
ఇక నా వల్ల కాదు- ఇది నేను సాధించలేను- ఈ పని ఎవరో గొప్పవాళ్లు మాత్రమే చేయగలరు… లాంటి మాటలు దగ్గర చాలామంది ఆగిపోతూ ఉంటారు. వాటిని దాటుకుని ముందుకు వెళ్లినవాళ్లు తాము కూడా నమ్మలేని అద్భుతాలను సాధిస్తారు. 17 ఏళ్ల సమీర్ బెనర్జీ విషయంలో కూడా అదే జరిగింది. తను వింబుల్డన్ జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాను అని తెలియగానే ఒక్క క్షణం తనని తాను నమ్మలేకపోయాడు. ఆశ్చర్యంతో తల పట్టుకుని టెన్నిస్ కోర్టులో నిలబడిపోయాడు.
సమీర్ బెనర్జీ తండ్రిది అసోం, తల్లిది ఆంధ్రప్రదేశ్. 1980ల్లోనే వాళ్లు అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. సమీర్‌కు చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే ఇష్టం. చేతిలో రాకెట్ ఉంటే తన పంచప్రాణాలు అరచేతిలోకి వచ్చినంత ఉద్వేగంగా ఉండేది. తన జీవితం టెన్నిస్ కోర్టు మీద పరుచుకున్నట్టే కనిపించేది. సమీర్ ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు, అతను టెన్సిస్ నేర్చుకోవడానికి కావల్సిన శిక్షణ ఇప్పించారు. ఆసక్తి ఉన్నవాడికి ఆ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలు కదా!

ఈ ఏడాది మొదట్లో సమీర్ ఫ్రెంచ్ ఓపెన్ లో అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మొదటి రౌండులోనే నిష్క్రమించాల్సి వచ్చింది. కానీ కుంగిపోలేదు. తను కప్పు గెలవాలనో, ప్రైజ్ మనీ కోసమో టెన్నిస్ ఆడటం లేదు. ఆ ఆట తనకి ప్రాణం. అది ఆడటమే ఓ గెలుపు. అందుకే వింబుల్డన్ లో ప్రయత్నించాడు. ఎవరూ ఊహించని విధంగా గెలుపు సాధించాడు. రెండు straight sets తన ప్రత్యర్థి విక్టర్ లిలోవ్ ను ఓడించాడు. జూనియర్ వింబుల్డన్ గెలుచుకున్న నాలుగో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
‘సమీర్ బెనర్జీ! ఈ పేరును గుర్తుంచుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇతనే పురుషుల ఛాంపియన్ అవుతాడేమో!’ అంటూ వింబుల్డన్ తన అధికారిక ట్విట్టరులో ప్రకటించింది. గుర్తుంచుకోక పోయినా ఫర్వాలేదు. సమీర్ తన పని తను చేసుకుపోతుంటాడు. మరో సంచలనం సృష్టించి… తెలుసుకుని తీరాల్సిన వ్యక్తిగా నిలుస్తాడు.
#jrwimbledon #wimbledonjunior #samirbanerjee #touchalife #talradio