Design a site like this with WordPress.com
Get started

Software to Songs – కిట్టు విస్సాప్రగడ

అమ్మమ్మ చూపిన పాటల బాట..

చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ రోజుకో కథ చెప్పిపడుకోబెట్టేది. పిల్లలు కథ చెపితే ఊ కొట్టి నిద్రపోయేవారు. కానీ నేను అలా కాదు… ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అనేవాడిని. అప్పుడు అమ్మమ్మ ఆ కథను ఓ పాటలా పాడి వినిపించేది. అది నాకు బాగా నచ్చేది. అప్పటి నుంచి నేను కూడా కథలను పాటల్లా చెప్పేందుకు ప్రయత్నించేవాడిని. ఇది నాకు చాలా సరదాగా ఉండేది.. అలా పాటలపై ప్రేమ పుట్టింది.

సైకిల్‌పై పాటల ప్రయాణం.

ఇంజినీరింగ్ అమలాపురంలో చదివాను. అప్పుడు 8 కి. మీ సైకిల్‌ పైనే వెళ్లే వాడిని. దారిలో అలసట తెలియకుండా సొంతంగా పాటలు సృష్టించుకుని, పాడుకుంటూ వెళ్లే వాడిని. అప్పుడే అనుకున్నాను… పాట మనకు ఇష్టం కదా! దాన్నే బతుకు తెరువుగా ఎందుకు ఎంచుకోకూడదు అని! చిన్నప్పటి నుంచి మా ఊళ్లో వాతావరణం కూడా అలా ఉండేది. గుడిలో పాటలు వస్తుండేవి, పొలాల్లో కూడా పనులు చేసేవారు పాటలు పాడుకునేవారు.  అవి కూడా నాకు స్ఫూర్తి నిచ్చాయి.

నా జీవితాన్ని మార్చిన సిరివెన్నెల పాట

నాకు చిన్నప్పటి నుంచి బయాలజీ అంటే ఇష్టం. డాక్టర్ అవ్వాలని ఉండేది. నాన్నేమో అంత డబ్బు పెట్టలేనని చెప్పారు. అందుకే నన్ను ఇంటర్‌ ఎంపీసీలో చేర్చారు. అది నాకు అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఇంటర్‌లో ఉన్నప్పుడు సిరివెన్నెల గారి పాట ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాట విన్నా. ఆ పాట నన్ను చాలా కదిలించింది. ఆ పాట విన్న రోజు నాకు నిద్ర పట్టలేదు. అప్పటి వరకూ నాకు పాట అంటే, ఏదో ఇష్టం కొద్ది పాడుకునేదే అన్న ఆలోచన ఉండేది. కానీ ఓ పాట కొందరి మనస్సులను మారుస్తుందని ఆ రోజు నేను గ్రహించా! ఆ పాట విన్న తర్వాత పాటలు రాయడమే నా భవిష్యత్‌ అవుతుందన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి రాయడాన్ని మరింత బాగా ఇష్టపడ్డాను.

నా జీవితంలో ‘జోష్‌’ వచ్చింది

ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు రూ.150 లతో ఓ షార్ట్ ఫిల్మ్‌ తీశాను. దాన్ని అనేక పోటీలకు పంపాను. అది అన్ని పోటీల్లోనూ మొదటి బహుమతులు గెలుచుకుంది. దాంతో నామీద నాకు నమ్మకం వచ్చింది. నాలో కూడా విషయం ఉందని నేను నమ్మడం ప్రారంభించాను. సినిమాను ఓ కేరీర్‌గా తీసుకోవచ్చని అనిపించింది. నేను విశాఖలో ఇంజినీరింగ్ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు జోష్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం టీమ్ విశాఖ వచ్చింది. మా స్నేహితులు వెళ్తుంటే నేనూ వెళ్లాను. అక్కడ సినిమాలపై ఆసక్తి ఉన్నవాళ్లు మాట్లాడొచ్చు అన్నారు. నేను స్టేజ్‌పైకి వెళ్లాను. అదే వేదికపై దిల్ రాజు, వాసువర్మ ఉన్నారని నాకు తెలియదు. విశాఖ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా జోష్ టీమ్ పోటీలు నిర్వహించింది. అన్ని చోట్ల బాగా మాట్లాడిన వారిని హైదరాబాద్ పిలిపిస్తామన్నారు. వాళ్లు అన్నట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా బాగా మాట్లాడిన 80 మందిని హైదరాబాద్ పిలిపించారు. అందులో నేనూ ఉన్నా. ఆ 80 మందికి మళ్లీ పోటీలు నిర్వహించి నాతో పాటు ఐదుగురిని సెలక్ట్ చేశారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతి కూడా ఇచ్చారు. అప్పుడే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే చెప్పొచ్చన్నారు. నేను నా పాటలు చూపించాను. అది చూసి దర్శకుడు ఆశ్చర్యపోయారు. ఓ సినిమా పాటల రచయతకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని మెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వస్తే మంచి పాటల రచయితవు అవుతావని స్టేజీపైనే అందరి ముందు చెప్పారు. అది నా ధైర్యాన్ని మరింత పెంచింది.

