
మానాన్న విద్యారంగంలో ఉండేవారు. మొదటి నుంచి ఆయనకు సాయం చేసే అలవాటు ఉండేది. పేద పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పేవారు. చాలా మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. ఎందరికో సీట్లు ఇప్పించారు! వీటితో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలూ చేస్తుండేవారు. ఆయన స్ఫూర్తితో నేను 7 ఏళ్ల క్రితం మదాల ఛారిటబుల్ ట్రస్టు స్థాపించాను. మీ కోసం ఏం కావాలి అని మా ఊరివాళ్లను అడిగినప్పుడు, ఒక కమ్యూనిటీ సెంటర్ ఉంటే బావుంటుందని చెప్పారు. అందుకని దాదాపు 42 వేల చదరపు అడుగుల సెంటర్ నిర్మాణం చేశాం.

ఈ కమ్యూనిటీ సెంటర్ ఎందుకంటే
ఇప్పటికీ చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. మహిళలు, పిల్లలు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలి అనుకున్నా ఎలాంటి వేదికలు లేవు. ఇవే కాకుండా… తాగునీరు, విద్య, రహదారులు, ఉపాధి, వైద్యం, రుణాలు లాంటి చాలా విషయాల్లో సమస్యలు ఉంటాయి. ఏ ఒక్క సంస్థా వాటన్నింటికీ పరిష్కారం చూపలేకపోవచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటాయి. అలాంటి వాటిన్నింటికీ ఈ కమ్యూనిటీ సెంటర్ వేదికగా ఒక తాటి మీదకు తెచ్చి, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. సమస్యల పరిష్కారం కోసం మౌలిక సదుపాయాలు కావాలి. అలాగే ప్రారంభదశలో చొరవ తీసుకునేవారు కావాలి. ఈ రెండూ మేం అందించాలని ఈ కమ్యూనిటీ సెంటర్ నెలకొల్పాం.

ఉన్నఊళ్లోనే.. ఉపాధి దిశగా!
మేం ఓ వారధిలా… ఉండేందుకు ఈ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ఏర్పాటు చేశాక చాలా స్వచ్ఛంద సంస్థలు తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 2 వేల మంది హైస్కూల్, కాలేజ్ డ్రాపవుట్ విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణలు ఇచ్చి ఉపాధి లభించేలా చేశాం. ఇంకా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించేలా చేశాం.

మారుమూల ప్రాంతంలో నగర సౌకర్యాలు
ఐదారేళ్లుగా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించాం. నగరాల నుంచి ప్రత్యేక వైద్యులను రప్పించి మహిళలకు క్యాన్సర్ సంబంధింత వైద్య పరీక్షలు నిర్వహించాం. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 15 వేల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాం. వీటితో పాటు కమ్యూనిటీ సెంటర్‌లోనే యోగా క్లాసులు, షటిల్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్ క్రీడలు నిర్వహిస్తుంటాం. మహిళలు యోగా క్లాసులకు బాగా వస్తున్నారు. దాదాపు నగరాల్లోని సదుపాయాలన్నీ ఇక్కడ కల్పిస్తున్నాం.
నిరుపేదల విజయ గాధలతో సంతృప్తి..
కమ్యూనిటీ సెంటర్ ఉన్నా కొందరు పట్టించుకోరు. కొందరు మాత్రం బాగా ఉపయోగించుకుంటారు. పది, ఇంటర్ పాసైన తర్వాత చదువుకోలేకపోయిన వాళ్లు; ఇంటర్ ఫెయిలై ఎందుకూ పనికిరారు అనుకున్నవాళ్లు శిక్షణ తర్వాత ఉద్యోగం సంపాదించుకుని ఇంట్లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇలాంటి విజయగాధలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మేం మొదట్లో ఇవన్నీ ఊహించలేదు. కానీ… ఇప్పుడు ఇవన్నీ తలచుకుంటే కలిగే ఆనందం అమూల్యం.

ఆ భార్యలు, భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు
గతంలో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలు కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వీళ్ల గాధలు వింటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఫౌండేషన్ విషయంలో మా ఇంట్లో అందరూ సహకరించారు. ఇలాంటి కమ్యూనిటీ సెంటర్లు ఎవరైనా ప్రారంభించొచ్చు. మా చారిటబుల్ ట్రస్ట్ కు ఫేస్‌బుక్ పేజ్ ఉంది. దాని ద్వారా ఎవరైనా ఎన్జీవోలు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సెంటర్ కార్యకలాపాలు పది మైళ్ల విస్తీర్ణంలోని గ్రామాల వారందరికీ అందిస్తున్నాం.

ఇలా చేస్తే ఎంతో తృప్తి
మా అమ్మ నాకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోయారు. నాన్న ఆరోజుల్లోనే హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఆయనకు ఎన్నో అవకాశాలు ఉన్నా, ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నారు. విద్యాశాఖ అధికారిగానూ పని చేశారు. తన జీవిత కాలంలో ఎందరికో ఎన్నో ఇచ్చారు. ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి దారి చూపారు. నాన్న తన కోసం ఎప్పుడూ ఏదీ ఆశించలేదు. ఆయన కోసమే ఈ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేశాను. చాలా మంది ఎన్నారైలకు కూడా ఇదే సలహా ఇస్తాను. మీరు విదేశాల్లో మంచి స్థితిలో ఉంటే.. మీ గ్రామాల్లో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. అది మీకు చాలా తృప్తి ఇస్తుంది.

అమ్మానాన్నలకి మనం ఏం ఇచ్చినా తక్కువే! కాబట్టి, వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలబడేలా ఒక మంచి పని చేస్తే ఎంతో సంతోషిస్తారు కదా అని అనిపిస్తుంది. మా నాన్నగారికి పెద్ద విల్లా కట్టించి ఇచ్చినా ఆయన ఇంత సంతోష పడేవారు కాదేమో! ఈ కమ్యూనిటీ సెంటర్ చూసి ఆయన చాలా ఆనందిస్తారు. మా తాత, నాయనమ్మ తిరిగిన ఈ నేల మీద ఎప్పటికి వారి పేరు నిలిచేలా చేయగలిగినందుకు సంతోషంగా వుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి! కుటుంబం అంతా కలసి ఆనందించటానికి ఎన్నో సందర్భాలు సృష్టించుకుంటాం. సేవా కార్యక్రమాలను కూడా అలాగే, కుటుంబం అంతా కలసి చేస్తే… అందరి మధ్య అనుభందం కూడా బలపడుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి!