళ్లు కనిపించేవాళ్లు. ఆపీసు నుంచి మా ఇంటికి వెళ్లే దారిలో కూడా అలాంటివాళ్లు ఎంతోమంది ఉండేవాళ్లు. అప్పటి నుంచి నేనేదో కోల్పోయానన్న భావన కలిగేది. ఉద్యోగం బదిలీ అయ్యాక దిల్లీకి మకాం మార్చినా, నా మనసు ముంబైలోనే ఉండిపోయింది. దాంతో అక్షయ చైతన్యను మొదలు పెట్టాను. ఇప్పుడు నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను’’ అంటున్నారు వికాస్.

హరేకృష్ణ మూమెంట్ తో కలిసి ఈ అక్షయ చైతన్యను స్థాపించారు. ఆకలితో ఏ ఒక్కరూ నిద్రపోకూడదని, అసలు సమాజంలో ఆకలి అన్న పదమే ఉండకూడదన్న ఆశయంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ముంబైలో చేపట్టారు. మొదట ముంబై నగరంలో స్థలం అద్దెకు దొరకడమే ఆర్థికంగా ఇబ్బందైంది. తర్వాత 8 వేల చదరపు అడుగుల స్థలం దొరికింది. అందులో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేశారు. కొవిడ్ లాక్ డౌన్ వల్ల సీఎస్ఆర్ నిధులు ఆగిపోయాయి. అయినా వికాస్ బృందం వెనకడుగు వేయకుండా ముఖ్యమైన మైలురాళ్లను దాటింది.
ఫండింగ్ విషయానికొస్తే.. అక్షయ చైతన్య 50శాతం గ్రాంట్స్ ను కార్పొరేట్స్ నుంచి సేకరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని వెబ్ సైట్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు అందించే ఆర్థిక సాయంతో సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం ఈ అక్షయ చైతన్య టీమ్ లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇక వాలంటీర్లైతే వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్లంతా సేవా దృక్పథంతో ఉండటంవల్లే ఈ మంచి కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.

‘‘మేము నాణ్యత విషయంలో ఒక్కశాతం కూడా రాజీపడం. గత ఏడాది 14 లక్షల మంది ఆకలిని తీర్చగలిగాం. ప్రస్తుతం రోజూ 8050 మంది అన్నార్తులకు భోజనం అందిస్తున్నాం. దీంతోపాటు బాల్ శిక్షణ అహార కార్యక్రమం ద్వారా 53 మున్సిపల్ స్కూల్స్ లో 6000 మంది విద్యార్థులకు రోజూ ఆరోగ్యకరమైన అల్పాహారం అందిస్తున్నాం. అలాగే స్వాస్త్య ఆహారాతో ఆరు ప్రభుత్వాసుపత్రుల దగ్గర రోగుల కోసం వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజనాలు పెడుతున్నామ’’ని వికాస్ చెబుతున్నారు.
2025కల్లా ముంబై నగరంలో నాలుగైదు సెంట్రలైజ్డ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసుకుని… ప్రతిరోజూ లక్షమంది, ఆకలితో బాధపడుతున్న పేదలకు భోజనం అందించాలన్నది అక్షయ చైతన్య ఆశయం. ఇలాంటి కార్యక్రమాలతో ఆకలి బాధలు లేని ముంబైని చూడాలనుకుంటున్నారు వికాస్.