
జీవితం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే… ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ పోవడమే! విజయం అంటే సాధికారికంగా నలుగురితో పంచుకోగలిగేది. నేను సంతోషంగా ఉంటే… ఆ సంతోషం మా అమ్మ కళ్లలో ప్రతిఫలిస్తుంది. ఇతరులకు వాళ్ల జీవితాలకు అర్థం వాళ్లు కనుగొనేలా చేయడం నా జీవితానికి అర్థంగా భావిస్తాను. ఇతరులకు వాళ్ల జీవితానందాన్ని కనుగొనేలా చేయడం… ఆ మార్గంలో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా చేయడం… నా జీవిత లక్ష్యంగా భావిస్తాను. జీవితంలో సాధ్యమైనంతగా ఎక్కువ మందిని ప్రభావితం చేయాలని భావిస్తాను. చాలామందిలో అపరిమితమైన శక్తులు ఉంటాయి. ఆ విషయాలను వాళ్లు గుర్తించడంలో సాయపడాలి. అలా చేయడం ద్వారా నేను ఈ సమాజానికి మేలు చేసిన వాడినవుతాను.

పుస్తకాలే మార్గదర్శకులు
నేను ఓ పుస్తకాల పురుగుని. అసలు పుస్తకాలు లేకపోతే… నేను లేను! చరిత్ర, సైన్స్, సోషల్… ఇలా అన్నిరకాల పుస్తకాల మీదా నాకు ఆసక్తి ఉండేది. ఎన్నో తెలుసుకోవాలని ఉండేది. నా అదృష్టం ఏమిటంటే, ఇంట్లో అందరూ నన్ను పుస్తకపఠనం దిశగా ప్రోత్సహించారు. ప్రతి సందర్భానికీ నాకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు. చందమామ, టింకిల్, అమర్ చిత్రకథ వంటి పుస్తకాలు చిన్నతనంలోనే నా వ్యక్తిత్వంపై ఓ ముద్ర వేశాయి. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు, పాఠశాల, పుస్తకాలు… ఇవే కదా మనల్ని ప్రభావితం చేసేవి. చిన్నప్పుడు చదివిన వివేకానంద, భగత్ సింగ్ లాంటి వారి జీవిత చరిత్రలు నా మనసులో నిలిచిపోయి ఉంటాయనుకుంటాను. నాకు రుద్రవీణలోని ‘తరలిరాద తనే వసంతం… తన దరికిరాని వనాల కోసం’ పాట చాలా ఇష్టం. ఈ పాట పాడితే తాతగారు నాకు చాక్లెట్ బహుమతిగా ఇచ్చేవారు. ఈ పాటకు పియానో వాయించేందుకు కూడా ప్రయత్నించాను.

నాన్నలా మాట్లాడాలని…
నేను సిటీ కుర్రాణ్ని కాదు. ఐదో తరగతి వరకూ నా బాల్యం మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లోనే గడిచింది. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చాం. అయినా నా పట్నాల్లో బాల్యం నాపై చాలా ప్రభావం చూపించింది. అప్పట్లో తల్లిదండ్రులే కాదు, కాలనీ కాలనీ అంతా ఓ కుటుంబంలో ఉండేవాళ్లం. మా నాన్న నాగభూషణరావు ఆరోగ్యశాఖలో పని చేసేవారు. ఆయన తన ఉద్యోగంలో చాలా దూకుడుగా ఉండేవారు. నేను ఇంట్రావర్టుని. ఆయన్ను చూసి… ఇంతగా ఎలా ఆకట్టుకునేలా మాట్లాడతారా అని ఆశ్చర్యపోయేవాడిని! మానాన్న చాలా కవితాత్మకంగా మాట్లాడేవారు. మా అమ్మ కూడా నన్ను ప్రోత్సహించేవారు. మా నాన్న ప్రభావం నాపై చాలా ఉంటుందనుకుంటున్నాను. నా ఈ ఉన్నతిని ఆయన చూడలేకపోయినా.. ఇప్పటికీ ఆయన నాతో ఉన్నారనే భావిస్తాను.

