
చాలామందికి నాయకత్వం మీద తరగతులు నిర్వహిస్తున్నప్పుడు నేను ఏం చెబుతానంటే… మీరు పెద్దయితే ఏమవుతారో కూడా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మాత్రం స్పష్టత ఉండాలి, దాన్నినిబద్ధతతో చేయాలి. అప్పుడు లోకమే మన కోసం తగిన భవితను ఏర్పరుస్తుంది. పెద్దలు చెప్పింది వింటూ, వాటిలో మన స్వభావానికి ఏది అనువుగా ఉంటుందో బేరీజు వేసుకునే ఆలోచనా శక్తి వస్తే మార్గం అదే కనిపిస్తుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ!
మా నాన్నగారు విద్యుత్ శాఖలో అకౌంటెంట్. హోమియోపతి ఆయన అభిరుచి. తన జీవితకాలం ఉచితంగా వైద్యం చేస్తూనే వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా ఎన్నో గుప్తదానాలు చేసేవాళ్లు. మా అమ్మ చాలా తెలివైనదే కాదు… ఎవరి గురించీ ఏనాడూ చెడుగా మాట్లాడని సంస్కారవంతురాలు.

అనూహ్యమైన మలుపులు!
హైస్కూల్ లో ఉన్నప్పుడు ఇంటర్ లో ఉన్నప్పుడు దేని మీదా పెద్దగా శ్రద్ధగా ఉండేది కాదు. దాంతో మంచి మార్కులు వచ్చేవి కాదు. తక్కువ మార్కుల వల్ల ఇంగ్లిష్ మీడియంలో కూడా సీట్ రాలేదు. బీఎస్సీ తెలుగు మీడియంలో ఉండేవారం. అందరూ ‘మీరేంటి… అంత తెలివి ఉండీ పనికిరాకుండా అయ్యారు’ అనేవారు. దాంతో సిగ్గుపడి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. దానికితోడు కొంతమంది మంచి ఉపాధ్యాయులు మాకు ప్రత్యేకమైన శ్రద్ధతో చెప్పేవారు. నాకే నమ్మశక్యం కాని విధంగా ఫస్ట్ క్లాస్ వచ్చింది. దాంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేశాను. యూనివర్శిటీ ర్యాంక్ కూడా వచ్చింది.
ఆ విజయంతో అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేయాలనిపించేది. ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉండటంతో ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అమెరికాలో ఉంటున్న బంధువు నా చదువుకు సాయం చేస్తానని చెప్పడంతో… అటువెళ్లాలనే ఊగిసలాట. ఈలోగా అనుకోకుండా ఐఐటి మద్రాసులో సీటు రావడంతో అందులో చేరాను. అక్కడ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తయిన వెంటనే వరంగల్ లో Kakatiya Institute of Technology లో Physics Head of the Department హోదా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అదే సమయంలో ONGC ఉద్యోగమూ వచ్చింది. అప్పటి అభిప్రాయాల ప్రకారం, సహజంగానే నేను ప్రభుత్వం ఉద్యోగం అయిన ఒఎన్‌జిసి వైపు మొగ్గు చూపించాను. కానీ ఈలోగా అమెరికాలో చదువకునేందుకు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నాను.

అమెరికా ప్ర..యాణం
చాలా రోజుల పాటు వేచి చూసిన తర్వాత, ఇక ఒఎన్‌జిసిలో చేరదామని, రైల్వే స్టేషన్‌ను వెల్లిపోయాక అమెరికా నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ దొరికినట్టు ఉత్తరం వచ్చింది. అది అసోంలో ఉన్న నన్ను చేరుకోవడానికి 20 రోజులు పట్టింది. ఆ పాటికి నేను అక్కడ పూర్తిగా కుదురుకుపోయాను. అక్కడి నుంచి ఫోన్ చేయాలి అంటే 40 మైళ్లు వెళ్లి… ఆఫీసులో ట్రంక్ కాల్ బుక్ చేసి 18 గంటలు వేచి చూస్తేనే ఫోన్ చేసే అవకాశం వస్తుంది. అలా ట్రంక్ కాల్ బుక్ చేసి.. మా ప్రొఫెసరుతో మాట్లాడితే… మరో 15 రోజుల్లో రాగలిగితే, సీటు దక్కుతుందని చెప్పారు. అక్కడి నుంచి మద్రాసుకు వెళ్లడానికే రెండున్నర రోజులు పట్టింది. అదృష్టవశాత్తు వీసా వచ్చింది కానీ, టికెట్ కోసం పదివేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంట్లో అవీఇవీ అన్నీ అమ్ముకుని… ఎలాగొలా టికెట్ డబ్బులు సేకరించాను. చివరికి అమెరికాలో ఇరవై డాలర్లతో ఓ చిన్న సూట్ కేసుతో దిగాను.
‘మనం చేసే ప్రయత్నం చేయాలి. అదే లేకపోతే దేవుడు సాయం చేసినా, సమాజం తోడు వచ్చినా ఉపయోగం ఉండదు. కర్మణ్యే… అంటూ గీతలో చెప్పిన మాట సారాంశం కూడా ఇదే!’

