
నా చిన్నతనం అంతా శ్రీకాకుళం జిల్లాలో తులగాం అనే ఊరిలో గడిచింది. నాన్నగారు పౌరాణిక ఆర్టిస్టు… చంద్రశేఖర నాయుడు గారు. ఆయన నుంచే నాకు సంగీతం అబ్బింది. ఆయనతో కలిసి నాటకాలు వేసేవారం. వాటిలో భాగంగా సంగీతాన్ని కూడా నిభాయించాల్సి వచ్చేది. అలా నాటకాలు, సంగీతంలో కెరీర్ ప్రారంభం అయింది. కానీ సినిమాల్లో పాడాలనే ఆశ మాత్రం అప్పట్లో ఉండేది కాదు. నేను పాడేది విని, అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఇంకా బాగా పాడాలి అనుకునేవాడిని. అంతే! మా చిన్నాన్న కూడా సురభిలో ఉండేవారు కాబట్టి ఆయన ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది.
చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక కూడా సామాజిక నాటకాలు వేసేవారం. ఆ సమయంలో లీలారాణి అనే నటితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించాను. మా జిల్లా మొత్తానికీ స్టేజి మీద పాటలు పాడటం మొదలుపెట్టింది మేమే. వాటిని పుస్తకాలుగా కూడా రిలీజ్ చేసేవారు. ఏ ఊళ్లో చూసినా, అవి విపరీతంగా అమ్ముడుపోయేవి!
ఓసారి ఏదో నాటకంలో, ఓ బాధాకరమైన పాట పాడుతూ ఉంటే, బండారు చిట్టిబాబు అనే గొప్ప హార్మోనిస్టు విన్నారు. నా గాత్రం నచ్చి నన్ను తన బృందంలో చేర్చుకున్నారు. నేను ప్రత్యేకించి ఘంటసాలగారి పాటలను ఎక్కువగా పాడేవాడిని. నేను ఆయన పాటలు పాడుతుంటే మంచి స్పందన వచ్చేది. ఎక్కడ అలాంటి కార్యక్రమం నిర్వహించినా వేల మంది వచ్చేవారు.

తొలి అవకాశం!
నేను ఓ పాటల పోటీలో పాల్గొన్నప్పుడు, దానికి కె.వి.మహదేవన్, బాలుగార్లు న్యాయనిర్ణేతలుగా వచ్చారు. ఆ పోటీలో నాకు మొదటి బహుమతి రావడంతో నేను బాగానే పాడుతున్నాను అనే ధైర్యం, ఆశ కలిగాయి. పైగా మహదేవన్ గారు ఎప్పుడైనా మద్రాసుకు వస్తే నన్ను కలవమని చెప్పి వెళ్లారు. ఆ ధైర్యంతోనే చెన్నైకి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించాను. పండంటి కాపురంలో తొలి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు… ఘంటసాల, సుశీల, బాలు గార్లతో పాటు నా పేరు పడటం చూసి పొంగిపోయాను.
అదేసమయంలో ఓసారి చంద్రమోహన్ గారి ఇంట్లో పాటలు పాడుతుంటూ… అటునుంచి వెళ్తున్న నవత కృష్టంరాజు గారు విని తన ఆఫీసుకు పిలిపించారు. ఒక ట్యూన్ ఇచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గరకు పంపారు. ఆయన దగ్గర కూర్చుని పాట రాయించుకుంటే… ‘నువ్వు నాతో ఒక మంచి పాట రాయించావు కాబట్టి నేను నీకో మంచి పాటను ఇస్తాను’ అని చెప్పడమే కాకుండా కె.వి.మహదేవన్ గారికి నన్ను సిఫార్సు చేశారు. అలా క్రమంగా నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగని నా ప్రయాణం అంత తేలికగా జరగలేదు. ఘంటసాల, బాలు గార్లు బాగా ప్రాచుర్యంలో ఉన్న సమయంలో సినీరంగంలోకి ప్రవేశించాను కాబట్టి… నిలదొక్కుకోవడం చాలా కష్టమైపోయింది.
అదృష్టవశాత్తు నేను పాడిన పాటలు తక్కువే అయినా… అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ‘ఒక వేణువు వినిపించెను’ లాంటి మంచి పాటలెన్నో పాడే అవకాశం వచ్చింది. ఒక వేణువు పాట పాడేటప్పుడు మ్యూజిక్ డైరక్టర్ వెంకటేష్ గారు ‘ఇది నీ జీవితమే మార్చేస్తుంది’ అని చెబితే నమ్మలేదు కానీ నిజంగానే అది నాకు చాలా మంచి పేరు తీసుకువచ్చింది.
మొదట్లో నా మీద ఘంటసాల గారి ప్రభావం బాగా ఉండేది. ఆ విషయం గమనించిన సంగీత దర్శకుడు సత్యం గారు ‘ఆయనను అనుకరించకుండా… నా సొంత గొంతుకలో ప్రయత్నించమని’ సూచించారు. అప్పటి నుంచి నా సొంత బాణీలో పాడే ప్రయత్నం చేశాను. దాంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి! చక్రవర్తి గారు నాతో ఎన్నో పాటలు పాడించారు. మరీ ముఖ్యంగా మురళిమోహన్ కు నాతో పాడించేవారు. అలాగే బాలుగారు నేను కలిసి ఎన్నో పాటలు పాడాం! అప్పట్లో ఇద్దరూ కలిసి పాడే ద్విగళ గీతాలు వచ్చినప్పుడు… తప్పకుండా వాటిని నేను బాలు గారు కలిసి పాడేవారం.

