
ఇదీ నేపధ్యం!
ఈ లోకంలో 1272 నుంచే న్యాయవాద వృత్తి ఉంది. కానీ 1847లో.. అంటే ఆరువందల ఏళ్ల తర్వాత మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా మరీజా నిలదొక్కుకున్నారు. మన దేశంలో అయితే 1897లో కార్నేలియా సొరాబ్జీ ప్లీడరుగా రాగలిగారు. Legal practitioners Women Act 1923 వచ్చేవరకు మహిళలు న్యాయవాదాన్ని ప్రాక్టీస్ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. 1989లో ఫాతిమా బీబీ… సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం ఓ అరుదైన మజిలీ.
మా తాతగారు అనంతపురం గుత్తిలో న్యాయవాదిగా ఉండేవారు. ఆయనతో పాటు కోర్టుకు వెళ్తూ, ఆయన క్లయింట్లతో మాట్లాడుతున్నప్పుడు గమనిస్తూ ఉండేవాళ్లం. మా నాన్నగారికి నన్ను కూడా న్యాయవాదిగా చేయాలని ఉండేది. దానికి తగ్గట్టుగానే నేను వాదించేందుకు, విభేదించేందుకు భయపడేదాన్ని కాదు. బెరుకులేకుండా మాట్లాడేదాన్ని కాబట్టి స్కూల్లో కూడా వక్తృత్వ పోటీల్లో నిలబడేదాన్ని.

ఎదురైన అవకాశం
ఇంటర్ తర్వాత ‘బెంగళూరులో నేషనల్ లా స్కూల్’లో ఐదేళ్లు న్యాయవాద కోర్సు చదివేందుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ చట్టం లాంటి అరుదైన రంగంలోకి ప్రవేశించడం ఓ అదృష్టమే. దానికోసం న్యూయార్కులో కొలంబియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్పొరేట్ లా చదువుకున్నాను. అక్కడే న్యూయార్క్ బార్ లో సభ్యత్వం తీసుకుని…. 2,500 మంది న్యాయవాదులు ఉన్న ‘సిడ్లీ ఆస్టిన్ బ్రౌన్ అండ్ ఉడ్’ అనే ప్రతిష్టాత్మక సంస్థలో ఆరేండ్ల పాటు పనిచేశాను. అక్కడే కంపెనీల వ్యవహారాలకు సంబంధించి mergers, acquisitions, taxation… లాంటి రంగాల్లో అనుభవాన్ని సంపాదించుకున్నాను.
దేశానికి తిరిగి వచ్చిన సమయంలో… విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందుకు నిపుణుల సలహాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. మాకు ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాదుల్లో ఆఫీసులు ఉన్నాయి. ఈ రంగం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా వృద్ధి సాధిస్తుంది అనే నా అంచనా!

ఇష్టంలో కష్టం ఉండదు!
ఏ పని అయినా ఇష్టంతో, ఆసక్తితో, స్ఫూర్తితో, జిజ్ఞాసతో చేస్తే… అసలు అది పనే అనిపించదు. ఒత్తడీ తెలియదు. నేను అలా పని చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టే… ఈ వృత్తి నాకు ఒత్తిడి అనిపించదు. ఇందుకు నా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంది. ఒకవేళ ఎప్పుడన్నా ఒత్తిడిగా అనిపిస్తే… దాన్ని హ్యాండిల్ చేయడం కూడా అలవాటు అయిపోయింది.
మేం చూసే కేసుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. పైగా రాత్రిబగళ్లు పనిచేయాల్సి వస్తుంది. వీటితో పాటు న్యాయస్థానంలో వాదనలకి సిద్ధం కావల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఒత్తిడి కలిగించే వాతావరణమే! అందుకోసం వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేస్తుంటాను. సమయం దొరికినప్పుడు పని గురించి ఆలోచించడం మానేసి… కుటుంబంతో గడిపితే… ఉన్న ఒత్తిడి కాస్తా మాయమైపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు చిన్నప్పుడు కూడా అమెరికాకి చదువుకోవడానికి వెళ్లినప్పుడు నా బాబుకు ఏడు నెలలు. వాళ్లు కూడా ఇప్పుడు న్యాయవాద వృత్తిలోకి వచ్చారు.

