
సినిమాలు అంటేనే…
నాకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే పిచ్చి. సినిమా చూసి బాగుండటం, బాగోలేదు అనుకోవడం కాదు. దాని మీదే బతకాలనిపించేంత పిచ్చి. పైగా మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ కూడా స్టేజి ఆర్టిస్టులే కావడంతో చిన్నప్పటి నుంచి కళల పట్ల మక్కువ ఏర్పడిందేమో! ప్రతి మనిషీకీ ముందు తన మీద తనకు ప్రేమ ఉంటుంది… కానీ నాకు నా మీద కంటే సినిమా మీదే ఎక్కువగా ప్రేమ.
నేను స్టేజి ఆర్టిస్టుని కాబట్టి నటుడిగానే సినిమాల్లోకి అడుగుపెట్టాలని అనుకున్నాను. క్రమంగా నాటికలు రాయడం అలవాటు అయ్యింది. ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టానో, రచయిత అవుదామని అనిపించింది. నాటకానుభవం రచయితకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రేక్షకులకు ఏం కావాలి, వాళ్లు ఎక్కడ ఎలా స్పందిస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా తెలుస్తుంది కాబట్టి.
మా అమ్మమ్మకు సినిమా అంటే పిచ్చి. పసిపిల్లలుగా ఉన్నప్పుడే నన్ను, తమ్ముడిని తీసుకుని సినిమాలకు వెళ్లేది. అప్పుడు రామారావుగారి సినిమాలు చూస్తుండిపోయేవాడిని. ఇంటికి వచ్చాక కూడా ఆయననే అనుకరించేవాడిని. అప్పట్లో అమ్మానాన్నలు ఇద్దరూ నాటకాల్లో బిజీగా ఉండేవారు కాబట్టి… నాకు ఇది మంచి, ఇది చెడు అని చెప్పింది ఆయన సినిమాలే! తర్వాత ఖైదీ నుంచి చిరంజీవి గారంటే అంత ఇష్టం ఏర్పడింది. అప్పటి సినిమాలు మనిషిని మార్చేవి. చెడు మీద మంచి చేసే పోరాటంలా ఉండేవి. హీరో అంటే మనకోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం పుట్టాడు అనిపించేది.

అవకాశాలు అందుకుంటూ
నేను సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు, నాకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు. పైగా మొహమాటం, వయసు కూడా చిన్నదే. మొదటగా ఈటీవీలో ఓ టెలిఫిల్మ్ రాసే అవకాశం రావడంతో…. పుత్తడిబొమ్మ డైలీ సీరియల్ కు అవకాశం వచ్చింది. అది క్రిష్ గారి సొంత నిర్మాణ సంస్థ కావడంతో, ఆయనకు నా పని నచ్చి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అదృష్టవశాత్తు నాకు వచ్చిన కథలన్నీ కూడా లోతైన సంభాషణలకు అవకాశం ఇచ్చేవే! వాటిలో పాత్రలు మన కళ్లముందు కనిపించేవే, వారి సమస్యలు మనం చూసేవే. ఆ సంఘటనలు నానుంచి అలా రాయించుకున్నాయి అంతే!
మధనపడితేనే సంభాషణ వస్తుంది. ఎన్నోసార్లు రాస్తాం, కొట్టేస్తాం. బాగా వచ్చింది అనుకున్నాక కూడా, ఇంతకంటే బాగా రాయాలి అనిపిస్తుంది. మనం ఒక మనిషి కోసం ఎదురుచూస్తున్నాం అంటే అర్థం, తన గురించి ఆలోచిస్తున్నాం అని. అలాగే సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉంటే కచ్చితంగా ఫలితం వస్తుంది. సంభాషణలు రాసేటప్పుడు నేను పాత్రలతో పాటు ప్రయాణించే ప్రయత్నం చేస్తాను. ఆ సన్నివేశంలో పది పాత్రలు ఉంటే… ప్రతి పాత్రలోనూ నేను ప్రవేశించాల్సిందే. ఆ పాత్ర నేనే అనీ, ఆ సమస్య నాదే అనీ భావించినప్పుడే తగిన మాటలు వస్తాయి.

కాగితాలు తడిసిపోయాయి
మహానటి రాసేటప్పుడు ఎన్నోసార్లు కన్నీళ్లతో కాగితాలు తడిసిపోయేవి. ఆవిడ ఇన్ని కష్టాలు పడిందా అనిపించేది. ఇక చిరంజీవి లాంటి వాళ్లతో పనిచేయడం అద్భుతం. నేను చిన్నప్పటి నుంచి కంటున్న కల అలాగే నడుస్తోందేమో, నేను ఇంకా నిద్ర లేవేలేదేమో అనిపించేది అలాంటప్పుడు! నాకు ఆత్రేయగారంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ఏ సినిమా తీసుకున్నా… ఒక చిన్న వాక్యమే సినిమా అంత అర్థం చెబుతుంది. అలతిఅలతి పదాలతో అంతులేని భావాన్ని పలికించగలరు. అందుకనే నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని.