గూగుల్‌కు గుడ్‌బై.. పాటలకు సైసై..

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఓ రెండేళ్లు గూగుల్ సంస్థలో పని చేశాను.. కానీ.. పాటల రచయిత కావాలన్న కోరిక కుదురుగా ఉండనివ్వలేదు. మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన నీ మనస్సుకు నచ్చిన పని చేయమన్నారు. 40-50 ఏళ్లు వచ్చాక నేను అలా చేసి ఉంటే బావుండేది అని భవిష్యత్తులో అనుకోకూడదు. నీకు నచ్చింది చెయ్యి అన్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా నీ కాళ్లపై నువ్వు నిలబడేలా ఏ పనైనా సరే చేయమన్నారు. కాకపోతే… నన్ను డబ్బు అడగొద్దు. ఎవరినీ మోసం చేయొద్దు అంటూ షరతులు పెట్టారు! 2012 మే 11 న గూగుల్ వదలాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగంలో సంపాదించిన సొమ్ము, పీఎఫ్‌ సొమ్ము అన్నీ బ్యాంక్ అకౌంట్‌లో వేసుకుని. కచ్చితంగా నెలకు ఇంతే ఖర్చు చేయాలని నిర్ణయించుకుని నా లక్ష్య సాధనవైపు అడుగులు వేశా.

విజయమే లక్ష్యం కాదు… ప్రయాణం ముఖ్యం!

జీవితంలో ఎప్పుడూ విజయాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లకూడదు. మనం చేస్తున్న పనిని మనం ఎంత బాగా ఆనందిస్తున్నామనేది ముఖ్యం. ఓ రైతు ఆకాశాన్ని నమ్ముకుని భూమిలో విత్తనాలు వేస్తాడు. వర్షం కురవకపోతే, దానిపైకి రాళ్లు విసరలేడు కదా. అలా విసిరితే అవి తిరిగి తనపైనే పడతాయి. అందుకే. మళ్లీ వర్షం వచ్చే వరకూ ఎదురు చూడటమే రైతు పని. వర్షాన్ని నమ్ముకుని ముందుకు సాగడమే. అలాగే మనం కూడా మనలోని శక్తిని నమ్ముకుని ముందుకు సాగడమే. విజయం ప్రయాణంలో ఓ మజిలీ మాత్రమే. ఓ వ్యక్తి తనపై నమ్మకం పెట్టుకుని పని చేస్తుంటే, తనలో ఎంత సత్తా ఉందనేది తనకే తెలిసిపోతుంటుంది. ప్రతి వ్యక్తికి స్వీయ మదింపు చాలా అవసరం. అదే సమయంలో మన చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేకపోతే, అది ఫలించదు. స్వీయ మధింపు, చిత్తశుద్ధి లేకపోతే విజయం సాధించలేం. వనరులు లేకపోవడం కూడా కొంతమందికి సమస్యగా మారుతుంది. కానీ ఎక్కడో ఓ చోట జీవితం మనకు ఓ అవకాశం ఇస్తుంది.

ఆ రోడ్డు ప్రమాదం నా దృక్పథం మార్చింది..

ఓ సినిమాకు పాటలు రాశాక నిర్మాత డబ్బులిస్తాను షూటింగ్‌ స్పాట్‌కు రమ్మన్నారు. అప్పుడు నా జేబులో కేవలం పాతిక రూపాయలే ఉన్నాయి. షూటింగ్ దగ్గరకు వెళ్లి సాయంత్రం వరకూ ఎదరుచూశా. నాకు డబ్బు ఇవ్వకుండానే నిర్మాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ఆ విషయం తెలిసి చాలా కోపం వచ్చింది. తిరిగి రూమ్‌కు వెళ్దామని బస్టాప్‌కు నడుచుకుంటూ వస్తున్నా. సరిగ్గా టికెట్‌కు సరిపడా మాత్రమే డబ్బులున్నాయి.. ఇంతలో కాలి చెప్పు తెగింది. నాకు జీవితంపై చాలా నిస్పృహ కలిగింది.

అదే సమయంలో నా ముందు వెళ్తున్న ఓ బైక్‌ను లారీ గుద్దేసింది.. బైక్‌ మీద భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, ఓ కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. భార్య కాలు విరిగింది. చిన్నబాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆ మహిళ అలాంటి సమయంలోనూ ఆ చిన్నబాబుకు పాలు పట్టించింది. ఆ దృశ్యం నాకు జీవితాన్ని కొత్తగా పరిచయం చేసింది. ఆమె జీవితం పావుగంటలోనే తలకిందులైంది. అయినా నిబ్బరంగానే ఉంది. ఆమెకు వేరే ఆప్షన్‌ లేదు. కానీ నాకు చాలా ఉన్నాయి కదా అనిపించింది. మనం విజయం సాధించినప్పుడు మనకన్నా పై వాళ్లతో పోల్చుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనకన్నా కింద వాళ్లతో పోల్చుకోవాలి!