గుర్తింపు!
Forbes Legal Power జాబితాలో నా పేరు కూడా వచ్చింది. దీనికి కారణం ఒకటే. మనం చేసే కృషి, లక్ష్యసాధన, క్రమశిక్షణ… కష్టపడితే విజయం తథ్యమని తెలుసుకున్నాను. చల్లాపూర్ణయ్య, జి.కె.మూర్తి, జస్టిస్ పర్వతరావు… లాంటి పెద్దలని గమనిస్తూ వారిలో వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, నమ్మకం, ఏకాగ్రతతో పని చేయడం నేర్చుకున్నాను.
మనసు నిబ్బరంగా!
వైద్యుల లాగా న్యాయవాదులు కూడా ఇతరుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. సమస్యలు ఉంటేనే కదా లాయర్ల దగ్గరకు వెళ్లేది. కానీ అవి మన మనసును తాకకూడదు. మనం చెప్పాల్సిన సలహా చెప్పడం, వాళ్లకు సరైన దారి చూపించడం. న్యాయవాదులుగా మన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించాలి. అంతకుమించి చేయగలిగిందేమీ లేదు! ఆ డిటాచ్ మెంట్ మా సీనియర్ల నుంచీ అలవడింది.

వ్యక్తిగతంగా
– ఎన్ని కేసులలో వాదించినా… ప్రజలకు మేలు చేసే సమస్యల కోసం ‘ప్రజా ప్రయోజన కేసులు (PIL)’ వాదించినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది.
– నేను హైదరాబాద్ TiE లో కూడా భాగస్వామిగా ఉన్నాను. స్టార్టప్ సంస్థలు, కొత్తగా వ్యాపారాలు పెట్టుకునేవాళ్లు మార్గదర్శకత్వం కోసం అందులో చేరతారు. చట్టబద్ధంగా వారికి ఎలాంటి సమస్యలూ రాకుండా ఉండటానికి మేము సలహాలు ఇస్తాము.
– నేను సభ్యురాలిగా ఉన్న సీఈఓ క్లబ్ కూడా విజయవంతమైన వ్యాపారవేత్తల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఇస్తుంది.

వ్యాపారం ఓ సామాజిక బాధ్యత
జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. సమాజానికి మన వంతుగా ఏమన్నా చేయాలి అనే సిద్దాంతాలతోనే మా సీనియర్స్, పెద్దలు, మార్గదర్శకులు పెంచారు కాబట్టి ఇలాంటి సంస్థల్లో భాగస్వామిగా చేరాను. జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తాత్కాలిక లాభాల కోసం పొరపాట్లు చేయకూడదు. రుణాల ఎగవేత, చట్టాల అతిక్రమణ లాంటి తప్పులు చేయకూడదు. మన మీదే ఆధారపడి ఎన్నో కుటుంబాలు, చిన్న వ్యాపారులు ఉంటారు. కాబట్టి… వ్యాపారాన్ని ఓ సామాజిక బాధ్యతగా భావించాల్సి ఉంటుంది.

మార్పు సాధ్యమే!
మగవారితో పోలిస్తే… మహిళలు ఈ వృత్తిలో తక్కువే కానీ, ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అయినా మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర కేవలం పది శాతం మాత్రమే. కాబట్టి మహిళలు ఇంకా ఈ రంగంలోకి ప్రోత్సహించాలి. నేను చిన్నప్పుడు ఇంటర్‌లో టాప్ వచ్చినప్పుడు… జస్టిస్ అమరేశ్వరిగారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఓ గొప్ప ప్రోత్సాహం. అలాగే…. ఈ రంగంలో రాణిస్తున్నవారి నుంచి ఇప్పటి యువతులకు ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
మహిళలు ఇంటాబయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. చాలామందికి సోపర్ట్ ఉండకపోవచ్చు. కానీ ఎలాంటి అడ్డంకులు, సవాళ్లు వచ్చినా… వాటిని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ఇంట్లో వాళ్లతో మాట్లాడి… ‘నేను ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను. ఇంట్లోనే ఉండిపోతే సంపూర్ణమైన వ్యక్తిగా ఉండలేను’ అని చెప్పగలగాలి.
కొన్నేళ్ల క్రితం… చాలామంది యువత సాప్ట్ వేర్, వైద్యం దిశగా వెళ్లేవారు. నేను చదివేటప్పుడు కూడా వేలాది మందిలో ఒకరు మాత్రం ఇటు వైపు వచ్చేవారు. కానీ ఇదంతా 20-30 ఏళ్ల నాటి సంగతి. కొన్నాళ్లుగా ఈ తీరు మారుతోంది. చట్టపరమైన సేవలకు డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా కళాశాలలు కూడా పెరుగుతున్నాయి. న్యాయంలో ఆర్థికం అనేది మంచి రంగం. న్యాయరంగంలో వస్తున్న సంస్కరణలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. న్యాయవిద్యలోనూ నాణ్యత పెరిగింది.