అనూహ్యమైన అవకాశాలు
మనం రకరకాల పనులు చేయవచ్చు. కానీ ఏం చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టగలగాలి. అలా కాకుండా రకరకాల పనులు మీద ఒకేసారి దృష్టి నిలిపే ప్రయత్నం చేస్తే… దేని మీద ఏకాగ్రత చూపించలేను. అందుకే నేను అమెరికా వచ్చాక తర్వాత ఫిజక్స్ నుంచి కంప్యూటరుకు మారినా ఇబ్బంది పడలేదు. దాంతో కంప్యూటర్ విప్లవాన్ని అందుకోగలిగాను. నా చేతికి అందిన ఓ పర్సనల్ కంప్యూటర్ మీద ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. దాని మీద ఒక అవగాహన సాధించి… కంప్యూటర్ మీద ఎన్నో వ్యాసాలు రాస్తూ జర్నలిస్టుగా కూడా మారాను. అవి చూసిన యాపిల్ సంస్థ వారు, నన్ను వేర్వేరు సమావేశాలకు పిలిచి… నా అనుభవాలు, పరిశీలనలు చెప్పించడం మొదలుపెట్టారు. వాటికి వేల మంది హాజరయ్యేవారు. మా ఫిజిక్స్ ల్యాబ్ ఇన్ చార్జికి ఇదంతా నచ్చేది కాదు. ఫిజిక్స్, కంప్యూటర్ల మధ్య ఏదో ఒకటి నిర్ణయించుకో అని చెప్పేశారు. దాంతో కోపం వచ్చేసి మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాను.
ఆశ్చర్యంగా యుటా విశ్వవిద్యాలయం నుంచి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించడానికి పదిలక్షల డాలర్ల గ్రాంట్ లభించింది. అదే సమయంలో యాపిల్ నుంచి కూడా ఉద్యోగంలో చేరమంటూ ఆహ్వానం వచ్చింది. ఎలాగొలా ఆ ఉద్యోగాన్ని వదిలించుకుందామని నాకు యూనివర్సిటీలో ఇచ్చేదానికంటే రెట్టింపు ఇస్తే చేరతా అన్నాను. ఆశ్చర్యంగా వాళ్లు మూడు రెట్లు ఆఫర్ చేశారు. అక్కడ నేను ఏం చేయగలనో ఆలోచించి, దానికి అనుగుణంగా శ్రమించాను. మంచి వృద్ధి సాధించాను! బిల్ ఆట్కిన్ సన్, ఆలన్ కే లాంటి ఎంతోమంది ప్రతిభావంతులతోనూ పరిచయం ఏర్పడేందుకు, లోకం అంతా తిరిగేందుకు… అక్కడ అవకాశం ఏర్పడింది.

