
ఎప్పుడైనా నా కథని రాయల్సి వస్తే సక్సెస్ స్టోరీ కాకుండా నా ఫెయిల్యూర్ స్టోరీ రాద్దామనుకుంటాను. ఎందుకంటే విజయం… పొగరును అలవాటు చేస్తుంది. మన విజయాన్ని అవతలివారు గుర్తించడం లేదన్న అసంతృప్తిని కూడా ఇస్తుంది. నిజమైన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కాబట్టే… నాకు జీవితకథలు చదవడం అంటే చాలా ఇష్టం. నిష్కర్షగా రాసిన జీవితకథలు ఎంతో నేర్పిస్తాయి. ఆదిభట్ల నారాయణదాసు జీవితకథనే తీసుకోండి. అన్ని కళల సమాహారం అయిన హరికథ ప్రక్రియకు పితామహుడే అయినా.. ఎంతో నిజాయితీగా తన జీవితకథను రాశారు. డైరీల వల్ల కూడా మన జీవితాన్ని నేరుగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు డైరీ రాయడం అన్నా ఇష్టమే!

మాస్కు వెయ్యొద్దు మనసు మీద!
తల్లి కడుపులోంచి బయటకు వస్తూనే ఎవడూ, నేను దుర్మార్గుడిని అనుకుంటూ రాడు! మనుషులందరూ మంచివాళ్లే. కానీ ఇప్పటి పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతోంది. తెలివితేటలు అంటే అగ్ని. అది ఒకరికి వెలుగు కావచ్చు, మరొకరికి మంట కావచ్చు. ఆ విచక్షణ కోసం గురువు అవసరం ఉంటుంది. గురువు… మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేసి, జ్ఞానాన్ని వెలిగిస్తాడు. ఈరోజుల్లో సమాజం ఇంత అస్తవ్యస్తంగా ఉండటానికి కారణం సరైన గురువు లేకపోవడమే!
ఇప్పటి పిల్లలను మార్కులు సంపాదించే యంత్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. అప్పట్లో మాకు అన్ని సబ్జక్టులూ కలిపి 90 వస్తే పండుగ చేసుకునేవాళ్లం. ఇప్పుడు 90 వచ్చినా అసంతృప్తి! పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన వాళ్లని తక్కువ అంచనా వేయడానికి లేదు. పిల్లవాడికి చదువు పట్ల అభిలాష అంతగా లేకపోవచ్చు. కానీ తనలో ఏ నైపుణ్యం ఉందో గ్రహించే ప్రయత్నం చేయాలి. నాకు ఇతర దేశాల్లో నచ్చిన అంశం ఏమిటంటే… అక్కడ చదువుతో పాటు లలిత కళలు, ఆటల పట్ల కూడా తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఆటల వల్ల వ్యాయామంతో పాటు క్రీడాస్ఫూర్తి అలవడుతుంది. ఇప్పుడు అంతా గెలుపు గురించే చెబుతున్నారు. కానీ ఓడిపోతే ఏం భయపడక్కర్లేదని ఎవరూ చెప్పడం లేదు. గెలుపు నీకు ఏదన్నా బహుమతిని మాత్రమే ఇస్తుంది. కానీ ఓటమి ఆలోచింపచేస్తుంది. కాబట్టి ఓటమి నీ గురువు. దాన్ని హ్యాండిల్ చేయడం పిల్లవాడికి నేర్పండి చాలు.

ఆత్మహత్య మహాపాపం!
ఒక మనిషి తను బతకండం కంటే చావడమే మేలు అనే స్థితికి చేరుకున్నాడంటే… వాళ్లు ఎంతగా బాధపడి ఉంటారు. మానసికంగా ఎంత క్షోభను అనుభవించి ఉంటారు. అందుకే కుంగుబాటులో ఉన్నవాడిని గమనించుకోవడం మన బాధ్యత. అలాంటి స్థితిలో ఉన్నవాడి భుజం మీద చేసి నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలిగితే చాలు. అందుకే నేను ఆత్మహత్య ప్రయత్నం గురించి KEY అనే నాటిక రాశాను. అందరూ ఊహించేదానికంటే భిన్నంగా… అందులో చావు పాత్రను చాలా అందంగా తీర్చిదిద్దాను. వెయ్యిచావుల కన్నా ఓ బతుకు గొప్పది అని ఆ చావుతోనే చెప్పించాను. ఆ నాటిక చూసి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు- ‘నేను ఈ ఉగాదికి చనిపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ మొన్న మీ నాటకం చూశాక, చనిపోవాలనే ఆలోచనను విరమించుకున్నాను’ అని.

రచయితగా ఎందుకు మారానంటే!
మా గురువుగారు ఓ మాట చెప్పేవారు. మనం చేసే పనుల్లో ఒకటి జాబ్ శాటిస్ ఫాక్షన్ ఇస్తే మరొకటి జేబు శాటిస్ ఫాక్షన్ ఇవ్వాలి అని. రచయితగా చేసిన పనిలో తృప్తి లభించేది. కానీ ఓ పాతికేళ్ల నాడు మా కాలంలో రచయిత అంటే కరివేపాకులా చూసేవారు. మాకు ఓ కాగితాల బొత్తి, కలం ఇచ్చేవారు… కానీ డబ్బు మాత్రం ఇచ్చేవాళ్లు కాదు. నాకు దేవుడిలాంటి రాళ్లపల్లిగారు ఏ లోటూ రాకుండా చూసుకునేవారు కాబట్టి సినిమా కష్టాలు దాటుకుని నిలదొక్కుకోగలిగాను. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నటుడిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాను.