నా మిత్రులే నాకు కొండంత ఆస్తి

నాకు మునిపల్లి మహర్షి, అభిషేక్ మహర్షి అనే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మునిపల్లి మహర్షి 8వ తరగతి నుంచి నా క్లాస్‌మేట్‌. టీసీఎస్‌లో జాబ్‌ చేసేవాడు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు భరోసా ఇచ్చాడు. నువ్వు సినీరంగంలో స్థిరపడేవరకూ నేను నెలకు రూ. 5000 ఇస్తాను. కావాలంటే నువ్వు విజయం సాధించాక ఆ మొత్తం వెనక్కు ఇవ్వు అని చెప్పాడు. ఉచితంగా ఇస్తే నేను తీసుకోనని వాడికి తెలుసు. ఇక అభిషేక్‌ మహర్షితో రూమ్‌ లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా జేబులో రోజూ ఓ వంద రూపాయల నోటు పెట్టేవాడు. ఆ తర్వాత వాడు నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఓ మూడేళ్లు నేను వాళ్ల ఇంట్లోనే పేయింగ్‌ గెస్ట్‌లా ఉన్నా. నేను అక్కడ ఉన్నప్పుడే గుర్తింపు రావడం మొదలైంది. నాకు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి. ఇలాంటి మిత్రుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. జీవితంలో డబ్బు ఉండటం ప్రధానం కాదు. మంచి మిత్రులు ఉండటం కూడా చాలా ముఖ్యం.

నిర్మాతకు కావాల్సింది రాసినవాడే గొప్ప రచయిత..

సినీరంగంలో నేను చాలా గొప్పగా రాశాననుకున్న పాటలు కూడా చాలాసార్లు తిరస్కరించేవారు. ఇది కాదు మాకు కావాల్సింది అనే వారు. ఆ తర్వాత ఎందుకిలా జరగుతుందా అని ఆలోచిస్తే అసలు విషయం అర్థమైంది. నిర్మాతకు తన కథకు తగిన స్థాయిలో రచయిత రాయాలి. అంతకు మించి అద్భుతంగా రాసినా ఉపయోగం ఉండదు. ఇల్లు కావాలంటే ఇల్లే కట్టుకోవాలి. తాజ్‌మహాల్‌ కాదు. మనకు ఓ బల్ల కావాలనుకుంటే కార్పెంటర్ బల్లే చేయాలి. అంతే కానీ కళాఖండం చేసి ఇది బాగానే ఉంది కదా వాడుకో అంటే వాడుకుంటామా! ఇదీ అంతే. ఈ విషయం గ్రహిస్తే తిరస్కరించబడ్డామనే ఫీలింగ్ ఉండదు.

నువ్వు మాట్లాడొద్దు.. నీ పనే మాట్లాడాలి..  

సినీరంగంలో మీ పనే మట్లాడుతుంది. అన్ని విషయాలు, రూమర్లు పట్టించుకోవద్దు. ఎన్నో జరగుతుంటాయి, ఎన్నో అంటారు. అవి ఏవీ పట్టించుకోవద్దు! సినీరంగంలో సముద్రంలో నూనె బొట్టులా ఉండాలి. ఎంత సైలంట్ గా  ఉంటే అంత బావుంటుంది. నాకు పనే దేవుడు అనుకున్నవాడే సినీరంగంలో నిలదొక్కుకుంటాడు. జీవితంలో మనం అనుకున్నది ఎప్పుడూ కాదు. ఫలితాన్ని ఊహించుకుంటూ పని చేయకూడదు. ఫలితం అది రావాల్సిందే. ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నా, అది జరగదు. కాబట్టి ఫెయిల్యూర్‌కు సిద్దపడి ఉండాలి!

అలాంటి పాట రాయాలని ఉంది

సినీ రంగంలోకి రావాలంటే ఫైనాన్సియల్ బ్యాకప్ ఉండాలి. రెండు, మూడు ఏళ్లకు సరిపడా ఆర్థిక వనరులు ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. ఇలా ఉంటే ధైర్యంగా ప్రయత్నాలు చేయవచ్చు. నా తల్లిదండ్రులు నన్ను తలచుకుంటే… మంచి కొడుకునే కన్నాం అని ఫీలవ్వాలి.  అదే నా లక్ష్యం. ఇక పాటల విషయానికి వస్తే, ఎప్పటికైనా ఓ మంచి ఓ జోలపాట రాయాలని ఉంది. అది వింటే అన్ని కష్టాలు మర్చిపోయి నిద్రపోయేలా, పాట రాయాలని ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: