
ఇంజినీరింగ్ చదివే రోజుల్లో చదువంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఓ మాదిరిగా చదివేవాడు అంటే ఉపాధ్యాయులకు ఆసక్తి ఉండదు. అల్లరి చేయకుండా ఉంటే అమ్మాయికు ఆసక్తి ఉండదు. అలా ఒంటరిగా ఉంటున్న సమయంలో బాపట్ల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాడిని. అలా వెళ్తూవస్తూ ఉన్న సమయంలో… ఎప్పుడో నా మిత్రుడు అన్న మాటలు గుర్తుకువచ్చాయి. ‘నువ్వు బోర్ కొడతావు. అందుకే నీతో ఎవరూ మాట్లాడరు. మాట్లాడితే భక్తి లేదా దేశభక్తి పాటలు అంటావు కానీ పాటలు అంటే రొమాంటిక్ గా ఉండాలి పాటలు. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పాట ‘పూతవేసిన లేతమావిని’. నా తొలి ప్రణయ గీతం అది.
ఎప్పుడైనా ప్రకృతిని గుర్తుచేసుకున్నప్పుడు మన బాల్యంలో అంతర్లీనంగా చూసిన దృశ్యాలే గుర్తుకువస్తాయి. మీరు ఎన్ని దేశాలు తిరిగినా… సూర్యోదయం అనగానే మీ చిన్నప్పుడు పొద్దునే లేచినప్పుడు కనిపించిన సూర్యోదయమే గుర్తుకువస్తుంది. కాకపోతే దాన్ని వర్ణించేందుకు అప్పుడు పదాలు లేకపోవచ్చు. కానీ పదాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశమే గుర్తుకుస్తుంది.

పాట.. అందరి బాట!
ఒక కథని దృశ్యకావ్యంగా మలచడం, ఆ సినిమాలో ఉన్న 24 విభాగాల బాధ్యత. ఒక పాత్రకు ఎలాంటి సంగీతం కావాలి అని దర్శకుడు తన కీబోర్డు ద్వారా వినిపిస్తారు. దానికి కావల్సిన లైటింగ్, నృత్యం, ఆహార్యం… ఇలా ప్రతి సాంకేతిక నిపుణుడూ ఆ సన్నివేశాన్ని సొంతం చేసుకుని, తనకు వచ్చిన భావంతో దాన్ని చూపిస్తాడు. అలాగే రచయిత కూడా తనకు వచ్చిన భాషతో దానికి కావల్సిన పాటలు ఇస్తాడు. హీరో ఎలా అయితే కన్నుతో నటిస్తాడో, రచయిత పెన్నుతో నటిస్తాడు.
ఎలా రాస్తానంటే!
ఇక కవిగా చూస్తే.. మనకు రెండు పార్శ్వాలు ఉంటాయి. మన మెదడులోనూ కుడివైపు సృజన, భావోద్వేగాలకు స్థానమనీ…. ఎడమ వైపు తర్కానికీ, విశ్లేషణకూ స్థానం అని చెబుతారు. మనం లింగ బేధం అనుకునేది కూడా కేవలం మన కండరాలతోనే సరి. ప్రతి మనిషిలోనూ స్త్రీ,పురుషులు ఇద్దరూ ఉంటారు. మన కుడివైపు మెదడు స్త్రీత్వంను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దాన్ని మేల్కొలిపితే కవిత్వం, ముఖ్యంగా అమ్మాయి మనసు ఉన్న కవిత్వం వస్తుంది. యోగభాషలో ఇడపింగళ నాడులు అంటారు. అసలు యోగం అంటే కలయిక కదా! మెదడులోని ఈ కుడి, ఎడమ పార్శ్వాలను అనుసంధానం చేసుకుంటూ ఓ సమన్వయం చేసుకోగలిగితే… సుషుమ్న నాడిని చేరుకోగలం. ఆ సమతను చేరుకున్నాడు కాబట్టే శివుని, అర్ధనారీశ్వరుడు అంటారు.

ఇంకేమింకేం కావాలే… వెనుక ఓ సరదా కథ
ఈ బాణీకి ఎలా రాయొచ్చా అని రెండు మూడు పదాలు అనుకుంటాం కదా! అలా రెండు మూడు పదాలు రాసిన తర్వాత అవి సరిపోవు, ఇంకా ఏమన్నా రాద్దామా అనుకుంటూ… ఇంకేమింకేం కావాలే అని వచ్చేసింది. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలాకాలంగా మన పాటలు ఒక పల్లవి, రెండు చరణాలు అనే నిర్మాణంలో ఉండేవి. ఈ మధ్య హుక్ లైన్ మోజులో పడి ఈ సంప్రదాయాన్ని మర్చిపోయారు. తెలుగు పాట ఈ ఫార్మాట్ వదలకూడదు అనే సందేశాన్ని కూడా ఈ పాట ఇస్తుంది. భవిష్యత్తులో వచ్చే స్వరకర్తలకు కూడా నా విన్నపం ఇదే.

