
చాలాసార్లు అలాగే జరుగుతుంది. ఒక లక్ష్యం అనుకున్నాక… పరిస్థితుల్నీ మనకి పరీక్ష పెట్టేందుకు సిద్ధమైపోతాయి. పర్సు ఖాళీ అవుతుంది, కుటుంబ కష్టాలు పలకరిస్తాయి, అనారోగ్యం వెన్నాడుతుంది. వాటికి జంకి వెనకడుగు వేస్తే జీవితం బాగానే ఉంటుందేమో. కానీ దానికి విలువ ఇచ్చే విజయం మాత్రం చేజారిపోతుంది. సవాళ్లను కూడా ప్రయాణంలో భాగంగా అంగీకరించినప్పుడే… ప్రపంచం తల తిప్పుకొని చూసే సాధన మన సొంతమవుతుంది. అందుకు సాక్ష్యమే ఈ లవ్లీనా బోర్గోహైన్ కథ!
అది అసోంలోని గోలాఘట్ అనే జిల్లా. 1997లో గాంధీ పుట్టిన అక్టోబర్ 2 న జన్మించింది లవ్లీనా. అప్పటికే తనకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ‘మళ్లీ ఆడపిల్ల పుట్టింది’ అనగానే కొందరి నవ్వు మాయమవుతుంది. మరికొందరి నోళ్లకి పనిపడుతుంది. సుతిమెత్తని పరామర్శలతోనే సూటిపోటి మాటలు మొదలవుతాయి. బహుశా ఆమె తండ్రి టికెన్ బోర్గోహైన్ కూడా ఇవన్నీ విని ఉంటాడు. కానీ తను పట్టించుకునే రకం కాదు. పైగా పిల్లలు కిక్ బాక్సింగ్ ఇష్టపడుతున్నారని తెలిసి వారికి అండగా నిలిచాడు.
లవ్లీనా తండ్రికి ఓ చిన్న వ్యాపారం ఉండేది. కానీ అంత లాభసాటిగా ఉండేది కాదంట. దాంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగానే ఉండేది. అయినా సరే, తన కూతుళ్ల శిక్షణను ప్రోత్సహించేవాడు. ఆయన ఆశించినట్టుగానే పెద్ద కూతుళ్లు ఇద్దరూ జాతీయ స్థాయికి చేరుకున్నారు. కానీ అక్కడితో ఆగిపోయారు. చిన్న కూతురు లవ్లీనా అలా కాదు! కిక్ బాక్సింగ్ కంటే సాధారణ బాక్సింగులో నిలదొక్కుకునే అవకాశం ఎక్కువ అని గ్రహించింది. పంథా మార్చుకుని అడుగు ముందుకు వేసింది. క్రీడా సమాఖ్యల దృష్టిలో పడటంతో మెరుగైన శిక్షణ లభించింది. కానీ అక్కడితో కథ పూర్తవలేదు. కష్టాలే మొదలయ్యాయి.

లవ్లీనాకు శిక్షణ ఇచ్చినా, దాన్ని నిలబెట్టుకుని విజయాలు సాధిస్తున్నా… అధికారులకు కాస్త చిన్నచూపే ఉండేది. 2018 కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు తనను ఎంపిక చేసినా, ఆ విషయాన్ని కూడా ఆమెకు తెలియచేయలేదు. స్థానిక మీడియా ద్వారానే తన ఎంపిక గురించి తెలుసుకుంది లవ్లీనా! తన అనూహ్య విజయాలతో ఒలంపిక్స్ లో పాల్గొనే అర్హత వచ్చింది. అందుకు మెరుగైన శిక్షణ కోసం యూరప్ కు వెళ్లే అవకాశం వచ్చింది. దురదృష్టం! విమానం ఎక్కే ముందు కొవిడ్ పాజిటివ్ అని తేలి… ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం లవ్లీనా తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.
ఎన్నో సమస్యల మధ్య లవ్లీనా టోక్యో ఒలంపిక్స్ లోకి అడుగుపెట్టింది. తన మీద ఎవ్వరికీ అంచనాలు లేవు. కానీ ఆరంభం నుంచే అదరగొట్టింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న చైనా బాక్సరును మట్టికరిపించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడిక మెడల్ గ్యారెంటీ! కాంస్య వచ్చినా చాలు అని జనం అనుకుంటున్నారు. కానీ తన గురి స్వర్ణం పైనే ఉంది.
జీవితంలో ప్రతి కష్టాన్నీ బాక్సింగ్ రింగులో ప్రత్యర్థిగా భావించి, పంచ్ అదరగొట్టిన లవ్లీ దృక్పధానికి సెల్యూట్!
#lovlinaborgohain #lovlinaolympics #lovlinaboxing #olympics2021 #olympicsindia #olympicsboxing #talradio #touchalife #inspiration #motivation