స్త్రీ
మా ఇంట్లో ఏడుగురు అన్నదమ్ములం. కాబట్టి ఆడపిల్లల విలువ మాకు తెలుసు. ఆడపిల్లలంటే దేవతలతో సమానం. అందుకే ఆమధ్య ఓ దుస్సంఘటన జరిగినప్పుడు… ‘ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేవరకూ నిరసనగా నేను నల్లచొక్కానే వేసుకుంటాను’ అని శపథం చేశాను. ఆ ఉరి పడిన రోజే వాటిని తీసేశాను. నేను 50కి పైగా సినిమాల్లో డైలాగులు రాశాను కానీ ఎక్కడా ఓ ద్వందార్థం రాయలేదు. వాళ్లని ఎప్పుడూ ఉదాత్తంగానే చూపించే ప్రయత్నం చేశాను. ‘ఆడవారు లేకపోతే నేను లేను’ అనే భావనే నా దృష్టిలో సమానత్వం. సాక్షాత్తు శివుడైనా సరే శక్తి లేకపోతే చలనం ఉండదు అన్నాడు ఆదిశంకరుడు. అందుకే… స్త్రీని గౌరవించాలి. పురుషుడిని ఆరాధించాలి!
ఓ అవసరం మాత్రమే!
పరిణామక్రమంలో సోషల్ మీడియో ఒక అవసరం. నాగరికత నిప్పు నుంచి ఎదిగింది… దాంతోనే జంతువులను భయపెట్టాడు. వాటిని కాల్చుకు తిన్నాడు. ఆనిప్పులో తను కూడా కాలాడు. ఆ నిప్పులాగే సోషల్ మీడియాను కూడా వాడుకోవాలి. అత్తరులా పూసుకోవాలంతే! ఆ మాటకు వస్తే దేనికీ కూడా అతిగా చలించిపోకూడదు. తామరాకు మీద నీటిబొట్టులాగా attached detachment ఉండేవాడే సుఖజీవి.

ఓ నిరంతర యుద్ధం
ఓ సమయంలో నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, నన్ను అన్న మాటలకి వచ్చిన కన్నీళ్లతో నేను రాసిన అక్షరాలే చెరిగిపోయాయి. మనం అందరం జీవితంలో ఇలాంటి అనుభవాలు చూశాము. ఏడ్చాం, కన్నీరు తుడుచుకున్నాం. ప్రపంచం నిరంతర యుద్ధం. సమాజం నిరంతర యుద్ధం. నిరంతరం నీలో ఒక భారతం జరుగుతోంది. మన మనసే అర్జునుడు, కృష్ణుడు బుద్ధి, పంచపాండవులు పంచేంద్రియాలు, అనంతమైన కోరికలే కౌరవులు. అటు వెళ్లకుండా నియంత్రించుకోవడమే విజయం. సాధన చేస్తేనే అది సాధ్యమవుతుంది.
మంచితనం పంచుకుంటూ…
మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. సాటివారితో ప్రవర్తించేందుకు ఎంతో లౌక్యాన్ని ఉపయోగిస్తాం. చాలాసార్లు అన్యాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండి కూడా భయపడి ఊరుకుంటాం. కనీసం చిన్నచిన్న పనులైనా నిజాయితీగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి కదా! సాటి మనిషి పట్ల కరుణతో మెలగాలి కదా! ఈ ప్రపంచంలో అందమైన కళ్లేవి అని అడిగిన ఆదిశంకరుడు… ‘ఏ కళ్లు కరుణను వర్షిస్తాయో అవే అందమైన కళ్లు’ అని చెబుతాడు. ఆ కరుణను నీ పిల్లలతో మొదలుపెట్టు. మనిషి స్వతహాగా మంచివాడు అని నిరూపించడానికి కరోనా ఓ సందర్భంగా మారింది. ఇది కొనసాగాలి.

కొన్ని మాటలు…
# కళాకారుడు నిత్య యవ్వనుడు. దీర్ఘాయువు.
# అసంతృప్తితో ఉండటం… ఓ మెట్టుఎదగడానికి అవకాశం.
# బిడ్డల పెంపకంలో తండ్రిది ఎప్పుడూ బ్యాక్ స్టేజే. కాబట్టి… రాసేది మగవారే అయినా తల్లి గురించే ఎక్కువగా రాస్తుంటారు. అందుకనే నాకు ఆయన గురించి చెప్పే అవకాశం వచ్చినప్పుడు ‘నాన్న ఎందుకో వెనకబడ్డాడు’ అనే కవితను చదివాను.
#కష్టం వచ్చినప్పుడు దాన్ని కాచుకోవాలి అందుకే ఓ చోట నేను ‘అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి’ అని రాశాను.
https://www.facebook.com/TALRadioTelugu/videos/1755252007946593/