
1922లో దిలీప్ కుమార్ పాకిస్తాన్ లో పుట్టారు. దేశవిభజన తర్వాత ఇండియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంది వాళ్ల కుటుంబం. దిలీప్ కుమార్ తండ్రి ఓ పండ్ల వ్యాపారి. మంచి ఆస్తులే ఉన్నాయి. కానీ ఎందుకనో తండ్రీ కొడుకుల మధ్య అంతగా పొసిగేది కాదు. 12 మంది పిల్లలున్న పెద్ద కుటుంబంలో వారి మధ్య సఖ్యత సాధ్యం కాలేదు. అలా ఓసారి తండ్రితో గొడవపడిన దిలీప్ ఇల్లు వదిలి పారిపోయాడు. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలా రోజులు దేశదిమ్మరిలా తిరిగాడు.
దిలీప్ ఓరోజు అనుకోకుండా ముంబైలోని ‘బాంబే టాకీస్’ స్టూడియోలో అడుగుపెట్టాడు. అక్కడ తనని చూసిన దేవికా రాణి అనే హీరోయిన్, సినిమాల్లో ప్రయత్నించమని సూచించింది. ‘నేను సినిమాల్లో నటించడం ఏమిటి?’ అనుకోలేదు దిలీప్. దాన్ని ఓ మంచి అవకాశంగా భావించాడు. నటనలో తనకంటూ ఒక సొంత శైలితో దర్శకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. అలా 1944లో ‘జ్వర్ భటా’ అనే సినిమా వచ్చింది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినా దిలీప్ పట్టు విడవలేదు. హిట్ కొట్టే దాకా ప్రయత్నిస్తూనే వచ్చాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిపోయాడు.

దిలీప్ యాక్టింగ్ అప్పటి నటులకు పూర్తి భిన్నంగా సహజంగా ఉండేది. అందుకనే సత్యజిత్ రే లాంటి దర్శకులు కూడా తనని అతి పెద్ద స్టార్ అంటూ మెచ్చుకునేవాళ్లు. ఆ ప్రశంసలతో పాటే అవకాశాలు కూడా వచ్చి పడేవి. బాలీవుడ్ లో లక్షరూపాయల పారితోషికం తీసుకున్న తొలి నటుడిగా నిలిచాడు దిలీప్.
అలాగని తన కెరీర్ ఏమీ దూసుకుపోలేదు. ఎప్పటికప్పుడు తీవ్రమైన పరాజయాలు పలకరించేవి. అయితేనేం! ఇక దిలీప్ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారీ తన సత్తా చాటుకునేవాడు. అయిదు దశాబ్దాలుగా పడుతూ లేస్తూ తను గొప్ప నటుడినని నిరూపించుకుంటూనే ఉన్నాడు. అందుకనే ఓ వంద సినిమాలు కూడా దాటని దిలీప్ కెరీర్ లో దేవదాస్, ముగలే ఆజమ్, గంగా జమునా, సౌదాగర్… లాంటి క్లాసిక్స్ ఎన్నో ఉండిపోయాయి. ఒకసారి ఏకంగా అయిదేళ్లు బ్రేక్ తీసుకుని మరీ సూపర్ హిట్ కొట్టారు దిలీప్.

ఏ అనుభవం, నేపధ్యం లేని దిలీప్ అంత గొప్ప నటుడు ఎలా అయ్యాడు? కారణం ఒకటే! తను చేసే పనిలో ఒదిగిపోయేవాడు. ట్రాజెడీ సినిమాల్లో తను ఎంతగా లీనమైపోయేవాడంటే… ఓసారి ఏకంగా డిప్రెషన్లోకి జారిపోయారట. దాంతో ఇక మీదట అలాంటి పాత్రలు చేయవద్దంటూ వైద్యులు సూచించాల్సి వచ్చింది. దిలీప్ తను మాత్రమే ఎదిగితే సరిపోతుంది అనుకోలేదు. కాదర్ ఖాన్ లాంటి ఎంతోమంది నటులను ప్రోత్సహించారు, సేవ కోసం ఎక్కడ కార్యక్రమం జరిగినా అందులో ముందుండేవారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా… అన్నీ తట్టుకున్నారు.
దిలీప్ కుమార్ ఇక లేరు. ఆయన ట్రాజెడీ సినిమాలు ఇప్పటి తరానికి నప్పకపోవచ్చు. కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో, పరాజయాలని దాటి తనని తాను నిరూపించుకోవడంలో ఎప్పటికీ తన జీవితం ఓ వ్యక్తిత్వ వికాస సూత్రమే!
#dileepkumar #talradio #touchalife #talfb #talstories