ప్రశ్నలు మీవే…జావాబులూ మీవే!
నా రిఫ్లెక్షన్స్ అనే పుస్తకం… మనతో మనం ఎలా ఉండాలో చెబుతుంది. మనతో మనం నిజాయితీగా ఉంటూ, అలాగే ప్రపంచంతోనూ ఉండాల్సిన అవసరాన్ని ఈ పుస్తకంలో వివరించాను. సెల్ఫ్ డిస్కవరీ అనేది చాలా అవసరం. మనకు ఏం కావాలో క్లారిటీ లేనప్పుడు… ఊరికే ఎవరి కారణంగానో పరుగులు పెడుతుంటాం. అందుకే అసలు మనకు ఏం కావాలో మనం తేల్చుకోవాలి. అప్పుడే దానికి అనుగుణంగా అన్నీ జరుగుతాయి. ముందు ఈ విషయమై స్పష్టత అవసరం. ప్రతి ఒకరూ ఏదో ఒక సమయంలో అసలు నేనేంటి అని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటారు. ఈ రియలైజేషన్ ఎంత త్వరగా వస్తే, ఎంత ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తే… అంత మంచిది. ఎంత ఆలస్యం అయితే… అన్ని అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, ఆలస్యమైన కొద్దీ మనకు అనేక బంధాలు, బాధ్యతలు వచ్చేస్తాయి. అవి అడ్డుగోడలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు కచ్చితంగా అసలు నేనెవర్ని అని ప్రశ్నించుకోవాలి. ఏ విలువల కోసం మీరు బతకదలచుకున్నారో ప్రశ్నించుకోవాలి. ఈ అంశాలన్నీ ఓ కాగితం మీద రాసుకుంటే మనకు ఓ క్లారిటీ వస్తుంది.
మెరుగ్గా మార్చే ప్రతి ఒక్కరూ మార్గదర్శే!
మెంటరింగ్ అనేది మన ఇంట్లో మొదలవుతుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్లను చూసే మనం అలా కావాలని అనుకుంటుంటాం. కానీ పుస్తకాలు చదవడం వల్ల… ఇంట్లో వాళ్లు, ఇరుగు పొరుగే కాకుండా ప్రపంచంలోని వ్యక్తులంతా మన మార్గదక్శకులు అవుతారు. మొదట మనం చదవడం నేర్చుకుంటే… ఆ తర్వాత నేర్చుకోవడం కోసం చదవవచ్చు. చాలా మంది ఫస్ట్ పార్ట్ చేసి సెకండ్ పార్ట్ వదిలేస్తారు. నా జీవితంలో నా కుటుంబ సభ్యులతో పాటు నేను చదివిన పుస్తకాల రచయితలందరినీ నా మెంటార్లుగానే భావిస్తాను. నేను వివేకానంద పుస్తకాలు బాగా చదివేవాడిని. ఎంతగా అంటే… ఒక దశలో అదో వ్యసనంగా మారిపోయింది.

వేల జీవితాలు మార్చేయవచ్చు!
ఇంజినీరింగ్ పూర్తయ్యాక, కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తయ్యాక… జిరాక్స్ సంస్థలో పని చేశాను. మోటరోలా సంస్థ కోసం జీరాక్స్ లో ఇంటర్న్ షిప్ చేశాను. ఇలా ప్రపంచ స్థాయి సంస్థల్లో పని చేయడం వల్ల దృక్పథం పెరిగింది. నేను జిరాక్స్ లో నెంబర్ వన్ ఉద్యోగిగా అవార్డు కూడా అందుకున్నాను. ఓ మంచి వంట నేర్చుకున్నాక, అనేక హోటళ్లలో రకరకాలు వండాలంటే… ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆంట్రప్రెన్యూర్షిప్. చాలామంది తమకు ఉన్న ఉద్యోగాలతో భద్రతగా ఫీలవుతారు. సెటిల్ అవుతారు. కానీ నాలాంటి కొందరికి సాహసాలే ఇష్టం. సరైన ఆలోచనా తీరుతో ఇలాంటి సాహసాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

