
నాన్న నుంచే అలవాటు!
నాన్నకి సినిమా అంటే చాలా ఇష్టం. కానీ ఆయన దర్శకుడు కాలేకపోయారు. ఆ కలలన్నీ నాకు ఇచ్చారు కాబట్టి… ఇవాళ మీరు నన్ను దర్శకురాలిగా చూస్తున్నారు. అలాగని ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా నువ్వు దర్శకురాలివి కావాలి అని చెప్పలేదు. కానీ కలిసి సినిమా చూసేటప్పుడు, వాటి గురించి సాంకేతిక అంశాలెన్నో చెప్పేవారు. వాటి గురించి పుస్తకాలు, పత్రికలు చదివి చెప్పేవారు. నేను ఆయన కళ్లలోంచి సినిమాను చూసేదాన్ని. అప్పుడు కథ వెనుక మరో కథ కనిపించేది.

మాటలు వింటాను కానీ…
సినిమా రంగంలోకి ప్రవేశించిన అమ్మాయిగా ఇప్పటికీ రకరకాల మాటలు వింటూనే వస్తున్నాను. ఇవన్నీ కాస్త బాధపెట్టినా, సినిమాల మీద ఉన్న అభిరుచితో తట్టుకుని నిలదొక్కుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఆ చెప్పే సలహాల వెనుక ప్రేమ కూడా ఉంటుంది. కానీ వాళ్లకి అర్థంకాని విషయం ఏమిటంటే… నేను బయట ఎంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నా, దాంతో అది తృప్తి కలగదు. ఈ రంగంలో తిండీనిద్రా మానేసి 24 గంటలూ పనిచేసినా సంతోషంగా ఉంటుంది. ఇది కేవలం సినిమాలకే కాదు… సాధారణ జీవనశైలికి విరుద్ధంగా ఉండే ప్రతి రంగానికీ వర్తిస్తుంది.

గుస్సాడీ పరిచయం
మొదట్లో నాకు గుస్సాడీ గురించి తెలియదు. 2014లో మొదటిసారి ఆదిలాబాద్ వెళ్లినప్పుడు, అక్కడ వాళ్లు ఆ నృత్యం చేయడం చూశాను. అది ఏమిటి అని అర్థం కావడానికి కొన్నేళ్లు పట్టింది. అలాగే నా మీద వాళ్లకు నమ్మకం రావడానికి, బంధం బలపడటానికి చాలా సమయం పట్టింది. ఆ నృత్యాన్ని ఎలాగైనా లోకానికి తెలియచేయాలి అనే కోరిక మొదలైంది. డిస్కవరీ లాంటి చానల్స్ లో ఎక్కడెక్కడి సంగతులో కనిపిస్తాయి కాబట్టి మనవి మాత్రం ఉండవు. దాని గురించి బాధపడే కన్నా మనమే ముందడుగు వేస్తే మంచిది కదా అనిపించింది. అలాగని ఓ డాక్యుమెంటరీ తీస్తే సరిపోదు. వాటిని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపాలి. పైగా వాటి మీద డబ్బు పెద్దగ రాదు! కాబట్టి నేను బయట ప్రకటనలు చేసుకుంటూ, వాటి మీద వచ్చే ఆదాయం పొదుపు చేస్తూ దీన్ని కొనసాగించాను. చాలామంది సాంకేతిక నిపుణులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పని చేసేందుకు ముందుకు వచ్చారు. క్రౌడ్ ఫండింగ్ కూడా చేశాము. ప్రభుత్వం వైపు నుంచీ కొంత సహకారం లభించింది. మంచి పని చేస్తే ఎన్నో మార్గాల నుంచి సాయం లభిస్తుందని నేను ఈ స్వానుభవంతో తెలుసుకున్నాను.