తెనాలి అంటేనే!
ఎవరికైనా వాళ్ల పుట్టిన ఊరంటే ఇష్టం. ప్రతి ఊరికీ ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. అలా నా ఊరి గొప్పదనం కళ. నేను ఇక్కడికి వచ్చి మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకుంటున్నాను కానీ… ప్రయత్నం చేస్తే తెనాలిలో చాలామంది మంచి రచయితలుగా స్థిరపడతారు. ఓ సినిమా చూసి, అక్కడి సామాన్యుడు సైతం చెప్పే రివ్యూ చాలామంది సీనియర్ జర్నలిస్టులు రాసేవాటికంటే గొప్పగా ఉంటాయి. గోవిందరాజులు, కాంచనమాల, జగ్గయ్య, జమున, కృష్ణ ఇలా తెనాలి కళాకారుల జాబితా చెబితే ఒక పుస్తకమే తయారు అవుతుంది. మీ అమ్మ గురించి చెప్పండి అంటే నాలుగు ముక్కల్లో చెప్పలేం కదా! జీవితాంతం చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. తెనాలి కూడా అంతే. పుట్టిన ఊరు నుంచి శత్రువు వచ్చినా కూడా వాడిని కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అది జన్మస్థలం మహిమ.
మా తెనాలిలో కళలకాణాచి అనే సాంస్కృతి సంస్థను ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో పేద కళాకారులకు చేతనైనంత సాయం చేశాం. నాటకరంగ కళాకారులకు సంవత్సరానికి మూడు, నాలుగు నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది. అదే సమయంలో కొవిడ్ రావడంతో సంవత్సరం అంతా ప్రభావం పడింది. తెనాలి కళాకారులకు మేము సాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు ఎందరో ముందుకు వచ్చారు.

సంప్రదాయాలు బాగుంటాయి
నేను రామారావుగారికి, ఆత్రేయగారికి, ఘంటసాల గారికీ పుష్కరాల సమయంలో పిండప్రదానం చేశాను, ఇక ముందు చేస్తాను కూడా. ఎందుకంటే వాళ్లు జాతి సంపద కాబట్టి! పిండప్రదానం అనేది కేవలం కన్నవారికి మాత్రమే కాదు… మనం ఎవరెవరికి రుణపడి ఉన్నామో వారందరికీ చేయాలి అనే కథ చదివాక అలా చేయాలి అనిపించింది. నాకు మన ఆచారాలు, సంప్రదాయాలు అంటే ఇష్టం. అవి నిజమో కాదో తెలియదు కానీ వాటిని ఆచరిస్తుంటే బాగుంటాయి. మామిడి తోరణాలు ఎందుకు కడతాం అనేదానికి చాలా కారణాలు వినిపించవచ్చు. అవి నిజం అయినా కాకపోయినా… తోరణాలు కడితే గుమ్మం అందంగా, ముచ్చటగా ఉంటుంది కదా!

మనసు మాట వినాలి
మనమేమిటో మనకు తెలియాలి. దానికోసం కష్టపడాలి, బతకాలి. నేనేమిటో నాకే తెలియకపోతే, నేను ఎందుకు బతకాలో, ఎలా బతకాలో తెలియదు కదా! ఎలాగొలా బతికేద్దాం అనే ఆప్షన్ అస్సలు ఉండకూడదు. నాలో రచయిత ఉన్నాడా, వ్యాపారస్తుడు ఉన్నాడా, క్రీడాకారుడు ఉన్నాడా… తెలిసినప్పుడు నేను అలాగే బతికేందుకు ప్రయత్నిస్తాను. ఇష్టం లేకుండా ఏం చేయకూడదు. మనం చేసే ప్రయాణం మనకు నచ్చకపోతే, ఎప్పుడు దిగిపోతామా అనిపిస్తాము. ఇది మన జీవితం, మన లక్ష్యం!
ముందు మన మనసు ఏం చెబుతుందో వినాలి. అలా కాకుండా బుద్ధికి తోచినట్టు చేస్తే కుదరదు. మన మనసు చెప్పే మాట మనం వింటే చాలు. మీరు చెప్పిన మాట కూడా మీరు వినకపోతే ఇంకెవరు వింటారు. సంపాదన కోసమో, లైఫ్ స్టైల్ కోసం ఎప్పుడూ లక్ష్యం పెట్టుకోకూడదు. అది మన మనసులోంచి పుట్టాలి. దాన్ని సాధించడం మన చేతిలో ఉన్నది అంతే! సంకల్పంలో ధర్మం, నిజాయీతీ ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. మనుషులు చేస్తారేమో కానీ లక్ష్యాలు మోసం చేయవు. ఆ మాటకు వస్తే మనుషులే లక్ష్యాన్ని మోసం చేస్తుంటారు.

నీకు నువ్వున్నావు కదా!
నేను చాలాసార్లు ఓడిపోయాను కానీ ఓటమికి నేను ఎప్పుడూ భయపడలేదు. నాకు నేనున్నాను అన్నదే నా ధైర్యం. ఓటమీ నాదే, గెలుపూ నాదే. నేను సంపాదించుకున్న ఓటమి అది. నేను చేసిన తప్పుల వల్ల వచ్చిందది. అవి సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా! అంతేకానీ ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు.
నేను రచయితగా ఇంకా రాయాల్సిన కథలు చాలా ఉన్నాయి. ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడిలోనూ ఓ రచయిత ఉంటాడు. నేను రాసిన కథ ఏదన్నా… నాలాగే చెప్పాలి అని బలంగా అనిపించినప్పుడు నేను దర్శకుడిగా కూడా మారతానేమో!