
దంపతులిద్దరికీ స్పందించే మనసుంటే, సమాజానికి గొప్ప మేలే జరుగుతుంది. అందుకు ఉదాహరణగా బెంగళూరుకు చెందిన వి.మణి, సరోజల గురించి చెప్పుకోవచ్చు. చాలామంది సమాజం మీద బాధ్యతతో, అనాథలుగా మారిన పిల్లలపై ప్రేమతోనో ఎన్జీఓలు స్థాపిస్తారు. మరి ఈ దంపతులు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎవరికోసమో తెలుసా? పిల్లల కోసమే! కాకపోతే తల్లిదండ్రులు ఉన్నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వాళ్ల కోసం. జైలు జీవితం గడుపుతున్న వాళ్ల పిల్లల కోసం! సమాజంలో ఈ పిల్లల పట్ల తీవ్రమైన వివక్ష కనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకు అండగా ఉంటూ వారి తిండి, చదువు, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలను చేపట్టింది ‘సోసైటీస్ కేర్ (సోకేర్)’.
1990ల్లో మణి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తుండేవారు. ఆయన రోజూ సెంట్రల్ జైలు మీదుగా బ్యాంకుకు వెళ్లేవారు. ఆ క్రమంలోనే జైలు బయట దీనంగా ఉన్న కొందరు పిల్లలను చూసేవారు. అక్కడున్న వాళ్లను వాకబు చేస్తే… వాళ్లంతా ఆ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లలని తెలుసుకున్నారు. ‘‘జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడ్డ ఖైదీల పిల్లలు, జైలు బయట ఎక్కువగా కనిపించేవాళ్లు. వాళ్లంతా బయటికి రాలేని అమ్మానాన్నలను తలుచుకుని ఏడవడం నన్ను బాగా కలచివేసింది. అప్పటి నుంచి నేను ఆ పిల్లల గురించే ఆలోచించేవాణ్ని. వాళ్ల కుటుంబాల గురించి తెలసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు జైలు పాలయ్యారో… అప్పటి నుంచి వాళ్ల బంధువులు ఆ పిల్లలను కూడా తప్పు చేసిన వాళ్లలా చూడటం ప్రారంభించడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని మణి బాధపడేవారు.

పదవీ విరమణ చేసిన తర్వాత మణి, సరోజిలు తాము కూడబెట్టుకున్న ఏడు లక్ష రూపాయలతో ఆ పిల్లల కోసం ఒక నివాసాన్ని ఏర్పాటు చేశారు. అందులో కర్ణాటక జైళ్లలోని ఖైదీల పిల్లలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాళ్లను రోజూ స్కూళ్లకు పంపుతూ, ఆరోగ్యకరమైన భోజనం పెడుతూ… ప్రేమను పంచుతూ రక్షణ కల్పిస్తున్నారు. అలా 1999లో ఈ సొసైటీస్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది.
‘‘చాలా కష్టపడి ఎన్నో జైళ్లు, అందులో ఖైదీల పిల్లల గురించి తెలుసుకుని మరీ.. ఆపదలో ఉన్న పిల్లలను తీసుకొచ్చారు మణిగారు. 2008లో సరోజిగారు, 2011లో వి మణిగారు చనిపోయారు. అయినా సంస్థ సేవలేవీ ఆగలేదు. ఆ విధంగా మణిగారు అన్నీ పక్కాప్రణాళికలతో సంస్థను సిద్ధం చేసి వెళ్లిపోయారు. నేను ఆ దంపతుల స్నేహితుడిని. 2010 నుంచి నేను కూడా సంస్థ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నాను’’ అంటున్నారు సోకేర్ సంస్థ సెక్రటరీ వెంకటరతన్ రాఘవాచారి.

‘‘నా ఐదేళ్ల వయసప్పుడు మా నాన్న ఒక హత్య కేసులో జైలుకి వెళ్లారు. నాన్నకు 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి నన్ను, తమ్ముడిని చుట్టుపక్కల వాళ్లు నాన్న పేరుతో తిట్టేవారు. కానీ సోకేర్ కి వెళ్లగానే మా జీవితం మారిపోయింది. వాళ్లు మమ్మల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించారు. తర్వాత నేను దాతల సాయంతో సీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం యాక్సెంచర్ లో అనలిస్టుగా పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుని భర్త, ఒక బిడ్డతో సంతోషంగా ఉన్నాను. దీనంతటికీ ఆ దంపతుల పుణ్యమే’’ అని చెబుతున్నారు సంగీత. సోకేర్ పూర్వవిద్యార్థులను కదిపితే ఇలాంటి కథలెన్నో వినిపిస్తాయి.

ఈ 23 ఏళ్లలో, సోకేర్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ మూడు భవనాలలో తమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. రెండు హాస్టల్స్, ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఉన్నాయి. ఎప్పుడో మంచి మనసుతో ఆ ప్రేమమూర్తులు నాటిన ఇక మొక్క ఎంతోమందికి నీడనిచ్చే వృక్షంగా మారింది!