
మన గుండె కూడా ఎడమవైపే ఉంటుంది కాబట్టి ఎడమచేతి అలవాటు ఉన్నవాళ్లు కాస్త ప్రత్యేకమే అనే మాట ‘మహానటి సావిత్రి’ సినిమాలో వినిపిస్తుంది. సావిత్రే కాదు… గాంధీ, టెండుల్కర్ లాంటి ప్రముఖులెందరో లెఫ్ట్ హాండర్సే! కానీ వాళ్ల పట్ల ప్రపంచం ఎంత క్రూరంగా ఉంటుందో ఎప్పుడన్నా ఆలోచించారా! ప్రపంచం ఏమిటీ.. క్రూరంగా ప్రవర్తించడం ఏమిటీ అనుకుంటున్నారా! అయితే ఓసారి ఇది చదవండి…
మనిషి నాగరికత అంతా కుడిచేతి వాటానికే అనుగుణంగా కనిపిస్తుంది. కారు స్టీరింగ్ దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా వారికే అనుకూలంగా ఉంటుంది. వాటి వల్ల ఎడమచేతి వాటం ఉన్నవారు తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కొనే సందర్భాలు లక్షల్లో ఉన్నాయి.

ఎడమచేతి వాటం ఉన్నవారిని శుభ్రత లేనివాళ్లుగా భావిస్తుంటారు. ఒకప్పుడు వాళ్లని మంత్రగాళ్లుగా, సైతాను శిష్యులుగా కూడా అనుమానించేవారట. ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అంటే ఎడమచేయి అని అర్థం! దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవాళ్లని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు.
ఇంతకీ ఈ ఎడమచేతి వాటానికి కారణం ఏమిటి? అన్న అనుమానం మాత్రం చాలారోజుల నుంచి శాస్త్రవేత్తలను వేధిస్తోంది. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని ఈమధ్యే శాస్త్రవేత్తలు తేల్చారు.

ఒకప్పుడు ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేతి అలవాటు ఉన్నవారితో సరిసమానంగా ఉండేవారట. కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటోందని… ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం వాటా తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. అది కూడా కుడిచేతికే అనుకూలంగా ఉండటంతో… కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది.
ఎడమ చేతివాటం వల్ల కొన్ని లాభాలూ లేకపోలేదు. ఉదాహరణకు క్రికెట్, బేస్బాల్ లాంటి ఆటల్లో ఎడమచేతి ఆటని అంచనా వేయడం కష్టం అయిపోతుంది. ఇక ఎంతవరకు నిజమో కానీ పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా ఓ నమ్మకం. కాబట్టి ఎడమచేతి వాటం ఉన్నవారిని తక్కువగా చూడవద్దనీ… ఒకవేళ ఇంట్లో పిల్లలు ఎడమచేతి వాటం చూపిస్తుంటే వారిని అలవాటు మార్చుకునేందుకు బలవంత పెట్టవద్దనీ సూచిస్తున్నారు నిపుణులు.
#lefthand #leftnandedness #talradio #touchalife #talfb