ఇళయరాజాతో…
నా సంగీత ప్రయాణంలో ఎంతో గొప్ప సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్లలో ఇళయరాజా ఒకరు. ఆయనతో పనిచేయక ముందు చాలామంది, ఆయనకు కోపం ఎక్కువ అంటూ భయపెట్టారు. తీరా నేను అక్కడికి వెళ్లేసరికి… నన్ను ఓ కొడుకునో, మనవడినో చూసినంత గారంగా చూశారు. తప్పు ఉన్నా… ప్రేమగా సరిదిద్దారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నవాటిలో ముఖ్యమైంది- వేగం! ‘ఏ మాయ చేశావే’ సినిమాకు రెండు రోజుల్లో రోజుకు గంట కూర్చుని ఎనిమిది ట్యూన్లు ఇచ్చారు. మళ్లీ వారానికి రికార్డింగ్ అన్నారు. పాటకు ఒక్క రోజు కూడా సమయం లేదు. ఆ చిత్ర దర్శకుడు గౌతం మీనన్ కూడా ఏమీ చేయలేనని చెప్పేశారు. దాంతో రోజూ బీచ్ లో కూర్చుని ఎనిమిది రోజులూ ఎనిమిది పాటలు రాశాను. అవన్నీ కూడా ప్రజాదరణ పొందడం విశేషం.

జీవితాన్ని ఎలా చూడాలి!
నేను ఒకసారి సంక్లిష్టమైన సంస్కృత భాషలో ఓ పద్యం రాసి మిత్రులకు పంపాను. దాని అర్థం ఏమిటి అని అడిగితే… ‘దానికి అర్థం ఏమీ లేదు. నాకు గుర్తుకువచ్చిన సంస్కృత పదాలన్నీ ఒక చోటకు చేర్చి పంపాను. జీవితం కూడా ఇంతే! ఉన్న జీవితాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత ఆస్వాదించాలి’ అని చెప్పాను. జీవితాన్ని ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా బాధే మిగులుతుంది. ఎందుకంటే చదవడానికి జీవితం ఓ గ్రంథం కాదు… అది ఓ అనుభవం. కాకపోతే అది లయబద్ధంగా ఉండాలి. దేవుడి సృష్టి ఎలాగైతే చీకటి నుంచి వెలుగు వరకూ లయబద్ధంగా నడుస్తుందో, అలాగే మన జీవనవిధానంలో కూడా ఓ లయ ఉండాలి.
సినిమానే ఆశ, శ్వాస!
నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఓ సంభాషణ గుర్తుకువస్తుంది. ‘నాకు చదువంటే ఇష్టం లేదు, సినిమాల్లోకి వెళ్తాను’ అంటే నువ్వు ఎలా వెళ్తావు అని అడిగారు. దానికి నేను ‘నాకు రెహ్మాన్, కీరవాణి… ఇలా అందరి ఇళ్లకు వెళ్లి కాళ్లు నొక్కే పని ఇమ్మని అడుగుతాను. ఆ సమయంలో ఓ పదమో, పాటో ఏదో ఒకటి పాడితే… చిన్నపాటి అవకాశం ఇస్తారేమో. దానికి పెద్ద దారి ఏముంది’ అని జవాబిచ్చాను. నాకు అంత భక్తిభావం ఉంది కాబట్టి… వాళ్లను గౌరవించడానికి నేను ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన పనిలేదు. ఆ భావం మన నడవడిలో తెలుస్తుంది కాబట్టి, వాళ్లకూ మనం అంటే అభిమానం ఏర్పడుతుంది.

కొన్ని మాటలు…
– మనిషి ఎంత గొప్పవాడైతే, ఆయనతో పని చేయడం అంత సులభం అని రెహ్మాన్ గారి దగ్గర నేర్చుకున్నాను.
– అనువాద చిత్రాలకు పనిచేసినా, సొంతగా పాటలు రాసే ప్రయత్నం చేస్తాను. ఏం మాయ చేశావే విషయంలో తమిళంతో పని లేకుండా నా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
– నేను వచ్చినప్పుడు కేసెట్లో ట్యూన్స్ ఇచ్చేవారు, తర్వాత మెయిల్స్, తర్వాత వాట్సాప్… ఇలా అన్నిరకాల అనుభవాలూ చూడగలగడం అదృష్టంగానే భావిస్తున్నాను.