
కష్టం ఓ అనుకోని అతిథిలాంటిది. అది చెప్పి రాదు. సమయం, సందర్భం చూసుకోదు. మన జీవితం సాఫీగా సాగిపోతోంది కదా అని జాలిపడదు. ఎందుకంటే దానికి విచక్షణ లేదు. కానీ మనిషికి ఉంది. అందుకనే కష్టం వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలి. వీలైతే దాన్ని ఎదుగుదలకు మార్గంగా మార్చుకోవలి. ఎలా అంటారా. ఇలా!
1912లో న్యూజెర్సీలో పుట్టిన నార్మన్ కజిన్స్ అంచెలంచెలుగా ఎదిగినవాడు. ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరి ఏకంగా మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి చేరుకున్నాడు. ప్రముఖ జర్నలిస్టుగా, రచయితగా నార్మన్ పేరు ఆ రోజుల్లో మార్మోగిపోయింది. అలాంటి సమయంలో ఓ అనూహ్యమైన వార్త వినిపించింది.
నార్మన్ కు Ankylosing spondylitis అనే అరుదైన వ్యాధి సోకినట్టు తేలింది. అప్పట్లో దానికి చికిత్స లేదు. దాని నుంచి బతికి బయటపడటం అసాధ్యంగా ఉండేది. ‘ఇంకొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు. వెళ్లే లోపల పూర్తిచేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే చూసుకో’మని’ చెప్పేశారు వైద్యులు. అప్పటికి నార్మన్ వయసు 49 ఏళ్లే!

నార్మన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. వ్యాధి కలిగిస్తున్న బాధ, దాంతో చావు తప్పదనే వ్యధ… రెండు తనని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అలాంటి పరిస్థితిలో ఓ రోజు తనకి ఓ ఆలోచన వచ్చింది. అనారోగ్యంతో పాటు బాధ, భయం లాంటి ప్రతికూల భావనలు కలిసి వస్తున్నప్పుడు అందుకు విరుగుడుగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తే! అప్పుడు ఆరోగ్యం కూడా దానంతట అదే వస్తుందేమో కదా అనిపించింది. ఒకవేళ సంతోషంతో తన ఆరోగ్యం మెరుగుపడకపోయినా, చివరిరోజులు ప్రశాంతంగా ఉంటాను కదా అనుకున్నాడు.
వెంటనే నార్మన్ ఓ హోటల్ గది అద్దెకు తీసుకున్నాడు. అందులో ఓ సినిమా ప్రొజెక్టరు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఒకటే పని. ఆ ప్రొజెక్టరులో కామెడీ సినిమాలు వేసుకుని నవ్వుతూ రోజులు గడపడం. మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం. ఆశ్చర్యం! కొన్నాళ్లకి నార్మన్ వ్యాధి మాయమైపోయింది. కొద్ది రోజులే బతుకుతావని చెప్పిన లోకం ముందు మరో 26 ఏళ్లు హాయిగా నవ్వుతూ గడిపాడు. తన అనుభవాలతో ‘అనాటమీ ఆఫ్ యాన్ ఇల్ నెస్’ అనే సంచలనాత్మక పుస్తకం కూడా రాశాడు.
ఇదంతా నార్మన్ అదృష్టమో, అనుకోని పరిణామమో కాదని తర్వాత జరిగిన పరిశోధనలు తేల్చాయి. నవ్వడం వల్ల మనలోని సానుకూలమైన హార్మోన్లు మెరుగుపడతాయనీ, రోగనిరోధకశక్తిని పెంచే T కణాలు వృద్ధి చెందుతాయనీ… ఇలా ఎన్నో లాభాలు తేలాయి. మరెందుకాలస్యం… పరుగులు తీసే రోజువారీ జీవితానికి కాస్త నవ్వు జోడించి చూడండి. నవ్వితే పోయేదేముంది… కాస్త అనారోగ్యం, మరికాస్త నిరాశ, ఇంకొంత ఒత్తిడి. నవ్వండి బాస్!
#laugh #smile #normancousins #talradio #touchalife