వేదాంతం… వ్యక్తిత్వ వికాసం!
సాఫ్ట్ వేర్లు, కంప్యూటర్ చిప్స్ రూపొందించడం కోసం, అసలు మన మెదడు ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలుస్తున్న దశలో… ‘వీటి సంగతి సరే ముందు మీ సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేయమని’ సూచించారు కొందరు శాస్త్రవేత్తలు. నీకు సంస్కృతం తెలుసు కాబట్టి.. మీ జ్ఞానాన్ని నువ్వు అనువదించి నేటి జీవితానికి అన్వయించగలిగితే బాగుంటుందని అని సూచించారు. అదే సమయంలో నాకు ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం దొరికింది. ఎంతో ఆలోచన తర్వాత… నేను ఇప్పటి వరకూ తెలుసుకున్న విషయాలన్నీ మన భారతీయ జ్ఞానంతో సమన్వయం చేయాలనే ఉద్దేశంతో యాపిల్ వదిలేశాను. నా నిర్ణయం విని అందరూ ‘మంచి జీతం, స్థాయిలో ఉన్న నువ్వు ఇదంతా వదిలేసి… వేదాంతాలు, వ్యక్తిత్వ వికాసం అంటావేమిటి’ అని నిరసించారు.
ఆ నిర్ణయం తీసుకున్నాక కొన్నాళ్లపాటు, వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ, దానికి నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్నీ, శాస్త్రవేత్తలతో సాగిన సంభాషణలనీ జోడిస్తూ… Mitya Institute of Learning and Architecture సంస్థను నెలకొల్పాను. ఓ 30 ఏళ్లుగా దాదాపు 70 వేల మంది నా కార్యక్రమాలు, ఉపన్యాసాలకు హాజరై ఉంటారు. ISB, సేబ్రూక్ విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. సంస్కృత భారతి డైరక్టరుగా, నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు స్పెల్లింగ్ బీ శిక్షణ అందిస్తూ… ఇలా రకరకాలుగా పనిచేస్తున్నాను.

ఇదే విజయానికి రహస్యం!
మీకు ఏం చేయాలనుకుంటే, ఎక్కడ శక్తి ఉందనుకుంటే… అందులోకి భయపడకుండా వెల్లిపోవాలి. నేను అలాగే ప్రయాణించాను. చేసేది మొదటి నుంచీ చేయి. లేకపోతే మన నమ్మకాలు, అనుభవాలు… భయాలు, అనుమానాలు కలిగిస్తాయి. ఇవన్నీ వదిలేసి… చిన్నపిల్లలు ఎలా నడవడానికి, మాట్లాడటానికి నేర్చుకుంటారో అలా ప్రయత్నించాలి.
మన పిల్లలు కూడా ఒక మూసలో ఇమిడిపోవాలి అనుకోకూడదు. ఏది మనసులో ఉంటే, దేని మీద అభిరుచి ఉంటే… ఆ దిశగా వెళ్లడానికి స్వేచ్ఛనివ్వాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఏ కోర్సు చేయాలన్నా, ఏ నైపుణ్యం కావాలన్నా పొందే సదుపాయాలు ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్లవచ్చు… అనుకునేందుకు అనువైన సమయం ఇది!

ఆనందో బ్రహ్మ!
ఒకప్పటిలాగా శరీరంలోకి చొచ్చుకువెళ్లకుండానే, fMRI, MRI స్కానింగ్ తో మెదడులో జరిగే పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి వల్ల అర్థం అవుతోంది ఏమిటంటే.. మన ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో, ఎప్పుడైతే ఆసక్తితో పనిచేస్తున్నామో, వేటినైనా ఆస్వాదిస్తున్నామో… అప్పుడే మనం ఎదుగుతున్నాం అని తెలుస్తోంది. ఇలాంటి పరిశోధనల వల్లే పాజిటివ్ సైకాలజీ లాంటి విభాగాలు వస్తున్నాయి.
ఆ మాటకు వస్తే అసలు మనం ఆనందం నుంచే మనం ఉద్భవిస్తాం. మన పిల్లలను కూడా ఆనందంగా, ప్రశాంతంగా చూస్తున్నప్పుడే వారి వ్యక్తిత్వం ఎదుగుతుంది. మన మెదడు సైతం బాధాకరమైన అనుభూతులను త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఏదన్నా సంతోషంగా నేర్చుకుంటేనే దాని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుంది.

మన శరీరంలో అలవాట్లను నియంత్రించే ప్రిమిటివ్ బ్రెయిన్, భావోద్వేగాలను ప్రభావితం చేసే లింబిక్ బ్రెయిన్, విశ్లేషణ, ప్రణాళిక సాగించే కాగ్నినివ్ బ్రెయిన్ లాంటి ఎన్నో విభాగాలు ఉంటాయి. మన మెదడు పరిశోధన పరంగా ఒకలా, మనసత్త్వపరంగా ఒకలా, ఆధ్యాత్మికపరంగా ఒకలా కనిపిస్తుంది. కానీ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమైనవే! పానిక్ అటాక్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ, కుంగుబాటు… ఇలాంటివన్నీ వైద్య పరిభాషలో కనిపించినా మానసికమైనవే!