స్వరమాధురి
నేను అక్కడక్కడా పాడుతూ ఉన్న సమయంలో స్థిరంగా నిలదొక్కుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆర్కెస్ట్రా ప్రారంభించాను. ఆర్కెస్ట్రా స్థాపన వెనకాల మేము ఆర్థికంగా బలపడాలనే ఆలోచనే కాదు, కొత్త తరాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యం కూడా ఉంది. మేం పడ్డ బాధలు వారు పడకూడదన్నది మా తపన. అలా మద్రాసుకు ఎవరు కొత్త గాయకులు వచ్చినా, నా దగ్గరకే చేరుకునేవారు. నా దగ్గర సాధన చేయడం, అవకాశం వచ్చినప్పుడల్లా కచేరీలు చేయడం… అక్కడి నుంచి అవకాశాలు అందుకోవడం జరిగేది. అలా నా ఆర్కెస్ట్రాలో పాడినవారు చాలామంది గొప్పవారయ్యారు.
నా అర్కెస్ట్రా తరఫున ఇప్పటికి ఏడు వేలకు పైగా కార్యక్రమాలు చేశాను. కొన్ని వందలమంది గాయకులు, కళాకారులు మా దగ్గర పనిచేశారు అని గర్వంగా చెప్పుకుంటాను. అంతేకాదు! అభిరుచి ఉన్నవారు స్వయంగా పాడుకునేందుకు, కేవలం బాణీలు మాత్రమే నేపధ్యంలో వినిపించేలా ‘పాడాలని ఉంటే పాడుకోండి’ పేరుతో ట్రాక్స్ తో సీడీలు విడుదల చేశాము.
1991 విశాఖపట్నంలో నా 3,000 వ కార్యక్రమం చేసినప్పుడు… ఆటా షికాగోలో కార్యక్రమం చేయమంటూ ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను. కొన్నాళ్లకు తానా వాళ్లూ కూడా ప్రముఖ గాయకులు సుశీల, లీల, జిక్కి, మాధవపెద్ది వంటి పెద్దలందరితో ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు. ఒకే కార్యక్రమం అనుకుని బయల్దేరిన మేము అసాధారణమైన స్పందన రావడంతో హుస్టన్, డల్లాస్, వాషింగ్టన్ వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టుముడుతూ 30 రోజుల పాటు 30 కార్యక్రమాలు చేశాము.

డబ్బిండ్ డైరక్టర్!
నేరుగా గాంధీ నెంబరు రెండవ వీధి వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం చేయడమే కాకుండా… హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల నుంచి అనువాదమైన నూరు వరకు చిత్రాలకు సంగీత నిర్వహణ చేశాను. హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై లాంటి ఎన్నో అనువాద చిత్రాలకు పనిచేశాను.
నేను నేర్చుకున్నది!
అప్పట్లో పాట ముందే రాశాక స్వరకల్పన జరిగేది. కె.వి. మహదేవన్ గారు అలా చేసేవారు కాబట్టి, మూగమనసులు లాంటి మనసుకు హత్తుకుపోయే పాటలు అందించారు. తనకు భాష రాకపోయినా సరే… భావం తెలుసుకుని మరీ ట్యూన్ కట్టేవారు. సంగీత ప్రపంచంలో మహామహుల దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే… క్రమశిక్షణతో ఉండాలి, అందుకున్న పాటను సాధన చేయాలి, దాన్ని సొంతం చేసుకోవాలి, శృతిబద్ధంగా పాడాలి. స్టేజి మీద పాడటం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక పాట మన చేతికి వచ్చినప్పుడు దాన్ని రచయిత ఏ భావంతో రాశాడు, దర్శకుడు ఏ సందర్భంలో దాన్ని ఉపయోగిస్తున్నాడు అని తెలుసుకుని పాడితే ఎవరైనా మంచి గాయకులు కావచ్చు.

కొన్ని స్వరాలు రికార్డింగుకు నప్పవు. అందరూ గాయకులుగా కీర్తిని గడించలేరు. పైగా ఇప్పుడు వందలాది మంది గాయకులు వచ్చేశారు. వారితో పోటీపడి ఒకటీ, అరా అవకాశాలు దక్కించుకుంటే సరిపోదు. కాబట్టి ఇతర వ్యాపకాలను కొనసాగిస్తూనే ఈ రంగంలో రాణించే ప్రయత్నం చేయాలి. ఈ రంగంలో అపజయాలు రావడం, అవకాశాలు చేజారడం చాలా సహజం. అలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. వాటిని చాలా తేలికగా తీసుకోగలగాలి!