
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ… దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు రాజ్మల్ మీనా! తన వయసు 33 ఏళ్లు. పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా. తన జీతమే ఆ కుటుంబానికి ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ గురించి కలలు కనడం కష్టమే. ఉన్నదానిలో ఎలా సర్దుకుపోవాలనేదే సమస్య. కానీ రోజూ తన కళ్ల ముందు నుంచి వెళ్లే వందలమంది విద్యార్థులను చూసిన రాజ్మల్ కు… తన గతం గుర్తుకొచ్చేది.
రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన రాజ్మల్ కి చదువంటే చాలా ఇష్టం. క్లాసులో ఎప్పుడూ తనే ఫస్ట్ వచ్చేవాడు. ఇంటర్మీడియట్ లోనూ మంచి మార్కులు సాధించాడు. డిగ్రీ చేయాలనేది తన కలగా ఉండేది. పేదరికంతో అది సాధ్యం కాలేదు. తండ్రికి ఉన్న అప్పుల భారాన్ని తలకెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లు రోజువారీ కూలీగా పనిచేశాడు. ఆ డబ్బులు కూడా చాలకపోవడంతో… దిల్లీకి వచ్చాడు. 2014లో యూనివర్శిటీ దగ్గర సెక్యూరిటీ గార్డుగా చేరాడు. చదువు మీద ప్రేమతో కరస్పాండెన్స్ ద్వారా డిగ్రీ పూర్తిచేశాడు. అయినా ఏదో వెలితి. ఓ పెద్ద కాలేజీలోకి పుస్తకాలు పట్టుకుని అడుగుపెట్టాలనే తన ఆశ నెరవేరనేలేదు. తనకి ఇష్టమైన రష్యన్ భాష నేర్చుకోవాలనే తన కోరిక తీరనేలేదు. రష్యన్ భాషలో డిగ్రీ చేసి ఆ దేశానికి వెళ్లాలనేది తన లక్ష్యం.

చదువు ఉద్యోగానికి అర్హత మాత్రమే కాదు, అది పేరు పక్కన హోదా మాత్రమే కాదు… ఆత్మవిశ్వాసానికి తోడయ్యే ఆయుధం. నచ్చిన విషయం మీద పట్టు సాధించి పెట్టే పరికరం. ఆ విషయం రాజ్మల్ కు బాగా తెలుసు. అందుకే తను చదివే విశ్వవిద్యాలయంలోనే రష్యన్ భాషలో డిగ్రీ చేయాలనుకున్నాడు. దానికి జరిగే ప్రవేశ పరీక్ష చాలా కష్టంగా ఉంటుందని తెలుసు. అందుకనే డ్యూటీ పూర్తయ్యాక గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. కాలేజీ విద్యార్థులు ఇచ్చే పేపర్లు, పుస్తకాలతోనే నెట్టుకొచ్చేవాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు. పరీక్షలో నెగ్గాడు. తను సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన చోటే విద్యార్థిగా అడుగుపెట్టాడు. అనుమానం లేదు… తను త్వరలోనే రష్యాకి కూడా వెళ్తాడు. ఎందుకు వెళ్లలేడు. సాధించలేని లక్ష్యం అంటూ ఉంటుందా! ఆ పట్టుదల ముందు ఏ పరిస్థితులైనా నిలవగలవా?
#talradio #touchalife #talfb #rajmalmeena