
ఇలా మొదలైంది!
అవి కొవిడ్ మొదలైన తొలి రోజులు. అందరిలా నేను కూడా ఓ మధ్యతరగతి మనిషిగా ఆలోచించి, నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుని… లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ వచ్చాను. 2020, ఏప్రిల్ 13న మా చిన్నబ్బాయి పుట్టినరోజు కావడంతో… లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి చికెన్ షాపు దగ్గరకు వెళ్లాను. అక్కడ ఒక కస్టమర్ చాలాసేపు లోపలే ఉండిపోయింది. నేను తను ఎందుకంత చికెన్ కొనుక్కుందా అని అడిగితే… ‘నేను వాచ్ మెన్ గా పనిచేస్తున్నాను. నేను పనిచేసే అపార్టుమెంటు ముందు, నిర్మాణంలో ఉన్న భవనంలో చాలామంది కార్మికులు ఆకలితో పస్తులుంటున్నారు. వాళ్లకి రోజూ నా కోడలు అన్నం పెడుతోంది. ఓ రెండు రోజుల నుంచి వాళ్లు సరిగా తినలేదు కాబట్టి… కాస్త ధైర్యం, బలం వస్తుందని చికెన్ కొనుక్కు వెళ్తున్నాను’ అని చెప్పింది. తన జీతం ఆరువేలు… చికెన్ బిల్లు రెండు వేలు. మరి ఎందుకంతగా సేవ చేస్తోందంటే… ‘నాకు భాష వస్తుంది. నేను ఎవరి దగ్గరకు వెల్లినా పని దొరుకుతుంది. అప్పు దొరుకుతుంది. వాళ్లను ఎవరూ నమ్మరు కదా. వాళ్లకు మన భాష కూడా రాదు.’ అని చెప్పింది ఆ మాట విని చెంప ఛెళ్లుమన్నట్టు అనిపించింది.
వెంటనే నా వంతుగా నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఎవరెవరు అవసరంలో ఉన్నారు? వాళ్ల వివరాలు, ఫోన్ నెంబర్లు ఏమిటి? అని జాబితా తయారుచేశాను. వాళ్లకు సాయపడేందుకు నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకున్నాను. లక్షన్నర ఉన్నాయి. వాటితో కొంతమందికైనా ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈలోగా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. అందులో ఆరేడు లక్షలు వస్తాయి కాబట్టి వాటితో కార్ కొనుక్కోవడమో, లేకపోతే పిల్లలకు చదువుకు ఉపయోగించడమో అని ఒకప్పుడు కోరికగా ఉండేది. ఇప్పుడు లక్ష్యం మారింది. ఓ కిరాణా షాపు నుంచి ఎవరి ఆహార అలవాట్లను బట్టి వారు సరుకులు తీసుకోమని చెప్పి, బిల్లు నేనే చెల్లించేవాడిని. ఇలా 190 మందిని కొన్నాళ్లు గమనించుకుని, చివరకు వాళ్లను ప్రభుత్వ సాయంతో స్వస్థలాలకు పంపాము.

సొంత ఇంటి కలను కాదని…
జూన్ 2, 2020 నా పెళ్లి రోజు కావడంతో అమ్మానాన్నలతో గడిపేందుకు ఊరికి వెళ్లాం. ఎప్పటి నుంచో మా పిల్లలు త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ అడుగుతున్నారు కాబట్టి ఊళ్లో నాకు ఉన్న రెండు ఎకరాలను అమ్మి… ఇల్లు కొనుక్కోవడానికి ఆ నలభై లక్షలు తెచ్చాను. మా ఎదురుగుండానే ఓ ఫ్లాట్ చూసుకున్నాము. దాని గురించే మాట్లాడుకుంటూ పడుకున్నాం. ఆ ఉదయం 5.30కే మా వాచ్ మెన్ ఫోన్! బయట 20-30 మంది మీ సాయం కోసం వచ్చి నిలబడ్డారు అని. మళ్లీ నా ప్రయాణం మొదలైంది. వాళ్ల కోసం అప్పుడో లక్ష, అప్పుడో యాభై వేలు అంటూ భార్య నుంచి తీసుకుంటూ… 170 రోజులు అయ్యాక చూసుకుంటే అయిపోయాయి. నా కుటుంబాన్ని కూర్చోబెట్టి ఇదంతా చెప్పుకొచ్చాను. వాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరమూ రాలేదు. కాకపోతే నా ఆరోగ్యం గురించే భయపడ్డారు.