అత్యంత ఆనందకరమైన రోజు
ఒక కంపెనీలో పని చేసి, ప్రాథమిక విషయాలన్నీ నేర్చుకుని, పునాదులు సరిగ్గా పడిన తరవాత… వ్యాపారవేత్తగా మారాను. 2004లో నా ఆంట్రపెన్యూవర్షిప్ మొదలైంది. అడొసిస్ నా మొదటి కంపెనీ. ఇప్పుడు ఆ సంస్థ ఏడాదికి బిలియన్ల లావాదేవీలు సాగిస్తోంది. అలాంటి ఎన్నో కంపెనీలు ప్రారంభించాను. వాటి ద్వారా వేల మంది జీవితాలను తాకగలిగాను. నేను స్థాపించిన సంస్థల ద్వారా ఉన్నత స్థాయికి వెళ్లిన కుర్రాళ్ల తల్లిదండ్రులను కలవడం నా జీవితంలో అత్యంత ఆనందకరమై రోజు. మిమ్మల్ని కలిశాక మా పిల్లల జీవితాలు పూర్తిగా మారిపోయాయని వాళ్లు చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది.

Personal and Professional Lives
బౌద్ధ సాహిత్యంలో ఓ వాక్యం ఉంటుంది… ప్రతిదీ ప్రవహిస్తుంది అని! జీవితంలోనూ అంతే. జీవితంలో గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమయమూ వెళ్లిపోతుంది అని గుర్తు చేసుకుంటాను. సంతోషకరమైన సమయాల్లోనూ దీన్ని గుర్తుచేసుకుంటాను. మూడ్ బాగా లేకపోతే.. లాంగ్ డ్రైవ్ కి వెళ్తాను. పెయింటింగ్స్ వేసుకుంటాను. ఇలాంటి వాటి ద్వారా నా మూడ్ బాగవుతుంది. పని, జీవితం బ్యాలెన్స్ చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తారు. వాస్తవానికి పని, పర్సనల్ లైఫ్ అంటూ వేరుగా ఉండవు. మీరు ఉద్యోగంలో ఓ విజయం సాధిస్తే, దాని ప్రభావం పర్సనల్ లైఫ్ పైనా ఉంటుంది. మీరు ఉద్యోగం నుంచి ఆనందంగా ఇంటికెళ్తే, ఇంటి దగ్గరా ఆనందం కొనసాగుతుంది. అలాగే ఇంటి నుంచి ఆనందంగా ఆఫీసుకు వెళ్తే, అక్కడా ఆ మూడ్ కొనసాగుతుంది. అందుకే రెండింటినీ వేరు చేయలేం. అదో నిరంతర ప్రక్రియ. జీవితంలో వర్క్ అనేది ఓ భాగంగా తీసుకోవాలి.

వాళ్ల నుంచే నేర్చుకుంటున్నా
నా భార్య శిరీష. నేను చేసిన ప్రతి కంపెనీలోనూ, ప్రతి పనిలోనూ తను ఉంది. మేం ఇంజినీరింగ్ కలిసే చేశాం. ఆంట్రపెన్యుర్షిప్ కూడా కలిసే చేశాం. మా పిల్లలు మా ఇద్దరిలో స్నేహితులనూ చూసి ఉంటారు, భార్యాభర్తలనూ చూసి ఉంటారు. నా భార్య చాలా సహృదయురాలు. ఆమె నా జీవితంలో అంతులేని సానుకూలత నింపింది. నేను చేసిన ప్రయాణాలన్నీ, ఆమె సపోర్ట్ లేకపోతే సాధ్యమయ్యేవే కాదు. మా పెద్దబ్బాయి ధనుష్ పది చదువుతున్నాడు. తనకు రోబోటిక్స్ అంటే ఇష్టం. చిన్నవాడు అంకుశ్, సైంటిఫిక్ గై. లాజికల్ గా ఆలోచిస్తాడు. వాళ్లిద్దరూ నా మెంటార్స్ కూడా! వాళ్లు నాకు జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో నేర్పుతున్నారు.
Really Inspiring.
LikeLike