ఇదీ గుస్సాడి చరిత్ర!
గుస్సాడీ ప్రస్తావన 2,500 ఏళ్ల నాటి సుత్తనిపాదలో కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్ లోని ఆదివాసులు… దీపావళి సమయంలో దండారీ అనే పండుగ చేసుకుంటారు. ఆ సందర్భంగా 9 రోజుల దీక్ష తీసుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్లను ఊరిపెద్దలే ఎంపిక చేస్తారు. అదే గుస్సాడి. ఒకసారి గుస్సాడీ అయితే కనీసం మూడేళ్లు కొనసాగించాలి. దాని కోసం ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. వారి వేషధారణ శివుని పోలి ఉటుంది. ఆ తొమ్మిది రోజులూ వాళ్ల శరీరం మీద బూడిద పూసి ఉంటుంది. ఒక ఊరి గుస్సాడీలు మరొకరి ఊరుకు వెళ్తారు. దాని వల్ల రకరకాల బంధాలు ఏర్పడతాయి. వారి చరిత్రను నృత్యం ద్వారా, పాటల ద్వారా పంచుకుంటారు. ఈ తొమ్మిది రోజులూ వారిని సాక్షాత్తు దేవునిగా భావిస్తారు. వారి కాళ్ల మీద పడి ఆశీస్సులు తీసుకుంటారు. వాళ్లు మన ఇంటికి వస్తే పావనం అయిపోతాం, ముట్టుకుంటే బాధలు తీరిపోతాయి, పెళ్లిళ్లు అవుతాయి, పిల్లలు పుడతారు… అనేంతగా నమ్ముతారు. ఆ గుస్సాడీలు ఎగురుతుంటే కలిగే స్పందన అద్భుతం. వాళ్లు నడుచుకుంటూ వెళ్తున్నా… ఆ గజ్జల చప్పుడు… ఎంతో దూరానికి వినిపిస్తుంది.
అదో కొత్త లోకం
వాళ్లతో ఉన్న సమయంలో నాకు అర్థం అయింది ఏమిటంటే… నగరాల్లో ఏ పని ఉన్నా లేకపోయినా చాలా బిజీగా ఉంటాం. కానీ అక్కడ జీవితానికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్లలో అత్యాశ అనేదే కనిపించదు. ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడం అక్కడ కనిపిస్తుంది. దాంతో సహనం కూడా చాలా పెరుగుతుంది. ఇండ్రియాలు స్తబ్దుగా మారిపోతాయి. మీరు సెల్ ఫోన్లకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటారు. నా జీవితంలో చూసిన అద్భుతమైన సూర్యాస్తమయాలు అక్కడివే! వాళ్ల దగ్గర నుంచి లభించే గౌరవం, ప్రేమలకు నేను చాలా రుణపడిపోయాను. అందుకే డాక్యుమెంటరీ కొసం ఇన్నాళ్లపాటు కష్టపడగలిగాము. దాని మీద ఓ డాక్యుమెంటరీతో పాటుగా కాఫీ టేబుల్ బుక్ కూడా రూపొందించగలిగాం. ఆ గుస్సాడీ పుస్తకం ద్వారా వచ్చే డబ్బులన్నీ ఆదివాసీల సంక్షేమ శాఖకు వెళ్తాయి.

ఎందుకు తెలుసుకోవాలి!
ఇలాంటి ఆచారాలు మన మూలాలు. మనం ఎంత సాధించినా ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే ఎలా! చాలా దేశాలు ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించి ఉండవచ్చు. దురదృష్టవశాత్తు… వాళ్లకు అంత గొప్ప సంస్కృతి లేదు. మన దగ్గర ఇంత గొప్ప సంస్కృతి ఉండటం ఎంత గర్వకారణమో కదా! కానీ అక్కడా చిన్నచిన్న మార్పులు వస్తున్నాయి. సెల్ పోన్ల దగ్గర నుంచీ వేషధారణ వరకు మారుతోంది. వాళ్ల మూలాలు చెరుగుతున్నాయి. మున్ముందు ఎవరన్నా… నా ఉనికి ఏమిటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లకు తెలియచేసేందుకు గుస్సాడీ డాక్యుమెంటరీ ఉండాలన్నది నా ఆశ!

కేన్స్ వరకూ వెళ్లిన షార్ట్ ఫిల్మ్
ఓసారి ‘గోవాలో ఓ డ్రైవర్ విదేశీ పర్యటకురాలిని కాపాడే ప్రయత్నం చేస్తూ చనిపోయాడు’ అని ఎక్కడో చిన్న వార్తగా వచ్చింది. ‘భారతదేశం సురక్షితం కాదు’ అనే శీర్షకలేమో మొదటి పేజీలో ఉండేవి. అతిథిదేవో భవ అని నమ్మే మన దేశంలో ఇలాంటి సందర్భాన్ని ఎలా మర్చిపోగలం. అందుకే దాని గురించే ఆలోచిస్తూ, చిన్నచిన్నగా ఓ కథను అల్లుకున్నాను. ఉదయాన్నే లేచి పేపరు చూడగానే… అన్నీ ప్రతికూలమైన వార్తలే కనిపిస్తే మనలో నిరాశ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇలాంటి మంచి విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ లఘుచిత్రం తీశాను.
టేకోవర్ అనే మరో డాక్యుమెంటరీ కోసం మణిరత్నం లాంటి ఎందరో ప్రతిభావంతులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్లందరిలో కనిపించిన ఓ ముఖ్యమైన అంశం, సినిమా పట్ల వారి అభినివేశం. కథలు చెప్పాలి, ఎవరన్నా సినిమా ద్వారా కథ చెబుతుంటే వారికి తమ నైపుణ్యం సాయపడాలి అన్న తపన వాళ్ల కళ్లలో, అనుభవాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

2017లో నా మొదటి తెలుగు సినిమా కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాను. ఆసియా నుంచి అక్కడికి వెళ్లిన తొలి మహిళా దర్శకురాలిని నేనేనేమో! అప్పటికే అక్కడ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ‘సినిమా తీస్తూ తీస్తూ పోయినా ఫర్వాలేదులే’ అనే మొండి ధైర్యంతో వెళ్లిపోయాను. ఆ సమయంలో శాంతిభద్రతల సమస్య రావడంతో కొంత షూట్ తర్వాత వెనక్కి రావాల్సి వచ్చింది. ఇవాళ మళ్లీ అవకాశం వచ్చినా, నేను మళ్లీ వెళ్తాను.
నా ప్రయాణంలో నేను తెలుసుకున్నాదా… మీ మనసు చెప్పేది వినండి. అది గట్టిగా కోరుకునే దిశలో ప్రయాణించండి!