
అడగందే అమ్మయినా పెట్టదు అని ఓ సామెత. అది ఏ కష్టమూ లేనప్పుడు. ఓ మనిషి ఆకలితో ఉన్నాడని గ్రహిస్తే చాలు… అమ్మే కాదు ఎవరైనా కడుపు నింపడానికి సిద్ధపడిపోతారు. ఆ మానవత్వమే ఈ కొవిడ్ సమయంలో ప్రపంచాన్ని ఆదుకుంది. అందుకు ఓ ఉదాహరణే అజర్ మక్సుసీ. ఇప్పటి వరకూ హైదరాబాద్ వాసులకు మాత్రమే తెలిసిన ఈ యువకుడి పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ తెలిసింది. ఇంగ్లండ్ ప్రభుత్వం ఆయన సేవను గుర్తించి Commonwealth Points of Light award కు ఎంపికచేసింది.
అజర్ మక్సుసిది హైదరాబాదులోని ఓ సాధారణ కుటుంబం. కష్టాలతో పాటే పెరిగిన జీవితం తనది. నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఎలాగొలా చదువుకుని ఎదుగుదామనుకునే సమయంలో… పేదరికం కమ్మేసింది. కుటుంబానికి అండగా నిలబడటం కోసం పదేళ్ల వయసు నుంచే కూలి పనులు చేయాల్సి వచ్చింది. ప్లాస్టర్ వ్యాపారంతో ఎలాగొలా నిలదొక్కుకున్నాడు కానీ తను ఇంకా మధ్య తరగతి మనిషే! అలాంటి సమయంలో జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని మలుపు తప్పింది.

తొమ్మిదేళ్ల క్రితం అజర్ ఓ ఫ్లై ఓవర్ కింద ఉన్న మహిళను చూశాడు. తనకి రెండు కాళ్లూ లేవు. తనని తాను పోషించుకోలేక, ఆకలితో అల్లాడిపోతోంది. ఆమెని చూసిన అజర్ కి తన చిన్నప్పటి ఆకలి రోజులు గుర్తొచ్చాయి. వెంటనే తనకి ఆహారం అందించాడు. ఆ కాస్త అన్నమూ… తన జీవితాన్ని నిలపడం చూసి అదే తన సేవగా మార్చుకున్నాడు. అప్పటి నుంచీ ప్రతి రోజూ వందల మందికి ఆహారాన్ని అందిస్తున్నాడు.
‘Hunger has no religion’ అనే బ్యానర్ ఉన్న వాహనంలో ఆహారాన్ని నింపుకొని… రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంటాడు అజర్. తనంతట తను ఎవరినీ ఈ పని కోసం డబ్బులు ఇవ్వమని అడిగింది లేదు. దాతలే ఎప్పటికప్పుడు ముందుకొస్తుంటారు. అన్నదానం కోసం సరిపడా డబ్బులు లేని రోజు అప్పు చేసో, షాపులో వస్తువులు అమ్ముకునో తన సేవని కనసాగించాడు. లాక్ డౌన్ సమయంలో తన బాధ్యత మరింత పెరిగిందని గ్రహించి… రోజూ వేల మందికి ఆహార పొట్లాలనీ, మాస్కులనీ అందించాడు. ఇంత సేవ చేయడానికి ప్రేరణ ఏమిటి అని అడిగితే ‘మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. మానవత్వమే అన్నింటికంటే గొప్ప చదువు’ అని గ్రహించడమే నా స్ఫూర్తి అని చెబుతాడు.
#azharmaqsusi #hungerhasnoreligion #commonwealthaward #touchalife #talradio #talfb