వేలమందికి సాయం!
ఇప్పటివరకూ (మార్చ్ 2021) సుమారు 40 వేల కుటుంబాలకు సాయం చేయగలిగాము. ఎప్పటికప్పుడు మేము రైస్ ఏటీఎమ్ మూసి వేయాలని అనుకుంటున్నాం… ఎందుకంటే ప్రజలు మా దాకా రాకుండా వాళ్ల కాళ్ల మీద బతికే పరిస్థితి రావాలి అనుకుంటున్నాం కానీ… అందరికీ ఆ స్థితి ఒకేసారి రాదు కాబట్టి అవసరంలో ఉన్నవారికి సాయపడుతున్నాం. పాతవాళ్లనైతే రాకుండా చేయగలిగాం! డబ్బులు అయిపోయిన ప్రతిసారీ, సరిగ్గా ఎవరో ఎక్కడి నుంచో మా గురించి విని పంపే సాయం అందేది.
నా విజయ సూత్రం ఒకటే. నిబద్ధతతో పనిచేస్తున్నా, అపాత్ర దానం చేయడం లేదు. అంతటితో ఆగిపోకుండా ప్రాజెక్ట్ ప్రిష పేరుతో కష్టంలో ఉన్నవారు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి కావల్సిన సాయం చేయడమే దీని లక్ష్యం. కుట్టుమిషన్, బండి, కేటరింగ్, టీస్టాల్స్… ఇలా ప్రాజెక్ట్ ప్రిష ద్వారా 300 కుటుంబాలకు జీవనోపాధి కల్పించగలిగాం.

ఇంతింతై
మొదట్లో కరోనాకు భయపడి, నాతో పాటు ప్రయాణించేవారు కాదు. క్రమంగా ఒకొక్కరే తోడయ్యారు. నేనుండేది గేటెడ్ కమ్యూనిటీ అయినా, ఎవరూ అడ్డు చెప్పలేదు. నేస్తాలు కూడా మొదట్లో అపాత్రదానం చేస్తున్నవేమో అని హెచ్చరించారు కానీ… ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ధైర్యం ఇస్తున్నారు. మా సాయం అర్హత ఉన్నవారికే అందేందుకు ఓ స్క్రీనింగ్ ప్రాసెస్ ఏర్పాటు చేశాము. ప్రతి శని, ఆదివారాలు పూర్తిగా… ఎవరు అర్హులు, ఎవరికి ఏం ఇవ్వాలి అని తెలుసుకోవడానికే వెచ్చిస్తాం. ఈ రైస్ ఏటిఎమ్ లో ఇప్పుడు ఒకో విభాగాన్నీ ఒకొక్కరికీ అప్పచెప్పాం. అంతేకాకుండా… మా దగ్గరకు ఎంతో మంది కోటి ఆశలతో, వారి జీవితాలు మారతాయనే నమ్మకంతో వస్తారు. వారిని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు అప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. ఎవరన్నా గోప్యత కోరుకుంటే… వాళ్ల ఇంట్లోకూడా తెలియకుండా సెకండ్ ఏటీఎమ్ ద్వారా సాయం చేస్తాం. అక్కడ ఎలాంటి ఫోటోలు, మీడియాలు ఉండవు.
మాకు అండగా నిలబడేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్లు ఏ విధంగా మాకు సాయపడగలరు అని బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. వారిలో ఏ దురాలోచన ఉన్నా… ఇన్నాళ్ల మా శ్రమ వృధా అయిపోతుంది.

మొదటినుంచే!
ఎదుటిమనిషికి సాయం చేయడం అనే అలవాటు మొదటి నుంచే ఉండేది. అది మా పెద్దవాళ్ల నుంచే అలవడింది. నాకు పెళ్లయ్యి, నా భార్య అయిదో నెలలో ఉండగా… ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చాడని అనుకుని మరింతగా సేవ చేయడం మొదలుపెట్టాను. ప్రతి వారాంతంలోను హెల్మెట్, రోడ్ సేఫ్టీ, రక్తదానం, పర్యావరణం… లాంటి విషయాల కోసం కృషి చేసేవాడిని.
హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తున్నప్పుడు- Friends to Support అనే సంస్థ మొదలుపెట్టి రక్తదానానికి సాయపడ్డాం. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత… మన భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు ఉండాలంటూ ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధులు అందరినీ కలిసి missed call movement మొదలుపెట్టాను. పర్యావరణం కోసం ప్లాస్టిక్ సంచీల వాడకాన్ని తగ్గించాలని నినదిస్తూ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ మొదలుపెట్టాను. నా జీతంలో యాభై శాతం పేదల కోసం ఖర్చు చేయడం అలవాటే కాబట్టి…. సాధారణ జీవితానికే అలవాటు పడ్డాను. అందుకనే ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేయడానికి పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు.

దాతలకు
చాలామందికి సాయం చేయాలి అని ఉంటుంది. అలాంటివారికి మేము మూడు రకాల మార్గాలు చూపిస్తాం. విద్య (ఉపకార వేతనాలు), ఉపాధి (ప్రిష), ఆహార పదార్థాలు (రైస్ ఎటిఎమ్)! మా తీరు పారదర్శకంగా ఉండేందుకు, దాతలకు తృప్తిగా ఉండేందుకు… మేలు పొందినవారి ద్వారా ఒక ధన్యవాదాలు అందచేస్తున్నాం. మన భారతీయులు చాలా దయార్ద్ర హృదయలు. కాకపోతే తమ సేవ అర్హత లేని వారికి వెళ్తున్నదేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి సందేహం లేకపోతే… తప్పకుండా ముందుకు వస్తారు.